2018 నాటి పరువునష్టం కేసులో ఢిల్లీ సాకేత్ కోర్టు ఆదేశాలు
ఇంకా సమన్లు అందకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీలోని సాకేత్ కోర్టు శనివారం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో దాఖలైన పరువునష్టం కేసులో ఆయనకు నోటీసులు అందజేసేందుకు అధికారులు వెళ్లగా నివాసానికి తాళం వేసి ఉండటంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సాకేత్ కోర్టు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రాహుల్ జైన్.. ధ్రువ్ రాఠీకి నోటీసులు అందజేయాలని గతంలో ఆదేశించారు.
రాఠీ ఎక్కువగా విదేశాల్లో ఉంటున్నందున ఇన్నేళ్లుగా సమన్లు అందలేదని, అయితే ఆయన ప్రస్తుతం హరియాణాలోని గురుగ్రామ్లో ఉంటున్నారని ఫిర్యాదుదారు వికాస్ పాండే తరఫు న్యాయవాది సమక్ష్ శర్మ అక్టోబర్ 12న కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో త్వరితగతిన విచారణ జరిపి, సమన్లను నేరుగా చేతికి ఇచ్చే ‘దస్తీ’ పద్ధతిలో అందజేసేందుకు అనుమతించాలని కోరారు.
న్యాయవాది వాదనలు పరిగణనలోకి తీసుకున్న మేజిస్ట్రేట్ 2019లో చివరిసారిగా రాఠీకి సమన్లు జారీ చేసిన విషయాన్ని రికార్డుల్లో నమోదు చేశారు. దస్తీ పద్ధతిలో నోటీసులు అందజేసే అధికారులతో పాటు ఫిర్యాదుదారు వెళ్లవచ్చని స్పష్టం చేశారు. అయితే గురుగ్రామ్లోని రాఠీ ఇంటికి తాళంవేసి ఉండటంతో నోటీసులు అందజేయడం సాధ్యపడలేదని శనివారం జరిగిన విచారణలో కోర్టుకు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో న్యాయస్థానం ధ్రువ్ రాఠీకి బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది.
తన పరువు తీసేందుకు బీజేపీ ఐటీ సెల్ వికాస్ పాండేకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ 2018 మే నెలలో ధ్రువ్ రాఠీ ఒక వీడియో చేశారు. ఈ వీడియోను అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక పాత ట్విట్టర్ ఖాతాలో రీట్వీట్ చేశారు. ఈ ఆరోపణలపై వికాస్ పాండే అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆధారాలు లేకుండా తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యవహరించారని ఆరోపిస్తూ ధ్రువ్ రాఠీ, కేజ్రీవాల్ ఇద్దరిపై పరువునష్టం దావా వేశారు.


