ఆచి తూచి ‘రిజర్వ్‌’ అడుగు! | Special Editorial Story On RBI Repo Rate Hike | Sakshi
Sakshi News home page

ఆచి తూచి ‘రిజర్వ్‌’ అడుగు!

Oct 9 2026 4:12 AM | Updated on Oct 9 2026 4:12 AM

Special Editorial Story On RBI Repo Rate Hike

నిత్యం చోటుచేసుకునే జాతీయ, అంతర్జాతీయ పరిణామాలూ, ప్రకృతి వైపరీత్యాలూ, వాటి పర్యవసానంగా ఏర్పడగల ఆర్థిక సంక్షోభాలపై దృష్టి పెట్టడమే, కలత పడటమే... అందుకు విరుగుడు ఆలోచించటమే రిజర్వ్‌ బ్యాంకు అసలు పని. గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఆర్థికరంగ నిపుణులు రిజర్వ్‌ బ్యాంకు రెపో రేటు పెంచకతప్పదని అంచనా వేస్తున్నారు. 

నిజానికి ఆ విషయంలో కొంత ఆలస్యం అయిందన్నది కూడా వారి విశ్లేషణ. ఏమైతేనేం...రెపో రేటును పావు శాతం పెంచుతూ బ్యాంకు ద్రవ్య విధాన సంఘం(ఎంపీసీ) భేటీ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్‌ రుణాలపై వడ్డీ రేట్లు బాగా పెరుగుతాయి. మధ్యతరగతి జీవులు ఈఎంఐలకు అధికంగా చెల్లించకతప్పదు. మూడేళ్ల క్రితం రెపో రేటు పెంచాక ఇదే మొదటి పెంపు. ఇన్నాళ్లూ రెపో రేటులో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించటం... అటుపై కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రావటమే అందరూ చూశారు.

మొత్తానికి వడ్డీ రేటు 5.25 శాతం దగ్గర స్థిరపడింది. పావు శాతం పెంచటంతో ఇప్పుడది 5.50 శాతానికి చేరింది. కానీ ఇదింకా పెరుగుతుందన్న సంకేతాలిచ్చింది. మూడేళ్ల తటస్థంనుంచి ‘క్రమానుగత కఠిన విధానం’ దిశగా కదులుతున్నట్టు తెలిపింది. దసరా పండుగ సంరంభం సమీపిస్తుండగా తీసుకున్న ఈ నిర్ణయం సహజంగానే వినియోగదారుల కొనుగోలుశక్తిపై ప్రభావం చూపుతుంది. దాని తీవ్రత మరీ ఎక్కువ ఉండరాదని పావు శాతం పెంపునకు పరిమితమైంది.

డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని దేశాల ఆర్థికవ్యవస్థలనూ తలకిందులు చేస్తున్నాయి. విచక్షణారహితంగా విధిస్తున్న అదనపు సుంకాలు మనతో సహా ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ముడి చమురు ధరలు ఆకాశాన్నంటడానికి దారితీసిన పశ్చిమాసియా సంక్షోభం కూడా ఆయన పుణ్యమే. నేనున్నానంటూ సూపర్‌ ఎల్‌ నినో కూడా ఇప్పుడే వచ్చిపడింది. సాగురంగాన్ని అది తీవ్రంగా దెబ్బతీస్తోంది.

వీటన్నిటివల్లా కనుచూపు మేరలో ఆశాజనకమైన పరిస్థితుల జాడ ఉండబోదని అందరికీ తెలుస్తూనే ఉంది. ఆహారధాన్యాల ధరలు అలా పైపైకి పోవటమే తప్ప కిందికి దిగొస్తున్న దాఖలా లేదు.  రూపాయి పతనం ఎన్నడూ లేనంతగా ఉంది. ద్రవ్యోల్బణం పెరగటంతో నిజ వేతనాలు గణనీయంగా పడిపోయాయి. మార్కెట్‌కి వెళ్లడం పాపం... జేబు ఖాళీ అవుతోంది. మధ్యతరగతి ఆదాయాలు పడిపోతుంటే... నిరుద్యోగ భూతం భయపెడుతోంది.

స్టాక్‌ మార్కెట్లు సరేసరి. గత తొమ్మిది నెలల్లో విదేశీ సంస్థాగత మదుపుదార్లు 4 లక్షల కోట్ల రూపాయలుపైగా వెనక్కు తీసుకున్నారని అంచనా. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు అంచనాలను దాటి 7.8 శాతానికి గెంతడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతర్జాతీయంగా సంక్షోభం ఉన్నా మన ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉండటమే కాదు...మెరుగైన దోవన వెళ్తున్నదని కేంద్రం ప్రకటించింది. మొన్న ఆగస్టుకు ద్రవ్యోల్బణం 4.82 శాతం ఉన్నదని లెక్కేశారు.

మరి అప్పుడే రెపో రేటు పెంచాల్సివుండగా ఎందుకు ఆగినట్టని ఆర్థిక రంగ నిపుణులు వేస్తున్న ప్రశ్న హేతుబద్ధమైనదే. పరిస్థితులు బాగులేవన్నది నిజమే అయినా... ఆగస్టునాటికీ, ఇప్పటికీ వచ్చిన గణనీయమైన మార్పేమీ లేదు. సరఫరాకు సంబంధించిన ఒత్తిళ్లు లేదా డిమాండ్‌ పరమైన ఒత్తిళ్లు ఉన్నప్పుడే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం ఆ రెండూ లేవు. అయినా రేటు పెంచటమంటే ముందు జాగ్రత్త అనుకోవాలి.

వృద్ధి రేటు లెక్క సరికాదని విభేదించినవారు గణనీయంగానే ఉన్నారు. ఆ మాటెలావున్నా 7.8 శాతం వృద్ధి రేటు అనేది నిర్భయంగా రెపో రేటు పెంచటానికి ఏ సెంట్రల్‌ బ్యాంకుకైనా అనువైనది. అది నేలచూపులు చూస్తుంటే పెంచితే అన్ని రకాల రుణాలపైనా వడ్డీ రేట్లు పెరిగి జనం మరింత కుంగుతారు. ఇలా బాగున్న వాతావరణమే పెంపుదలకు అనుకూలమని బ్యాంక్‌ భావించటంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే ఈ పెంపు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తుందా లేదా అన్నది చెప్పలేం. అదనపు లిక్విడిటీని అదుపు చేయటంద్వారా అది సాధ్యమేనని ఎంపీసీలోని మెజారిటీ సభ్యులు భావించారు. చూద్దాం... ఏమవుతుందో!

ఇదీ చదవండి: భారత్‌లో స్టార్‌లింక్.. ఐదేళ్లుగా అదే ట్విస్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement