మాధవ్ శింగరాజు
కష్టాలను దాటుకుని ఎంత గొప్పగా లక్ష్యాన్ని చేరుకున్నా, ఆ వచ్చిన దారిని ఎప్పుడైనా తలచుకున్నప్పుడు... లక్ష్యాన్ని చేరుకోవటంకంటే కూడా కష్టాలను గట్టెక్కుతూ రావటమే గొప్ప విజయంలా అనిపిస్తుంటుంది నాకు! స్త్రీ జీవితంలోని అతి పెద్ద కష్టం... పురుషుడు! నా జీవితంలో ఆ అతి పెద్ద కష్టం నా జీవన సహచరుడు ఆండ్రియా, నా తండ్రి ఫ్రాన్సిస్కో. ఇంకా, నా రాజకీయ జీవితంలోని అనేకానేక మంది ఆండ్రియాలు, ఫ్రాన్సిస్కోలు. ఇటలీలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి పెద్ద వార్త... ప్రధానిగా నేను రికార్డ్ బ్రేక్ చేయటం! వెల్, మీడియా చేసే ‘అతి’ తప్ప, ఏదీ కూడా ఎప్పుడూ అతి పెద్ద వార్త కాదు నా దృష్టిలో. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, గత 80 ఏళ్లలో 2001–2005 మధ్య మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ సృష్టించిన 1,412 రోజుల పాలన రికార్డును నేను సెప్టెంబర్ 3న బ్రేక్ చేశానట! ఆ రోజుతో ప్రధానిగా నేను 1,413 రోజులు పూర్తి చేసుకున్నానట!
బెర్లుస్కోనీ బ్రేకులు బ్రేకులుగా 9 ఏళ్లు పాలించినా...మెలోని ఒక్క బ్రేక్ కూడా లేకుండా తన 3 సంవత్సరాల 316 రోజుల పాలనతో ఆయన్ని వెనక్కి నెట్టేశారనీ పత్రికలు రాస్తున్నాయి. స్త్రీ ఎవర్నీ వెనక్కు నెట్టేయదు. తనుముందుకు వెళ్లటం మాత్రమే చేస్తుంది. ప్రధానిగా నా రికార్డుదేముంది కానీ... రాజకీయాల్లోంచి నాకై నేను పారిపోయేలా చేసేందుకు ఎవరెన్ని మాటలు అన్నారో అవన్నీ కదా అసలైన రికార్డులు! ముప్పై ఏళ్ల వయసులో తొలిసారి నేను మంత్రినైనప్పుడు... ‘‘అనుభవం లేని ఈ ‘పొట్టి పిల్ల’ మంత్రిగా ఏం చేస్తుంది?’’ అని సీనియర్ నాయకులు ఫక్కున నవ్వారు! 5 అడుగుల 3 అంగుళాల ఎత్తు అన్నది ‘పొట్టి’ కిందకే రావచ్చు. కానీ ఆ మాట అన్న పొడగరులు ఆ ఒక్క మాటతో ఎంత ఎత్తు నుండి పడిపోయారో గ్రహించన్నా గ్రహించి ఉంటారా! సాటి ప్రజా ప్రతినిధిని పట్టుకుని ‘పిల్ల’ అని అనటంలోనే వాళ్లెంత పెద్దమనుషులో తేలిపోలేదా? నన్ను ‘గార్బటెల్లా గర్ల్’ అని అన్నారు. వీధి బాలికననీ, రోడ్డు పక్కన పెరిగిన అమ్మాయిననీ వాళ్ల చిన్నచూపు.
రోమ్‌లోని నిరుపేదలు, కార్మికులు ఉండే ప్రాంతం గార్బటెల్లా నుంచి వచ్చానని నా భాషను కూడా వాళ్లు... ‘జానపద నగర మాండలికం’ అని గేలి చేశారు. నా దుస్తుల్ని గార్బటెల్లా ఫ్యాషన్ అన్నారు! ప్యాంటు, టీ షర్ట్ తొడుక్కోవటం తప్ప ఇటాలియన్ ఫ్యాషన్ సెన్ ్స లేదు అన్నారు. నన్ను ‘లావు’ అన్నారు, ‘ఆవు’ అన్నారు. నేను దేనికీ తల దించకపోవటం చూసి, నన్ను కించపరచటానికి నా తండ్రి గతాన్ని తవ్వి తీశారు. ‘‘ఈమె ఎవరో కాదు, డ్రగ్స్ కేసులో జైలు శిక్ష అనుభవించిన ఫ్రాన్సిస్కో అనే ఒక నేరస్థుడి కూతురు’’ అన్నారు. నేను కొన్నాళ్లు కలిసి జీవించిన ఆండ్రియా మాట తెచ్చి... ‘‘సంప్రదాయాలు, కుటుంబ విలువల గురించి మాట్లాడే ఈమె... పెళ్లి చేసుకోకుండానే కూతుర్ని కనింది’’ అన్నారు. ఇంట్లోని మగవాళ్లు బయటి మగవాళ్లకు ఆయుధాలుగా మారినప్పుడు స్త్రీ మరింత గట్టిగా అరచి తన కోసం తను పోరాటం చేయవలసి వస్తుంది.
మగ మాటలతో, మగ చూపులతో తలపడి నిలబడిన ప్రతి క్షణమూ నేను విజయవంతంగా పూర్తి చేసిన ఐదేళ్ల పాలనా కాలంతో నాకు సమానం అయినప్పుడు... సిల్వియో బెర్లుస్కోనీ, మారియో డ్రాఘి, జ్యుసేప్ జానార్డెల్లి, మట్టెయో రెంజీ, జియోవన్నీ లాంజా... ఎంత మంది ఇటలీ ప్రధానుల పదవీ కాలాలు నా వల్ల బ్రేక్ అయితే మాత్రం నాకు గొప్పౌతుంది?! నిత్యం మగాళ్లతో ఇంట్లో, బయటా అవస్థలు, అవమానాలు పడుతున్న సాధారణ స్త్రీల అనుక్షణ జీవిత కాలం ముందు ప్రధానిగా నా ఎన్నేళ్ల నిరవధిక పదవీ కాలమైనా ఏం లెక్కౌతుంది?!


