breaking news
Italy Prime Minister
-
జార్జియా మెలోని (ఇటలీ ప్రధాని) రాయని డైరీ
కష్టాలను దాటుకుని ఎంత గొప్పగా లక్ష్యాన్ని చేరుకున్నా, ఆ వచ్చిన దారిని ఎప్పుడైనా తలచుకున్నప్పుడు... లక్ష్యాన్ని చేరుకోవటంకంటే కూడా కష్టాలను గట్టెక్కుతూ రావటమే గొప్ప విజయంలా అనిపిస్తుంటుంది నాకు! స్త్రీ జీవితంలోని అతి పెద్ద కష్టం... పురుషుడు! నా జీవితంలో ఆ అతి పెద్ద కష్టం నా జీవన సహచరుడు ఆండ్రియా, నా తండ్రి ఫ్రాన్సిస్కో. ఇంకా, నా రాజకీయ జీవితంలోని అనేకానేక మంది ఆండ్రియాలు, ఫ్రాన్సిస్కోలు. ఇటలీలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి పెద్ద వార్త... ప్రధానిగా నేను రికార్డ్ బ్రేక్ చేయటం! వెల్, మీడియా చేసే ‘అతి’ తప్ప, ఏదీ కూడా ఎప్పుడూ అతి పెద్ద వార్త కాదు నా దృష్టిలో. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, గత 80 ఏళ్లలో 2001–2005 మధ్య మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ సృష్టించిన 1,412 రోజుల పాలన రికార్డును నేను సెప్టెంబర్ 3న బ్రేక్ చేశానట! ఆ రోజుతో ప్రధానిగా నేను 1,413 రోజులు పూర్తి చేసుకున్నానట! బెర్లుస్కోనీ బ్రేకులు బ్రేకులుగా 9 ఏళ్లు పాలించినా...మెలోని ఒక్క బ్రేక్ కూడా లేకుండా తన 3 సంవత్సరాల 316 రోజుల పాలనతో ఆయన్ని వెనక్కి నెట్టేశారనీ పత్రికలు రాస్తున్నాయి. స్త్రీ ఎవర్నీ వెనక్కు నెట్టేయదు. తనుముందుకు వెళ్లటం మాత్రమే చేస్తుంది. ప్రధానిగా నా రికార్డుదేముంది కానీ... రాజకీయాల్లోంచి నాకై నేను పారిపోయేలా చేసేందుకు ఎవరెన్ని మాటలు అన్నారో అవన్నీ కదా అసలైన రికార్డులు! ముప్పై ఏళ్ల వయసులో తొలిసారి నేను మంత్రినైనప్పుడు... ‘‘అనుభవం లేని ఈ ‘పొట్టి పిల్ల’ మంత్రిగా ఏం చేస్తుంది?’’ అని సీనియర్ నాయకులు ఫక్కున నవ్వారు! 5 అడుగుల 3 అంగుళాల ఎత్తు అన్నది ‘పొట్టి’ కిందకే రావచ్చు. కానీ ఆ మాట అన్న పొడగరులు ఆ ఒక్క మాటతో ఎంత ఎత్తు నుండి పడిపోయారో గ్రహించన్నా గ్రహించి ఉంటారా! సాటి ప్రజా ప్రతినిధిని పట్టుకుని ‘పిల్ల’ అని అనటంలోనే వాళ్లెంత పెద్దమనుషులో తేలిపోలేదా? నన్ను ‘గార్బటెల్లా గర్ల్’ అని అన్నారు. వీధి బాలికననీ, రోడ్డు పక్కన పెరిగిన అమ్మాయిననీ వాళ్ల చిన్నచూపు.రోమ్‌లోని నిరుపేదలు, కార్మికులు ఉండే ప్రాంతం గార్బటెల్లా నుంచి వచ్చానని నా భాషను కూడా వాళ్లు... ‘జానపద నగర మాండలికం’ అని గేలి చేశారు. నా దుస్తుల్ని గార్బటెల్లా ఫ్యాషన్ అన్నారు! ప్యాంటు, టీ షర్ట్ తొడుక్కోవటం తప్ప ఇటాలియన్ ఫ్యాషన్ సెన్ ్స లేదు అన్నారు. నన్ను ‘లావు’ అన్నారు, ‘ఆవు’ అన్నారు. నేను దేనికీ తల దించకపోవటం చూసి, నన్ను కించపరచటానికి నా తండ్రి గతాన్ని తవ్వి తీశారు. ‘‘ఈమె ఎవరో కాదు, డ్రగ్స్ కేసులో జైలు శిక్ష అనుభవించిన ఫ్రాన్సిస్కో అనే ఒక నేరస్థుడి కూతురు’’ అన్నారు. నేను కొన్నాళ్లు కలిసి జీవించిన ఆండ్రియా మాట తెచ్చి... ‘‘సంప్రదాయాలు, కుటుంబ విలువల గురించి మాట్లాడే ఈమె... పెళ్లి చేసుకోకుండానే కూతుర్ని కనింది’’ అన్నారు. ఇంట్లోని మగవాళ్లు బయటి మగవాళ్లకు ఆయుధాలుగా మారినప్పుడు స్త్రీ మరింత గట్టిగా అరచి తన కోసం తను పోరాటం చేయవలసి వస్తుంది.మగ మాటలతో, మగ చూపులతో తలపడి నిలబడిన ప్రతి క్షణమూ నేను విజయవంతంగా పూర్తి చేసిన ఐదేళ్ల పాలనా కాలంతో నాకు సమానం అయినప్పుడు... సిల్వియో బెర్లుస్కోనీ, మారియో డ్రాఘి, జ్యుసేప్ జానార్డెల్లి, మట్టెయో రెంజీ, జియోవన్నీ లాంజా... ఎంత మంది ఇటలీ ప్రధానుల పదవీ కాలాలు నా వల్ల బ్రేక్ అయితే మాత్రం నాకు గొప్పౌతుంది?! నిత్యం మగాళ్లతో ఇంట్లో, బయటా అవస్థలు, అవమానాలు పడుతున్న సాధారణ స్త్రీల అనుక్షణ జీవిత కాలం ముందు ప్రధానిగా నా ఎన్నేళ్ల నిరవధిక పదవీ కాలమైనా ఏం లెక్కౌతుంది?! -
నాటో చీఫ్‌కు మెలోనీ స్ట్రాంగ్ వార్నింగ్..
రోమ్: నాటో చీఫ్ మార్క్ రుట్టే చేసిన వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్రంగా ఖండించారు. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యలో ఇటలీ కూడా భాగస్వామి అయిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని మండిపడ్డారు ఇరాన్‌పై జరిగిన యుద్ధంలో ఇటలీ ప్రత్యక్షంగా పాల్గొనలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితిని తప్పుగా ప్రతిబింబిస్తున్నాయని ఆమె హెచ్చరిస్తూ కౌంటరిచ్చారు.ఫ్రాన్స్–ఇటలీ ద్వైపాక్షిక సదస్సు అనంతరం మీడియాతో మాట్లాడిన మెలోనీ..‘నాటో ప్రధాన కార్యదర్శ మార్క్ రుట్టే చాలా ఉత్సాహంగా వివరణ ఇచ్చే క్రమంలో వేర్వేరు అంశాలను ఒకటిగా కలిపేశారు. ఇటలీ అనుమతించిన విమానాల స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మేం ఇరాన్‌పై జరిగిన సైనిక దాడుల్లో పాల్గొనలేద’ అని స్పష్టం చేశారు. అయితే, ఈ వివాదానికి కారణమైన వ్యాఖ్యలు ఇటీవల మార్క్ రుట్టే అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వచ్చాయి.అమెరికా ఇరాన్‌పై చేపట్టిన "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" సందర్భంగా యూరప్‌లోని అమెరికా స్థావరాల నుంచి వేలాది విమానాలు ఎగిరాయని, అందులో ఇటలీలోని అమెరికా సైనిక స్థావరాల నుంచి కూడా వందలాది విమానాలు బయలుదేరాయని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇటలీ ప్రత్యక్షంగా యుద్ధానికి సహకరించిందనే అభిప్రాయం ఏర్పడింది. అయితే ఇటలీ ప్రభుత్వం దీనిని వెంటనే ఖండించింది. తమ భూభాగంలోని అమెరికా సైనిక స్థావరాల నుంచి కేవలం సాంకేతిక, లాజిస్టిక్, నిర్వహణ సంబంధిత విమానాలకే అనుమతి ఇచ్చామని, యుద్ధ కార్యకలాపాలు, దాడులు లేదా ఆయుధ మద్దతుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇటలీ రాజ్యాంగం, అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలో మాత్రమే వ్యవహరించామని తెలిపింది.మరోవైపు.. ఈ వివాదంపై ఇటలీ విదేశాంగ మంత్రి అంటోనియో తజానీ కూడా స్పందిస్తూ.. రుట్టే వ్యాఖ్యలను అతిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. నాటో చీఫ్ ఉద్దేశం లాజిస్టిక్ సహకారం గురించేనని, ఇటలీ యుద్ధంలో పాల్గొన్నట్లు చెప్పడం సరైంది కాదని పేర్కొన్నారు. ఇక, ఈ వివాదం ఇటలీ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం అసలు నిజాలు చెప్పిందా? లేదా అనే అంశంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, మెలోనీ ప్రభుత్వం మాత్రం ఇరాన్ యుద్ధంలో ఇటలీకి ప్రత్యక్ష పాత్ర లేదనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. -
మెలోనిపై మరోసారి మండిపడ్డ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని మెలోని మధ్య వైరం రోజురోజుకు ముదురుతుంది. తాజాగా మెలోని వ్యాఖ్యలకు ట్రంప్ కౌంటరిచ్చారు. ఇటలీలో ఆమె పనులు సరిగ్గా లేవని అందుకే ఆమె.. తనను విమర్శిస్తూ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. అయితే దీనికి మెలోనీ సైతం కౌంటరిచ్చింది. తన ప్రజాదారణతో మీకేం పని అని ట్రంప్‌ను ప్రశ్నించింది. డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఇటలీ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య అగ్గి రాజేస్తున్నాయి.. ట్రంప్ వ్యాఖ్యలను మెలోని ఇదివరకే ఖండించగా మరోసారి సోషల్ మీడియా వేదికగా ట్రంప్ రెచ్చిపోయారు.తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా స్పందిస్తూ.."ఇటలీలో మెలోని ప్రజాదరణ చాలా బలహీనంగా ఉంది. ఇరాన్ అణుబాంబు తయారీని అడ్డుకునే విషయంలో ఆమె అమెరికాకు మద్దతు ఇవ్వకపోవడమే దీనికి కారణం కావచ్చు. నిజానికి ఇటలీని అమితంగా ప్రేమించేది, రక్షించేది అమెరికా మాత్రమే ఆ మాటకు వస్తే నాటో కూడా ఇరాన్ విషయంలో అలాగే వ్యవహరించింది" అని రాసుకొచ్చారు.అదేవిధంగా యుద్ధ సమయంలో ఇటలీకి చెందిన రన్‌వేలను లేదా ల్యాండింగ్ స్ట్రిప్స్‌ను అమెరికా వాడుకోకుండా మెలోని అడ్డుకున్నారని ఆరోపించారు. ఇటలీతో పాటు ఇతర నాటో కూటమి దేశాల రక్షణ కోసం అమెరికా ప్రతిటా వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ మెలోని కనీసం మా విమానాలు ల్యాండ్ అవ్వడానికి కూడా అనుమతించలేదు. ఇది మాకు తీవ్రమైన రవాణా ఇబ్బందిని కలిగించిందని.. ఇప్పుడు తన ప్రజాదరణ రేటింగ్లను పెంచుకోవడం కోసమే ఆమె నాతో స్నేహం నటిస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు.మెలోని స్పందనట్రంప్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అంతే తీవ్రంగా స్పందించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె ట్రంప్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. "ఇలాంటి కారణం లేని, నిరంతర దాడులు అర్థరహితమైనవి. మీతో స్నేహం చేయడం వల్ల నా ప్రజాదరణ పెరిగిందేమీ లేదు, అది మీతో ఉండే సంబంధాలపై ఆధారపడి కూడా లేదు. ఇటలీ జాతీయ ప్రయోజనాలను కాపాడటంలో నాకున్న సామర్థ్యంపైనే నా ప్రజాదరణ ఆధారపడి ఉంటుంది. నేను ఎప్పుడూ దాన్నే చేస్తూ వచ్చాను" అని మెలోని స్పష్టం చేశారు.ఏది ఏమైనప్పటికీ, నా ప్రజాదరణ గురించి మీకేం అవసరం లేదు. దానికి బదులు మీ పాపులారిటీపై మీరు దృష్టి పెడితే మంచిదని నా సూచన అంటూ మెలోని ట్రంప్‌పై విరుచుకుపడ్డారు.వివాదం ఎలా మెుదలైందంటే..ట్రంప్ మాట్లాడుతూ " నేను మెలోనితో మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆమె నాతో ఫోటో దిగాలని ఎంతగానో తపించింది. నేను అసలు ఫోటో దిగకూడదనే అనుకున్నాను, కానీ ఆమెను చూసి జాలిపడి మాట్లాడాను. నాతో మాట్లాడినందుకు ఆమె ఇప్పుడు సంతోషంగానే ఉండి ఉంటుంది" అని అన్నారు. దీనికి ఘాటుగా బదులిచ్చిన మెలోని "డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా కల్పితాలు, ఈ ప్రవర్తన నన్ను ఆశ్చర్యపరిచింది. అమెరికా అధ్యక్షుడు తన సొంత మిత్రదేశాల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదు. అయితే పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల, అమెరికా శత్రువుల పట్ల ఆయన ఇంత పట్టుదల చూపించకపోవడం విచారకరం. నేను గానీ, నా దేశం ఇటలీ గానీ ఎవరిముందూ ఎన్నటికీ మోకరిల్లం, బతిమాలం" అని మెలోని తేల్చిచెప్పారు. -
మెలోని నాతో ఫోటో కోసం ప్రాధేయపడింది
రోమ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం చాలా కష్టం.. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వివాదాస్పదంగా మారాయి. ఇటలీ ప్రధాని తనతో ఫోటో దిగడం కోసం "ప్రాధేయపడ్డారని ట్రంప్ అనడం ఇప్పుడు ఇరు దేశాల మధ్య నిప్పు రాజేస్తోంది.. తాజాగా దీనిపై మెలోని స్పందించారు.ఫ్రాన్స్ వేదికగా ఇటీవల జీ7 సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. అయితే దాని అనంతరం ట్రంప్ ఒక టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యుూ ఇచ్చారు. అందులో తాను మాట్లాడుతూ "ఇటలీ ప్రధాని తనతో ఫోటో దిగడం కోసం ప్రాధేయపడ్డారు మెలోనికి తనతో ఫోటో దిగాలని ఎంతో బలంగా ఉందని ఆమెపై జాలిపడి మాత్రమే తాను ఫోటోకు అంగీకరించాను. ఆమె నాతో మాట్లాడినందుకు సంతోషంగా ఉండి ఉంటుంది. నేనేమీ ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పక్కన నిలబడి ఫోటో దిగాలని ఆమె నన్ను బతిమిలాడారు. నేను ఫోటో దిగేవాడిని కాదు, కానీ ఆమెను చూసి జాలి వేసింది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.అయితే ఈ వ్యాఖ్యలపై మెలోని మండిపడింది. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం, కల్పితం. ఆయన మాటలు నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. అమెరికా అధ్యక్షుడు తన సొంత మిత్రదేశాల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల, అమెరికా శత్రువుల పట్ల ఎంత మృదువుగా ఉంటారో, మిత్రదేశాల పట్ల కూడా అలా ఉంటే బాగుంటుంది. అయితే ఆయన ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి: నేను కానీ, ఇటలీ దేశం కానీ ఎవరి ముందూ ఎన్నటికీ ప్రాధేయపడవు" అని మెలోని స్పష్టం చేశారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపైనా ప్రభావం చూపుతున్నాయి. అమెరికా పర్యటించాల్సిన ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తన ప్రతిపాదిత అమెరికా పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. మెలోనిని ఉద్దేశించి ట్రంప్ అన్న అనుచిత మాటలు మొత్తం ఇటలీ దేశాన్ని అవమానించడమేనని ఆయన ఎక్స్ (X) లో పేర్కొన్నారు. జూన్ 21, 22 తేదీల్లో ఆయన అమెరికాలో పర్యటించాల్సి ఉంది.ఇటలీ మంత్రుల ఆగ్రహంప్రధానమంత్రి కార్యాలయ అండర్ సెక్రటరీ గియోవన్ బాటిస్టా ఫజ్జోలారి స్పందిస్తూ.. "ట్రంప్ కావాలనే చేస్తున్నారో లేదా చేతగాక చేస్తున్నారో తెలియదు కానీ, అమెరికా-యూరప్ మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాలను నాశనం చేస్తున్నారు. తన అనుచిత వ్యాఖ్యల ద్వారా యూరప్ ఖండంలో అమెరికా ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా, అమెరికాకు కూడా తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు" అని విమర్శించారు.ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో కూడా ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. మెలోని ఎవరినైనా ఫోటో కోసం బతిమిలాడుతుందంటే తాను నమ్మనని, బెదిరించినా ఆమె అలా చేయదు" అని అన్నారుద్వైపాక్షిక సంబంధాలపై ఎఫెక్ట్ట్రంప్ రెండోసారి పదవిలోకి వచ్చినప్పుడు మెలోని అమెరికా-ఇటలీ బంధాన్ని మరింత బలోపేతం చేయాలని భావించినప్పటికీ, ఇటీవల పోప్ లియోపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ ఘర్షణలను ఖండిస్తూ పోప్ లియో చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ మండిపడటాన్ని మెలోని ఈ ఏడాది విమర్శించారు. దానికి బదులుగా అమెరికా అధ్యక్షుడు మెలోనిని ఉద్దేశించి ఆమెకు ధైర్యం లేదు అని ఘాటుగా విమర్శించారు. కాగా ఈ తాజా వివాదం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. -
రష్యా,ఉక్రెయిన్ మధ్య శాంతికి భారత్ పాత్ర కీలకం: ఇటలీ పీఎం
రోమ్: రష్యా-ఉక్రెయిన్ల మధ్య రెండేళ్లుగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా- ఉక్రెయిన్ల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి భారత్, చైనా కీలక పాత్ర పోషిస్తాయని మెలోని అన్నారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇటలీలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా జెలెన్స్కీ మెలోనితో సమావేశమయ్యారు. రష్యా, ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి ఇటలీ మద్దతుటుందని మెలోని తెలిపారు. రష్యా- ఉక్రెయిన్ల మధ్య శాంతి నెలకొనేందుకు భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు మధ్యవర్తిత్వం వహించగలవని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవలే వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదీ చదవండి.. వాళ్లు సంక్షోభాన్ని పోగోట్టగలరు -
ఇటలీ ప్రధాని పొడవుపై కామెంట్స్.. జర్నలిస్టుకు జరిమానా
రోమ్: ఇటలీలో మహిళా జర్నలిస్టు గిలియా కోర్టిస్‌కు కోర్టు రూ.4.5లక్షల(5వేల యూరోలు) జరిమానా విధించింది. ప్రధాని జార్జియా మెలోని పొడవుపై మూడేళ్ల క్రితం ఎక్స్(ట్విటర్)లో కోర్టిస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మెలోని కోర్టులో దావా వేశారు. ఈ దావాపై విచారణ పూర్తి చేసిన కోర్టు జర్నలిస్టు కోర్టిస్‌కు ఫైన్ వేసింది. ఫైన్ మొత్తాన్ని మెలోనికి చెల్లించాలని ఆదేశించింది. తనకు జరిమానా విధించడంపై కోర్టిస్ స్పందించారు. ఇటీవలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో ఉందని వ్యాఖ్యానించారు. స్వతంత్ర జర్నలిస్టులకు ఇటలీలో కష్టకాలం కొనసాగుతోందన్నారు. కోర్టు ద్వారా వచ్చే మొత్తాన్ని మెలోని చారిటీ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేస్తారని ఆమె న్యాయవాది తెలిపారు. -
Italian Premier Giorgia Meloni: రష్యా ప్రతిపాదన.. ఓ ఎత్తుగడ
బోర్గో ఎగ్నాజియా(ఇటలీ): సరిగ్గా జీ7 శిఖరాగ్ర భేటీ మొదలైన రోజే షరతులు ఒప్పుకుంటే ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ తక్షణం అమలుచేస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనను ప్రచార ఎత్తుగడగా అని ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ అభివరి్ణంచారు. ఇటలీ సారథ్యంలో ఈ ఏడాది జీ7 భేటీ జరిగాక శనివారం విలేకరుల సమావేశంలో మెలోనీ మాట్లాడారు. ‘‘ కుదిరితే జపాన్, లేదంటే అమెరికా, బ్రిటన్, కెనడాలు సంయుక్తంగా ఉక్రెయిన్‌కు 50 బిలియన్ డాలర్లమేర రుణాలు ఈ ఏడాది చివరికల్లా అందిస్తాయి. యూరప్‌లో స్తంభింపజేసిన రష్యా ఆస్తులను వాడుకుని తద్వారా ఈ రుణాలను చెల్లిస్తాయి. యురోపియన్ యూనియన్ సభ్య దేశాలకు ఈ రుణాలతో ఎలాంటి సంబంధం లేదు. అమెరికా, బ్రిటన్ వంటి జీ7 దేశాలే ఈ రుణ అంశాలను చూసుకుంటాయి’ అని స్పష్టంచేశారు. గాజా స్ట్రిప్‌పై భీకర దాడులతో వేలాది మంది అమాయక పాలస్తీనియన్ల మరణాలకు కారణమైన ఇజ్రాయెల్‌ను జీ7 దేశాలు ఎందుకు శిఖరాగ్ర సదస్సులో తీవ్రంగా మందలించలేదు? అని మీడియా ప్రశ్నించింది. ‘‘ అసలు ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ఎవరు అనేది మీరొకసారి గుర్తుచేసుకోండి. హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి 1,200 మందిని పొట్టనపెట్టుకున్నారు. హమాస్ పన్నిన ఉచ్చులో ఇజ్రాయెల్ పడింది’ అని మెలోనీ వ్యాఖ్యానించారు. ‘‘ అక్రమ వలసలకు వ్యతిరేకంగా జీ7 కూటమి స్పందించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆఫ్రికా దేశాలకు నిధుల మంజూరు, పెట్టుబడులు పెంచడం ద్వారా ఆయా దేశాల నుంచి ఐరోపాకు వలసలను తగ్గించవచ్చు’ అని చెప్పారు. ఐరోపా దేశాలకు వలస వస్తున్న ఆఫ్రికా పేదలకు ఇటలీ ముఖద్వారంగా ఉన్న విషయం విదితమే. -
ఇద్దరు కొత్త ప్రధానుల నియామకం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా బిల్ ఇంగ్లీష్ నియమితులయ్యారు. ఆ దేశ అధికార నేషనల్ పార్టీ ప్రధాని పదవికి ఆయన పేరును ఖరారు చేసింది. ఇక ఇటలీ ప్రధానిగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి పాలో గెంటిలోనిని నియమించారు. ఆ దేశాధ్యక్షుడు సెర్గియో మాటరెల్లా అన్ని పార్టీల నాయకులను సంప్రదించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. గత సోమవారం న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ, ఇటలీ ప్రధాని మట్టెయో రెంజీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి స్థానాల్లో కొత్త నేతలను ఎన్నుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ స్వచ్ఛందంగా రాజీనామా చేయగా.. ఇటలీ ప్రధాని రెంజీ మాత్రం రెఫరెండంలో వ్యతిరేకంగా తీర్పు రావడంతో వైదొలిగారు. ఇటలీలో రాజ్యాంగ సవరణ కోసం నిర్వహించిన రెఫరెండంలో (ప్రజాభిప్రాయ సేకరణ) ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారు.


