న్యూఢిల్లీ: భారత ఎకానమీ వృద్ధికి ద్రవ్యోల్బణం, లిక్విడిటీపరమైన రిస్కులు పొంచి ఉన్నాయని డీబీఎస్ బ్యాంక్ వెల్లడించింది. ఇంధనాల ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటం, కఠినతర ఆర్థిక పరిస్థితులు మొదలైన అంశాల వల్ల కార్యకలాపాలపై ప్రభావం పడనుందని పేర్కొంది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వృద్ధి ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావొచ్చని డీబీఎస్ బ్యాంక్ ఈడీ, సీనియర్ ఎకానమిస్ట్ రాధికా రావు విశ్లేషించారు.
2026 ఆర్థిక సంవత్సర వృద్ధి గణాంకాలను 7.8 శాతానికి సవరిస్తూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి సగటున 7.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వస్తు, సేవల పన్నుల వసూళ్లు, ఈ–వే బిల్లులు, విద్యుత్ డిమాండ్, డిజిటల్ చెల్లింపులు పటిష్టంగా ఉన్నాయని..కాకపోతే ద్రవ్యోల్బణం కీలక రిసు్కగా మారుతోందని చెప్పారు. వర్షపాతం సగటు స్థాయి కంటే తక్కువగా ఉండటం, ఎల్ నినో రిసు్కలు పెరగడం వల్ల పంటల దిగుబడిపై ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చని రాధికా రావు వివరించారు.


