న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా ఎగుమతులు, దేశీయంగా డిమాండ్ పటిష్టంగా ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను 7.1 శాతానికి ప్రపంచ బ్యాంకు పెంచింది. ఏప్రిల్ అంచనాలతో పోలిస్తే ఇది అర శాతం అధికం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ కొనసాగుతోందని, గ్లోబల్ వృద్ధికి కీలక చోదకంగా నిలుస్తోందని ప్రపంచబ్యాంక్ తాజా ఇండియా డెవలప్‌మెంట్ అప్‌డేట్ నివేదికలో పేర్కొంది.
‘వాణిజ్యం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నెలకొన్నప్పటికీ ఊహించిన దానికన్నా వృద్ధి మెరుగ్గానే నమోదైన నేపథ్యంలో 2027 పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాలను ఏప్రిల్ నాటి 6.6% నుంచి 7.1 శాతానికి అప్‌గ్రేడ్ చేశాం‘ అని వివరించింది. ఒకవేళ ఇంధన సరఫరా వ్యవస్థలో పరిస్థితులు పశ్చిమాసియా ఉద్రిక్తతల పూర్వ స్థాయికి తిరిగొస్తే, 2028 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.2 శాతానికి చేరి, ఆ తదుపరి సంవత్సరంలో 7 శాతానికి నెమ్మదించవచ్చని పేర్కొంది.
తొలి త్రైమాసిక గణాంకాలు ఆశావహంగా ఉండటంతో ఇప్పటికే ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ), ఓఈసీడీ, ఎస్‌అండ్‌పీ, ఫిచ్‌లాంటి ఇతరత్రా గ్లోబల్ ఏజెన్సీలు భారత వృద్ధి అంచనాలను సుమారు 7%కి పెంచిన నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. మరో రిపోర్ట్ ప్రకారం 2026లో దక్షిణాసియా 6.9% వృద్ధితో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రాంతంగా కొనసాగనుంది.
రిస్క్ లు ఉన్నాయి..
మధ్యకాలికంగా వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నప్పటికీ దేశం వెలుపలి నుంచి వచ్చే రిస్కులు అధిక స్థాయిలోనే ఉండొచ్చని నివేదిక హెచ్చరించింది. చమురు ధరలు, ఎల్ నినో, స్టాక్ మార్కెట్ కరెక్షన్లు మొదలైనవి వీటిలో ఉన్నాయని పేర్కొంది.
రిపోర్టులో మరిన్ని ముఖ్యాంశాలు..
⇒ 2025 ఆర్థిక సంవత్సరంలో 7.2%గా నమోదైన భారత్ వృద్ధి .. పెట్టుబడులు, ప్రైవేట్ వినియోగం దన్నుతో 2026 ఆర్థిక సంవత్సరంలో 7.8%కి ఎగిసింది. పాలసీలు, రుణలభ్యతలాంటి సానుకూలాంశాలు.. వాణిజ్య ఉద్రిక్తతలపరమైన ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు దోహదపడ్డాయి. వ్యవసాయం బాగుండటం, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు మెరుగుపడటం, ఆహార సబ్సిడీలు, ద్రవ్యోల్బణం నెమ్మదించడంలాంటి అంశాల దన్నుతో పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం గణనీయంగా పెరిగింది. జీఎస్‌టీ తగ్గింపులు, ఆదాయ పన్నుపరమైన మినహాయింపులతో పట్టణ ప్రాంతాల్లోనూ వినియోగం పుంజుకుంది. తొలి త్రైమాసికంలో అందరి అంచనాలకు మించి జీడీపీ 7.8%గా నమోదైంది.
⇒ ఆగస్టులో వర్షాభావం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌పై ఒక మోస్తరు ప్రభావం పడనున్నప్పటికీ జీడీపీ వృద్ధికి ప్రైవేట్ వినియోగం ఊతంగా నిలవనుంది. పెట్టుబడుల పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండదు. పెరుగుతున్న గ్లోబల్ అనిశ్చితి.. ప్రైవేట్ పెట్టుబడులపై ప్రభావం చూపనుంది. అయితే, ప్రభుత్వ పెట్టుబడులు పటిష్టంగా ఉండటంతో పాటు ఆర్థికంగా, పాలసీలపరంగా సానుకూల పరిస్థితులు ఉండటం వల్ల ఈ తీవ్రత కొంత తగ్గుతుంది.
⇒ ఎగుమతులు ఊహించిన దానికన్నా మెరుగ్గా నమోదయ్యాయి. ఏప్రిల్ అంచనాలతో పోలిస్తే 2027 ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి ఊతంగా నిలవనున్నాయి.
⇒ సరఫరాపరంగా చూస్తే పరిశ్రమలు కూడా ఊహించిన దానికన్నా మెరుగైన పనితీరు కనపర్చనున్నాయి. దీనితో, వ్యవసాయం బలహీనపడినప్పటికీ, ఆ ప్రభావం తీవ్రత కొంత తగ్గుతుంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఏప్రిల్ నుంచి పారిశ్రామిక కార్యకలాపాలు అంచనాలకు మించి జరుగుతున్నాయి.]
ఏఐ సన్నద్ధతలో భారత్ టాప్..
కృత్రిమ మేధ (ఏఐ) సన్నద్ధతకు సంబంధించి టాప్ 10 వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఒకటని మరో నివేదికలో వరల్డ్ బ్యాంక్ తెలిపింది. సాంకేతిక నిపుణుల లభ్యత భారీగా ఉండటం, అంతర్జాతీయంగా అనుసంధానమైన ఐటీ పరిశ్రమ, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాల దన్నుతో ఈ టెక్నాలజీ ద్వారా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోగలిగే స్థితిలో భారత్ ఉందని పేర్కొంది.
దీన్ని కేవలం సాంకేతిక సాధనంగా కాకుండా అభివృద్ధికి దోహదపడే సాధనంగా ఉపయోగించుకుంటే ఉత్పాదకత, ప్రజా సేవలను మెరుగుపర్చుకోవచ్చని తెలిపింది. ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాలను .. వ్యాపార పరిస్థితులను మెరుగుపర్చడం, కృత్రిమ మేధ లభ్యతను పెంచడం ద్వారా దీని ప్రయోజనాలు అందరికీ దక్కేట్లు చూడొచ్చని వివరించింది.
రిపోర్ట్ ప్రకారం భారత్‌లో ఏఐపై పెట్టుబడులు 2024లో 1.2 బిలియన్ డాలర్లుగా ఉండగా 2025లో మూడు రెట్లకు మించి పెరిగి 4.1 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) ఉద్యోగుల సంఖ్య 19 లక్షల నుంచి 23.6 లక్షలకు పెరిగింది. అయితే, లేబర్ మార్కెట్, ఆర్థిక పరిస్థితులపై ఏఐ దీర్ఘకాలిక ప్రభావాల విషయంలో ఇంకా అనిశ్చితే నెలకొందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది.


