భలే వాడివి బాసూ! | Trending: UAE Boss Surprises Employees With iPhones Video Viral | Sakshi
Sakshi News home page

ఐఫోన్ల పేరిట సర్‌ప్రైజ్‌.. భలే వాడివి బాసూ!

Sep 25 2026 12:55 PM | Updated on Sep 25 2026 1:19 PM

Trending: UAE Boss Surprises Employees With iPhones Video Viral

ఉద్యోగులకు బహుమతులు ఇచ్చే కార్యక్రమం అది. టేబుల్‌పై వరుసగా గిఫ్ట్‌ బాక్స్‌లు. ఒక్కొక్కరుగా వచ్చి తమకు నచ్చిన బాక్స్‌ తీసుకుంటున్న సిబ్బంది. ఎవరికో ఓపెన్‌ చేయగానే ఐఫోన్‌ కనిపించింది.. మరొకరి బాక్స్‌లో చాక్లెట్లు వచ్చాయి. దీంతో కొందరి ముఖాల్లో ఆనందం.. మరికొందరిలో కాస్త నిరాశ కనిపించింది. అయితే అసలు సర్‌ప్రైజ్‌ మాత్రం అప్పుడే మొదలైంది.

యూఏఈకి చెందిన వరల్డ్‌ స్టార్‌ మాన్‌పవర్‌ సంస్థలో ఉద్యోగులకు ఈ వినూత్న గిఫ్ట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు నిషాద్‌ హుస్సేన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ హసీనా నిషాద్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టేబుల్‌పై ఉంచిన గిఫ్ట్‌ బాక్స్‌లలో కొన్నింటిలో ఐఫోన్లు, మరికొన్నింటిలో చాక్లెట్‌ బార్లు పెట్టారు. ఉద్యోగులు తమకు నచ్చిన బాక్స్‌ను ఎంచుకున్నారు.

బాక్స్‌లు తెరిచిన తర్వాత కొందరు ఉద్యోగులకు ఐఫోన్లు దక్కడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే చాక్లెట్ల బాక్స్‌ తీసుకున్నవారి పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపించింది. వారు చాక్లెట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందనుకున్నారు.

అప్పుడే మేనేజింగ్‌ డైరెక్టర్‌ హసీనా నిషాద్‌ మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. చాక్లెట్ల బాక్స్‌ తీసుకున్న ఉద్యోగుల దగ్గరకు వెళ్లి.. వారికి కూడా ఐఫోన్లు బహుమతిగా ఇచ్చారు. దీంతో మొదట చాక్లెట్లు మాత్రమే వచ్చాయని భావించిన ఉద్యోగుల ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. చివరకు అందరి చేతుల్లోనూ ఐఫోన్లే కనిపించాయి.

ఉద్యోగుల కష్టపడి పనిచేయడం, సానుకూల దృక్పథం, టీమ్‌గా కలిసి ముందుకు సాగడం సంస్థ విజయానికి కీలకమని హసీనా నిషాద్‌ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి ప్రయత్నం, ఆలోచన, సహకారం సంస్థ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకుని మరింత ఎదగాలని ఉద్యోగులను ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను నిషాద్‌ హుస్సేన్‌, హసీనా నిషాద్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఉద్యోగులు బాక్స్‌లు తెరిచే సమయంలో కనిపించిన ఉత్కంఠ.. చివర్లో అందరికీ ఐఫోన్లు అందడంతో వచ్చిన ఆనందం వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇదీ చదవండి: ఆమె నిద్ర ఖరీదు.. 10 వేల కోట్లు!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement