దేశీయ సాంకేతిక (ఐటీ) ఉద్యోగ రంగం మళ్లీ పూర్వవైభవం వైపు వేగంగా పరుగులు తీస్తోంది. మందగమనం నుంచి కోలుకుంటూ 2026 అక్టోబర్‌లో క్రియాశీల ఐటీ ఉద్యోగాల సంఖ్య 1.23 లక్షలకు చేరింది. ఇది గత 18 నెలల్లోనే అత్యధికం కావడం విశేషం. ప్రముఖ హెచ్‌ఆర్ సర్వీసెస్ సంస్థ ‘ఎక్స్‌ఫెనో’ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే టెక్ నియామకాలు 17 శాతం, సెప్టెంబర్‌తో పోలిస్తే 5 శాతం వృద్ధి నమోదు చేశాయి. 2026 జూన్ నాటి కనిష్ఠ స్థాయి నుంచి రికవరీ క్రమంగా పుంజుకుంటూ వస్తోంది.
ఐటీ సేవల రంగానిదే అగ్రస్థానం
ఈ రికవరీలో ఐటీ సేవల విభాగాలు కీలకంగా మారాయి. ఒక్క అక్టోబర్‌లోనే ఈ విభాగంలో 66,000 క్రియాశీల ఖాళీలు నమోదయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే ఏకంగా 57 శాతం ఎక్కువ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిస్ట్, టెక్నికల్ లీడ్ పాత్రలకు ఊహించని రీతిలో డిమాండ్ పెరిగిందని నివేదిక పేర్కొంది. మరోవైపు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కూడా 18,000 ఖాళీలతో (ఏటా 64% వృద్ధి) బలంగా నిలిచాయి.
అనుభవజ్ఞులకే ప్రాధాన్యం
ప్రస్తుత నియామకాల ట్రెండ్‌ను పరిశీలిస్తే కంపెనీలు అనుభవజ్ఞులైన నిపుణులకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాయి. మొత్తం ఉద్యోగాల్లో 55 శాతం (68,000) మిడ్-సీనియర్ స్థాయి పాత్రలే ఉన్నాయి. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు 15,000గా నమోదయ్యాయి. మొత్తం ఖాళీలలో 76 శాతం (93,000) ఫుల్‌టైమ్ ఉద్యోగాలే కావడం గమనార్హం.
హైదరాబాద్, బెంగళూరుల్లో జోరు..
దేశవ్యాప్తంగా నమోదైన ఖాళీల్లో 67 శాతం (83,000) ప్రధాన మెట్రో నగరాల్లోనే ఉన్నాయి. 31,000 ఉద్యోగాలతో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా హైదరాబాద్ 14,000 ఉద్యోగాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ నెలకు నెల 27 శాతం, ఏటా 40 శాతం బలమైన వృద్ధిని సాధించింది. ఇక పని విధానంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానానికే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. మొత్తం ఖాళీలలో ఏకంగా 81 శాతం (1,00,000) ఆఫీసు ఆధారిత ఉద్యోగాలే కాగా, వర్క్ ఫ్రమ్ హోమ్ (10,000), హైబ్రిడ్ (13,000) నియామకాలతో క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
ఇదీ చదవండి: ‘ఓటు హక్కు హరిస్తే’.. న్యాయస్థానాల హెచ్చరిక


