సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో అతడిపై నమోదైన పరువు నష్టం కేసులో నేడు (సోమవారం) ఈ ఆదేశాలు ఇచ్చింది. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనమ్ ఖాన్ ఈ మేరకు వారెంట్ జారీ చేశారు.
వికాస్ సంస్కృతాయన్ అలియాస్ వికాస్ పాండే దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు కొనసాగుతోంది. ధ్రువ్ రాఠీ తన యూట్యూబ్ ఛానల్లో వికాస్ పాండేకు వ్యతిరేకంగా ఓ వీడియోను అప్లోడ్ చేయడంతో 2018లో పరువు నష్టం కేసు నమోదైంది. అయితే ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేశారు. దీనికి సంబంధించి కోర్టు పూర్తి ఆదేశాలు ఇంకా వెలువడాల్సి ఉన్నాయి.
అంతకుముందు అక్టోబర్ 31న రాఠీపై బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిన కోర్టు.. అక్టోబర్ 17న కూడా బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. నోటీసులు అందించేందుకు వెళ్లిన ప్రాసెస్ సర్వర్‌కు ఆయన నివాసం తాళం వేసి కనిపించడంతో ఈ చర్యలు తీసుకుంది. అనంతరం హర్యానాలోని గురుగ్రామ్ చిరునామాకు తాజాగా సమన్లు పంపించింది.
అయితే రాఠీ సాధారణంగా ఆస్ట్రియాలో నివసిస్తారని, ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఇదీ చదవండి: ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్


