విశ్లేషణ
హిందూ మహాసముద్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ద్వీపదేశం మాల్దీవుల్లో జూలై 30న ప్రారంభమైన ఒక కొత్త చెల్లింపు సదుపాయం, భారత రూపాయి అంతర్జాతీయీకరణ దిశగా జరిగిన మరో చిరు ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. మాల్దీవుల మానిటరీ అథారిటీ నిర్వహించే తక్షణ చెల్లింపుల వ్యవస్థ ‘ఫవారా’ను భారతదేశపు యూపీఐతో అనుసంధానించారు. తొలిదశలో మాల్దీవుల్లోని బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్, మాల్దీవ్స్ ఇస్లామిక్ బ్యాంక్ ఖాతాదారులకు భారత్‌లోని యూపీఐ అనుసంధాన ఖాతాలకు నేరుగా డబ్బు పంపే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మాల్దీవుల రుఫియాలో ప్రారంభించిన లావాదేవీ భారత్‌లోని ఖాతాలో రూపాయల్లో జమ అవ్వడంతో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ సదుపాయం మాల్దీవుల నుంచి భారత్‌కు జరిగే వ్యక్తిగత బదిలీలకు మాత్రమే పరిమితమైంది. తదుపరి దశల్లో ద్విముఖ, క్యూఆర్ ఆధారిత వాణిజ్య లావాదేవీలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఎందుకు ప్రాధాన్యత?
భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో ముడిపడుతున్న కొద్దీ అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు, రెమిటెన్సులు, ఇతర సరిహద్దు లావాదేవీల పరిమాణం పెరుగుతోంది. ఆర్బీఐ అంచనా ప్రకారం, 2023–24లో భారత వస్తు, సేవల వాణిజ్యం, పెట్టు బడులు, రెమిటెన్సులకు సంబంధించిన సరిహద్దు లావాదేవీల విలువ 1.9 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇంత భారీ స్థాయి లావాదేవీల్లో రూపాయి వినియోగం పెరిగిన కొద్దీ, భారతీయ సంస్థలకు మారకపు రిస్క్, లావాదేవీ వ్యయాలను కొంతవరకు తగ్గించుకునే వెసులుబాటు కలుగుతుంది. విదేశీ భారతీయ బ్యాంకుల్లో ‘వోస్ట్రో’ ఖాతాను నిర్వహించుకునే సౌలభ్యం ఎప్పటినుంచో ఉంది. అయితే, అంతర్జాతీయ వాణి జ్యాన్ని రూపాయల్లో ఇన్వాయిస్ చేయడం, చెల్లించడం, సెటిల్ చేసుకోవడం కోసం ఆర్బీఐ 2022 జూలైలో స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్ (ఎస్‌ఆర్‌వీఏ) సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. రూపాయి అంతర్జాతీయీకరణ దిశలో దీనిని కీలకమైన అడుగుగా పేర్కొన వచ్చు. భారత దిగుమతిదారు రూపాయల్లో చెల్లించిన మొత్తం, ఎగుమతిదారు బ్యాంకు భారత్‌లో నిర్వహించే ఎస్‌ఆర్‌వీఏలో జమ అవుతుంది. ఆ నిల్వలను భారత ఎగుమతిదారులకు చెల్లింపులతో పాటు, ఆర్బీఐ అనుమతించిన ఇతర లావాదేవీలకు కూడా ఉపయో గించవచ్చు. నిబంధనల మేరకు దేశీయ ప్రాజెక్టులు, ప్రభుత్వ ఋణపత్రాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉంది. ఇది ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ సెటిల్‌మెంట్ మార్గాలకు అదనం.
స్థానిక కరెన్సీల్లో సెటిల్‌మెంట్లు
రూపాయి అంతర్జాతీయీకరణ దిశలో మరో అడుగు ద్వైపాక్షిక లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ (ఎల్‌సీఎస్) వ్యవస్థ. 2023లో భారత్, యూఏఈ రూపాయి–దిర్హామ్‌లో ద్వైపాక్షిక లావాదేవీలను ప్రోత్స హించేందుకు ఎల్‌సీఎస్ ఒప్పందం చేసుకున్నాయి. ఆ తర్వాత ఇండోనేషియా, మాల్దీవులు, మారిషస్‌లతోనూ భారత్ ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంది. వీటి ద్వారా ఇరు దేశాలు డాలరు వంటి అంత ర్జాతీయ కరెన్సీపై అతిగా ఆధారపడకుండా, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని తమతమ స్థానిక కరెన్సీల్లో ఇన్వాయిస్ చేసి, సెటిల్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
అయితే ఈ విధానంలో ఒక ఆచరణాత్మక సవాలు ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యం సమతుల్యంగా లేకపోతే ఒక దేశం వద్ద మరొక దేశ కరెన్సీ నిల్వలు పెరిగిపోవచ్చు. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి ముడిచమురును రూపాయల్లో కొనుగోలు చేసిన సందర్భంలో ఇరాన్‌కు ఇదే సమస్య ఎదురైంది. అలా పేరుకున్న రూపాయి నిల్వలను భారత్ నుంచి వస్తువులు, సేవలు కొనుగోలు చేయడానికి లేదా అనుమతించిన పెట్టుబడుల్లో వినియోగించుకునే అవకాశాలు కూడా సమృద్ధిగా ఉండాలి. అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి వినియోగం పరిమితంగా ఉంటే, అలాంటి నిల్వలను వినియోగించుకునే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఇప్పటివరకు రూపాయిలో జరిగే అంతర్జాతీయ వాణిజ్య పరిమాణం, భారతదేశం మొత్తం సరిహద్దు లావాదేవీలతో పోలిస్తే చాలా పరిమితంగానే ఉంది. విధానపరమైన ప్రయత్నాలు ముమ్మరమైనప్పటికీ, అంత ర్జాతీయ వాణిజ్యంలో రూపాయి వినియోగం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నట్లు ఈ ఒరవడి సూచిస్తోంది.
దశాబ్దాలుగా, బెల్జియం కేంద్రంగా ఉన్న స్విఫ్ట్ నెట్‌వర్క్
అంతర్జాతీయ బ్యాంకింగ్‌లో కీలకమైన ఆర్థిక సమాచార మౌలిక వసతిగా ఉంది. బ్యాంకుల మధ్య చెల్లింపు ఆదేశాలను ఈ నెట్‌వర్క్ సురక్షితంగా చేరవేస్తుంది. అసలు నిధుల బదిలీ మాత్రం కరెస్పాండెంట్ బ్యాంకులు, సంబంధిత చెల్లింపు వ్యవస్థల ద్వారా జరుగు తుంది. లావాదేవీలో పాల్గొనే మధ్యంతర బ్యాంకుల సంఖ్య, కరెన్సీ స్వభావం వంటి అంశాలపై బదిలీకి అయ్యే ఖర్చు, అంతిమ లబ్ధిదారుడికి డబ్బు చేరే సమయం ఆధారపడి ఉంటాయి. దీనికి భిన్నంగా, ఫవారా–యూపీఐ వంటి ఏర్పాట్లలో రెండు దేశాల దేశీయ తక్షణ చెల్లింపు వ్యవస్థలు పరస్పరం నేరుగా అనుసంధా నమవుతాయి. ఫలితంగా ద్వైపాక్షిక చెల్లింపులను వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది. ఈ పరిణామం రూపాయి అంతర్జాతీయీకరణకు కూడా తోడ్పడుతుంది. భారత్ ఇప్పటికే సింగపూర్ ‘పేనౌ’తో సహా పలు దేశాల తక్షణ చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధానించింది.2024లో భారత్ ‘ప్రాజెక్ట్ నెక్సస్’లో చేరింది. భారత్, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల తక్షణ చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించడం ప్రాజెక్టు లక్ష్యం. ఈ నాలుగు దేశాలతో భారత్ జరిపే లావాదేవీల విలువ... ఆసియాన్ దేశాలు భారత్‌తో జరిపే మొత్తం ప్రవాహాల్లో మూడింట రెండొంతు లకు పైగా ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది.
ప్రధాన అవరోధం
చెల్లింపుల సదుపాయాలు విస్తరించడం ఒక్కటే రూపాయి అంతర్జాతీయీకరణకు సరిపోదు. విదేశీ సంస్థలు రూపాయి ఆధారిత ఆర్థిక ఆస్తులను సులభంగా కొనుగోలు చేయడానికి, వాటిని నిర్వహించడానికి, అవసరమైనప్పుడు ఇతర కరెన్సీల్లోకి మార్చుకోవడానికి అనువైన లోతైన ఆర్థిక మార్కెట్లు కూడా అవసరం. ఈ ఆస్తులను స్వేచ్ఛగా ఇతర కరెన్సీల్లోకి మార్చుకునే అవకాశం లేకపోతే, రూపాయి ఆస్తులను పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడానికి విదేశీ సంస్థలకు ప్రోత్సాహం తగ్గుతుంది. భారత్‌లో మూలధన ఖాతా ఇంకా పూర్తి పరివర్తనీయంగా లేకపోవడం రూపాయి అంతర్జాతీయీకరణకు ప్రధాన అవరోధాల్లో ఒకటి. అందువల్ల, విదేశీ సంస్థలకు అవసరమైనప్పుడు రూపాయి ఆస్తులను ఇతర కరెన్సీల్లోకి సులభంగా మార్చుకునే స్వేచ్ఛతో పాటు, పూర్తి పరివర్తనీయత కలిగిన రూపాయి, లోతైన ద్రవ్య మార్కెట్లు అవసరం. ఈ దిశగా భారత్ మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నంలో బ్రిక్స్ వేదిక కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించిన వివరాల ప్రకారం, బ్రిక్స్ దేశాలు తమ తక్షణ చెల్లింపు వ్యవస్థలు, కేంద్ర బ్యాంకుల డిజిటల్ కరెన్సీలను పరస్పరం అనుసంధానించే అవకా శాలపై చర్చిస్తున్నాయి. అంతర్జాతీయ చెల్లింపుల వ్యయాన్ని తగ్గించడం ఈ ప్రయత్నం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. రూపాయి అంత ర్జాతీయీకరణ దిశగా ఇప్పటివరకు ఏర్పడిన ప్రతి కొత్త అనుసంధానం ఒక అవకాశాన్ని సృష్టిస్తోంది. మాల్దీవుల ఫవారా–యూపీఐ అనుసంధానం ఆ సుదీర్ఘ ప్రయాణంలో మరో ముందడుగు.
కృష్ణ బాలాజి పల్లపోతు
వ్యాసకర్త విశ్రాంత ఉన్నతాధికారి, ఎస్.బి.ఐ.


