భారత్‌ వృద్ధి అంచనాలు అప్‌! | Global Ratings has raised its India GDP growth forecast for FY27 | Sakshi
Sakshi News home page

భారత్‌ వృద్ధి అంచనాలు అప్‌!

Sep 24 2026 5:20 AM | Updated on Sep 24 2026 5:20 AM

Global Ratings has raised its India GDP growth forecast for FY27

ఈ ఏడాది జీడీపీ వృద్ధి 7% ఉండొచ్చు.. 

గ్లోబల్‌ ఏజెన్సీలు ఎస్‌అండ్‌పీ, ఫిచ్, ఏడీబీ, ఓఈసీడీ నివేదిక 

ఆర్‌బీఐ వడ్డీరేట్లు పెంచే అవకాశం

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం సహా భౌగోళిక రాజకీయ ప్రతికూలతలు నెలకొన్నప్పటికీ భారత్‌ ఆర్థిక వ్యవస్థ వాటన్నింటినీ తట్టుకుని మెరుగైన పనితీరును సాధిస్తుందని గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీలు, ఆర్థిక సంస్థలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) జీడీపీ వృద్ధి రేటు అంచనాలను భారీగా పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించాయి. వృద్ధి రేటు దాదాపు 7 శాతం నమోదుకావచ్చనేది తాజా అంచనా. 

ఈ జాబితాలో ఎస్‌అండ్‌పీ, ఫిచ్, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ), ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) ఉన్నాయి. ఇటీవలే మరో రేటింగ్‌ దిగ్గజం మూడీస్‌ కూడా ఈ ఏడాది వృద్ధి అంచనాలను 6 శాతం నుంచి ఏకంగా 7 శాతానికి పెంచిన నేపథ్యంలో మరో నాలుగు ఏజెన్సీల సానుకూల నివేదికలు వెలువడటం గమనార్హం. 2026–27 తొలి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో జీడీపీ వృద్ధి అంచనాలను మించి 7.8 శాతానికి దూసుకెళ్లడం తెలిసిందే. 

ఎస్‌అండ్‌పీ: ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలను 6.6 శాతం నుంచి 7 శాతానికి పెంచుతున్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ పేర్కొంది. ముఖ్యంగా పటిష్టమైన ఆర్థిక కార్యకలాపాలు దీనికి దన్నుగా నిలుస్తాయని తెలిపింది.  కాగా, ఈ ఏడాది రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక పాలసీ రేటు (రెపో)ను పావు శాతం మేర పెంచే అవకాశం ఉందని ఎస్‌అండ్‌పీ అంచనా వేసింది. పటిష్టమైన వృద్ధికి తోడు ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, పశ్చిమాసియాలో సంక్షోభానికి తెరపడకపోవడం, వర్షాలు సరిగ్గా కురవక పోవడం వంటివి రేట్ల పెంపునకు పురిగొల్పే అంశాలని వివరించింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా నమోదు కావచ్చని వెల్లడించింది. 

ఫిచ్‌: జూన్‌ క్వార్టర్లో నమోదైన పటిష్టమైన వృద్ధి.. ఆర్థిక వ్యవస్థలో జోరుకు అద్దంపడుతోందని, ఈ నేపథ్యంలో పూర్తి ఏడాదికి అంచనాలను 6.9 శాతానికి పెంచుతున్నట్లు ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది. గతంలో వృద్ధిని 6.4 శాతంగా లెక్కగట్టింది. అక్టోబర్‌ పాలసీ సమీక్షలో పావు శాతం రెపో రేటు పెంపు ఉండొచ్చని, డిసెంబర్‌ కల్లా రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.5 శాతాన్ని తాకొచ్చనేది ఫిచ్‌ అంచనా.

ఏడీబీ: జూలైలో వృద్ధి అంచనాలను 6.6 శాతంగా లెక్కగట్టిన ఏడీబీ.. తాజాగా 7 శాతానికి పెంచింది. పశ్చిమాసియా యుద్ధంతో సరఫరాపరమైన అడ్డంకులు, అధిక కమోడిటీ ధరలు ఉన్నా కూడా భారత ఎకానమీ తట్టుకుని జూన్‌ క్వార్టర్లో అంచనాలను మించి వృద్ధిని నమోదు చేసిందని ఏడీబీ కంట్రీ డైరెక్టర్‌ (భారత్‌) మియో ఓకా పేర్కొన్నారు. పటిష్టమైన ఇన్‌ఫ్రా వ్యయం, వృద్ధికి చేయూతనిచ్చే ఆర్థిక, మానిటరీ పాలసీలు దీనికి దోహదం చేస్తున్నాయన్నారు. 

ఓఈసీడీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలను ఏకంగా 0.8 శాతం పెంచి 7.1 శాతానికి చేర్చింది. బలమైన దేశీయ డిమాండ్‌కు తోడు ప్రభుత్వ వృద్ధి అనుకూల పాలసీల కారణంగా అధిక ఇంధన ధరల ప్రభావం ఎకానమీపై పడలేదని ఓఈసీడీ తాజా ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ మధ్యంతర నివేదికలో వెల్లడించింది. 2025–26లో నమోదైన 7.8 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే.. 2026–27లో 7.1 శాతంగా, 2027–28లో 6.5 శాతంగా అంచనా వేసింది. ఇతర ఏజెన్సీలన్నికంటే ఓఈసీడీ వృద్ధి 
అంచనాలే అత్యధికం కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement