ఈయూకు చేరువగా యూకే | UK EU Deal Brexit Reset Youth Opportunities | Sakshi
Sakshi News home page

ఈయూకు చేరువగా యూకే

Nov 21 2026 4:56 AM | Updated on Nov 21 2026 4:56 AM

UK EU Deal Brexit Reset Youth Opportunities

బ్రస్సెల్స్‌లో బర్న్‌హమ్, ఆంటోనియో, ఉర్సుల

వాణిజ్యం సహా పలు ఒప్పందాలపై సంతకాలు

జీవన వ్యయం తగ్గుతుందన్న ప్రధాని బర్న్‌హమ్‌

బ్రస్సెల్స్‌: పదేళ్ల క్రితం యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)తో తెగదెంపులు చేసుకున్న బ్రిటన్‌ ..మళ్లీ ఆ గ్రూపున కు దగ్గరయ్యే ప్రయత్నాలను మొదలుపెట్టింది. శుక్రవారం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఈయూ కౌన్సిల్‌ చీఫ్‌ ఆంటోనియో కోస్టా, యూరోపియన్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులతో బ్రిటన్‌ ప్రధాని ఆండీ బర్న్‌హమ్‌ పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ప్రధానంగా వాణిజ్యం, యువతకు పరస్పరం అవకాశాలను కల్పించడం ఉన్నాయి.

తాజాగా కుదిరిన ఒప్పందాలపై బర్న్‌హమ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రక ఒప్పందం, బ్రిటన్‌కు, యూరప్‌నకు ఇది మంచి రోజు అని పేర్కొన్నారు. ‘రోజువారీ ఖర్చులు, సూపర్‌ మార్కెట్లలో వస్తువుల ధరలు దిగివస్తాయి. యువతకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’అని చెప్పారు. ఈయూను వీడి రావడం వల్ల దశాబ్దకాలంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.

‘బ్రెగ్జిట్‌తో అనుకున్న ప్రయోజనం కలగలేదు. పొందిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ. 27 దేశాలతో కూడిన ఈయూతో సన్నిహితమయ్యేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నాం. బ్రెగ్జిట్‌ను వెనక్కి తీసుకోవడం సాధ్యమే. అయితే, ఇప్పటికప్పుడు జరిగేది కాదు. ఇందుకు బ్రిటిష్‌ ఓటర్ల మద్దతు మాత్రమే కాదు. అపనమ్మకంతో ఉన్న ఈయూ ఏకగ్రీవ మద్దతు కూడా అవసరం’అని ఆయన తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కూటమి ఈయూను వీడిన తర్వాత బ్రిటన్‌ తిరిగి ఆ గ్రూపుతో చర్చలు జరపడం ఇదే మొదటిసారి. ఈ ఒప్పందంలో భాగంగా బ్రిటన్‌ ఏటా లక్ష మంది యువతను, విద్యార్థులను ఈయూ దేశాలకు విద్య, పర్యటన, శిక్షణ, ఉద్యోగాల నిమిత్తం పంపించేందుకు వీలవుతుంది. అదేవిధంగా, ఈయూ సభ్య దేశాలు బ్రిటన్‌లోకి లక్ష మంది యువత, విద్యార్థులను పంపించవచ్చు. 

అయితే, విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులు, తదితరాలను మరింత విపులంగా చర్చించి ఆరునెలల్లోగా తుది నిర్ణయం తీసుకుంటారు. వీరు మూడేళ్లపాటు ఈయూ, బ్రిటన్‌లో ఉండేందుకు వీసాలను మంజూరు చేస్తారు. అయితే, ఈ ఒప్పందం 2030 నుంచి మాత్రమే అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. అదేవిధంగా, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులపై ఉన్న ఆంక్షలను తొలగించేందుకు ఈయూ అంగీకరించడంతో వీటి ధరలు కొంతమేర తగ్గుతాయని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: యూరప్‌ దేశాల్లో ఆగని నిరసనలు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement