దేశంలోని చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్‌ఎంఈ) మరింత వేగంగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.10,000 కోట్ల ఎస్‌ఎంఈ గ్రోత్ ఫండ్ (ఎస్‌జీఎఫ్) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఈ ఫండ్ ద్వారా అధిక వృద్ధి సామర్థ్యం, వ్యాపార సాధ్యాసాధ్యాలు, విస్తరణ అవకాశాలు ఉన్న ఎస్‌ఎంఈలకు డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడుల రూపంలో దీర్ఘకాలిక మూలధనం అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఎస్‌జీఎఫ్ కింద ఏర్పాటు చేసే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఏఐఎఫ్)కు మొత్తం రూ.10,000 కోట్ల నిధిని అందిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పలు ఈక్విటీ ఫండ్లు ప్రధానంగా ప్రారంభ దశలోని సూక్ష్మ సంస్థలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు వృద్ధి దశలో అవసరమైన రిస్క్ క్యాపిటల్‌లో లోటు ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఈ అంతరాన్ని భర్తీ చేయడమే ఎస్‌జీఎఫ్ ప్రధాన లక్ష్యం.
తయారీ, సేవలు, టెక్నాలజీ, ఆవిష్కరణలు, వ్యూహాత్మక విలువ గొలుసుల్లోని సంస్థలకు ఈ ఫండ్ కీలకంగా మారనుంది. ముఖ్యంగా తయారీ సంస్థలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం, అధునాతన సాంకేతికతను స్వీకరించడం, ఎగుమతులను విస్తరించడం, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడేందుకు అవసరమైన స్థాయిని సాధించడంలో ఇది తోడ్పడనుంది. టైర్-2, టైర్-3 నగరాల్లోని పారిశ్రామిక క్లస్టర్లకు కూడా పెట్టుబడులు అందే అవకాశం ఉంది.
ఈ నిర్ణయం 2026-27 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ‘ఛాంపియన్ ఎస్‌ఎంఈలు’ లక్ష్యానికి కార్యరూపం. బడ్జెట్‌లో ఎస్‌ఎంఈల కోసం రూ.10,000 కోట్ల గ్రోత్ ఫండ్‌తోపాటు సూక్ష్మ సంస్థలకు మద్దతుగా సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్‌కు అదనంగా రూ.2,000 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు.
ఇదీ చదవండి: ‘ఓటు హక్కు హరిస్తే’.. న్యాయస్థానాల హెచ్చరిక


