చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి రూ.10 వేల కోట్లతో నిధి
టైర్–2, టైర్–3 నగరాల్లోని క్లస్టర్లకే ప్రాధాన్యం
రవాణా, లాజిస్టిక్స్ సమన్వయానికి ‘ఐటీఎల్‌ఏ’ ఎస్పీవీ ఏర్పాటు
పదేళ్ల దార్శనికతతో నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్
మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయాలు
మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ తీర్మానం ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎస్‌ఎంఈ) వృద్ధికి మరింత ఊతమిచ్చేలా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఎంఈల్లో ప్రత్యక్ష ఈక్విటీ పెట్టుబడుల కోసం రూ.10 వేల కోట్లతో ఎస్‌ఎంఈ గ్రోత్ ఫండ్(ఎస్‌జీఎఫ్) ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ మంగళవారం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో సమగ్ర ప్రణాళిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్ అథారిటీ(ఐటీఎల్‌ఏ) పేరిట ప్రత్యేక సంస్థ (ఎస్పీవీ) ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది.
తయారీ, సేవా, సాంకేతిక, ఆవిష్కరణల రంగాల్లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి మూలధనాన్ని(గ్రోత్ క్యాపిటల్) సమకూర్చడమే లక్ష్యంగా ఎస్‌ఎంఈ గ్రోత్ ఫండ్‌ను తీసుకొచ్చారు. 2026–27 కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రకటన మేరకు ఈ నిధికి రూపకల్పన చేశారు. వివిధ రవాణా మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీల మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని నివారించి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు అపెక్స్ సంస్థగా ’ఐటీఎల్‌ఏ’ను ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ తరహాలో ఏర్పాటు చేయబోతున్నారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, షిప్పింగ్, పౌర విమానయానం, జలమార్గాలు, కోస్టల్ షిప్పింగ్, పట్టణ రవాణాను కలుపుతూ పదేళ్ల భవిష్యత్ ప్రణాళికతో సమగ్ర ’నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్’ను ఐటీఎల్‌ఏ సంస్థ తయారు చేస్తుంది.
మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ తీర్మానం ఆమోదం
ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రివర్గం అభినందనలు తెలియజేసింది. 2001 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రజా నాయకుడిగా ఆయన అందిస్తున్న సేవలను కొనియాడింది. ఈ మేరకు మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ మంగళవారం కేబినెట్ భేటీలో ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధాని స్థాయి వరకు మోదీ నాయకత్వ పటిమ ఏమాత్రం చెక్కుచెదరలేదని ఉద్ఘాటించారు.


