విశ్వగురు
నేడు పట్టభద్రులవుతున్న మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. ఈ రోజు మీ ముందుకు వచ్చి కొన్ని ఆలోచనలు పంచుకోవడం నాకు నిజంగా గొప్ప గౌరవం. పెద్దవాళ్లు జీవితంలో తాము నేర్చుకున్న విషయాలను పిల్లలకు చెప్పాలని కోరుకుంటారు. ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రుల కోరిక ఒకటే. తమ పిల్లలు మంచి మనుషులుగా ఎదగాలి. సంతోషంగా జీవించాలి. స్వతంత్రంగా నిలబడాలి. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారాలి. ముఖ్యంగా పిల్లలకు ఎదురయ్యే బాధలు, నిరాశలు, కష్టాలు వీలైనంత వరకు రాకుండా కాపాడాలని తల్లిదండ్రులు ఆరాటపడతారు.
సలహాలు ఇవ్వడం సులభం కాదు!
జీవితంలో మంచి ఉద్యోగం వస్తుందని... మంచి ప్రేమ దొరుకుతుందని... మీరు కోరుకున్న ప్రతిదీ సాధిస్తారని నేను హామీ ఇవ్వలేను. అలా చెప్పగల శక్తి ఎవరికీ లేదు. ఈ రోజుల్లో ప్రపంచం చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఇతరు లకు సలహాలు ఇవ్వడం అంత సులభం కాదు. నేను ఒక నటిని. ఒక తల్లిని. ఒక వ్యాపారవేత్తను. అన్నిటికంటే... నాకు ఎంతో ఇష్టమైన పనిని జీవితాంతం చేయగలిగిన అదృష్టవంతురాలిని. అందుకే నా అనుభవాల నుంచి నేర్చుకున్న కొన్ని విషయాలను మీకు చెప్పాలను కుంటున్నా. మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో అదే ముఖ్యమని గుర్తించండి. మీ కుటుంబం, ఉపాధ్యాయులు, స్నేహితులు మీకు సహాయం చేసి ఉండొచ్చు. కానీ చివరికి పరీక్షలు మీరు రాశారు. భయాలను మీరు ఎదుర్కొన్నారు. సందేహాలను మీరు జయించారు. ఇకపై కూడా ఇతరుల మాటలు వినండి. వారి అనుభవాల నుంచి నేర్చుకోండి. కానీ, మీ జీవితాన్ని ఇతరులు రాయకూడదు. మీ కథను మీరు రాయాలి. మీరు ఎవరో, మీ విలువలు ఏమిటో, మీ కలలు ఏమిటో... వాటిని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎందుకంటే... ప్రపంచానికి మరో కాపీ అవసరం లేదు. ప్రపంచానికి అవసరమైంది... మీ కొత్త ఆలోచనలు. మీ సృజనాత్మకత. మీ భిన్నమైన దృష్టికోణం. ఇవే భవిష్యత్తును మార్చగలవు.
‘ఒకవేళ ఇలా జరిగితే?’
నటనా ప్రపంచంలో ఒక గొప్ప ప్రశ్న ఉంటుంది: ‘వాట్ ఇఫ్’? ‘ఒకవేళ ఇలా జరిగితే?’, ‘ఒకవేళ ఇలా చేస్తే ఎలా ఉంటుంది?’... ఈ ప్రశ్నే కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. ఇప్పుడు నా మొదటి ‘వాట్ ఇఫ్’?... ఒకవేళ, మీరు మీ కుతూహలం(క్యూరియాసిటీ) ఎప్పటికీ కోల్పోకపోతే? ఆసక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకునేలా చేస్తుంది. కొత్త మనుషులను కలిసేలా చేస్తుంది. కొత్త ప్రపంచాలను చూపిస్తుంది. నిజంగా జీవితం మారేది... మనకు తెలిసిన ప్రపంచంలో కాదు. మనకు తెలియని ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడే. అక్కడే కొత్త ఆలోచ నలు పుడతాయి. అక్కడే మనం నిజంగా ఎదుగుతాం. అందుకే, ఎప్పుడైనా జీవితంలో దారి కనిపించకపోతే... ప్రశ్నలు అడగండి. తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు కొత్త విషయం నేర్చు కున్నప్పుడు, మీ జీవితంలో ఒక కొత్త తలుపు తెరుచుకుంటుంది.
నేను మిమ్మల్ని అడగాలనుకునే మరో ‘వాట్ ఇఫ్ ప్రశ్న’... ఒకవేళ మీరు నేర్చుకోవడాన్ని జీవితాంతం కొనసాగిస్తే? అప్పుడు, మీ జీవితం ఎప్పటికీ ఒకే చోట నిలిచిపోదు. మీరు మారుతారు. ప్రపంచాన్ని చూసే మీ దృష్టి మారుతుంది. అదే నిజమైన విజయం. మా కుటుంబం ఆర్థికంగా చాలా సాధారణంగా ఉండేది. ఎనిమిది మంది పిల్లల్లో నేను ఒకరిని. మాకు అవసరమైనవి ఉండేవి. కానీ, కోరుకున్నది మాత్రం దొరికేది కాదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే... అదే నా జీవితంలో ఒక గొప్ప వరం అనిపిస్తోంది. ఎందుకంటే, అది నాలో ఆకలిని పెంచింది. కష్టపడే అలవాటును నేర్పింది. ఈ రోజు నేను సాధించిన ప్రతి విజయానికి ఆ రోజులే పునాది. ఎప్పుడూ కొత్త లక్ష్యాలు పెట్టుకోండి. కొత్త ఆశలు కలిగి ఉండండి. కొత్త కలల కోసం ప్రయాణం కొనసాగించండి. కలలు లేని జీవితం, ముందుకు సాగని నది లాంటిది. పెద్ద కలలు కనేవారే పెద్ద మార్పులు తీసు కొస్తారు. కల అంటే... కేవలం ఊహ కాదు. అది ఒక దిశ. ఒక లక్ష్యం. ఒక భవిష్యత్తు.
విజయం అంటే ఏమిటి?
ఈ రోజుల్లో చాలామంది... ఎక్కువ డబ్బు సంపాదించడం, పెద్ద పదవి పొందడం, పేరు సంపాదించడం... ఇవే విజయమని భావిస్తున్నారు. కానీ నా దృష్టిలో నిజమైన విజయం వేరు. విజయం అంటే... ఒక మంచి స్నేహితుడిగా ఉండడం. నమ్మకమైన భాగస్వా మిగా మెలగడం. ఇతరులకు తోడుగా నిలవడం. మంచి మనిషిగా జీవించడం. దయ, నిజాయితీ, మానవత్వం, సహానుభూతి... ఇవి ఎప్పటికీ పాతబడని విలువలు. ఒకప్పుడు... లింగం, కులం, జాతి, వర్గం, లేదా మన నేపథ్యం ఆధారంగా మనిషిని విలువను నిర్ణయించేవారు. అలాంటి నియమాలు తప్పు. వాటిని మార్చాల్సిందే. కానీ కొన్ని విలువలు మాత్రం ఎప్పటికీ మార కూడదు. వాటిలో నాకు అత్యంత ఇష్టమైనది... నువ్వు ఇతరులు నీతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటావో, నువ్వూ వారితో అలాగే ప్రవర్తించు. దీనినే ‘గోల్డెన్ రూల్’ అంటారు. ఇది చాలా సులభంగా అనిపిస్తుంది. కానీ దీన్ని ప్రతిరోజూ పాటించడం అంత సులభం కాదు. అయినా ఇదే జీవితానికి దారి చూపే దిక్సూచి.
నా చివరి ‘వాట్ ఇఫ్’. ఒకవేళ, మీరు నిరాశకు లొంగిపోకుండా ముందుకు సాగితే? ఒకవేళ, మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ జీవిస్తే? ఒకవేళ, మీరు కలిసి మెలిసి పనిచేస్తే? అప్పుడు మీరు ఊహించలేని అద్భుతాలను సృష్టించగలరు. కొత్త ప్రపంచాన్ని నిర్మించగలరు. గాయాలను మాన్పగలరు. ప్రజల జీవితాల్లో ఆశలు నింపగలరు. ఈ రోజు మీ చేతిలో డిగ్రీ ఉంది. రేపు మీ చేతిలో సంస్థలు ఉంటాయి. పరిశోధనలు ఉంటాయి. పాఠశాలలు ఉంటాయి. వ్యాపారాలు ఉంటాయి. ప్రభుత్వ బాధ్యతలుండొచ్చు. కుటుంబాలు ఉంటాయి. అంటే... మీ నిర్ణయాలు వేలాదిమంది జీవితాలను ప్రభావితం చేస్తాయి. అందుకే, ఎల్లప్పుడూ దయతో ఉండండి. నిజాయితీని ఎంచుకోండి. మానవత్వాన్ని పంచుకోండి.


