రోమ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం చాలా కష్టం.. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వివాదాస్పదంగా మారాయి. ఇటలీ ప్రధాని తనతో ఫోటో దిగడం కోసం "ప్రాధేయపడ్డారని ట్రంప్ అనడం ఇప్పుడు ఇరు దేశాల మధ్య నిప్పు రాజేస్తోంది.. తాజాగా దీనిపై మెలోని స్పందించారు.
ఫ్రాన్స్ వేదికగా ఇటీవల జీ7 సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. అయితే దాని అనంతరం ట్రంప్ ఒక టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యుూ ఇచ్చారు. అందులో తాను మాట్లాడుతూ "ఇటలీ ప్రధాని తనతో ఫోటో దిగడం కోసం ప్రాధేయపడ్డారు మెలోనికి తనతో ఫోటో దిగాలని ఎంతో బలంగా ఉందని ఆమెపై జాలిపడి మాత్రమే తాను ఫోటోకు అంగీకరించాను. ఆమె నాతో మాట్లాడినందుకు సంతోషంగా ఉండి ఉంటుంది. నేనేమీ ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పక్కన నిలబడి ఫోటో దిగాలని ఆమె నన్ను బతిమిలాడారు. నేను ఫోటో దిగేవాడిని కాదు, కానీ ఆమెను చూసి జాలి వేసింది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అయితే ఈ వ్యాఖ్యలపై మెలోని మండిపడింది. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం, కల్పితం. ఆయన మాటలు నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. అమెరికా అధ్యక్షుడు తన సొంత మిత్రదేశాల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల, అమెరికా శత్రువుల పట్ల ఎంత మృదువుగా ఉంటారో, మిత్రదేశాల పట్ల కూడా అలా ఉంటే బాగుంటుంది. అయితే ఆయన ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి: నేను కానీ, ఇటలీ దేశం కానీ ఎవరి ముందూ ఎన్నటికీ ప్రాధేయపడవు" అని మెలోని స్పష్టం చేశారు.
అయితే ట్రంప్ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపైనా ప్రభావం చూపుతున్నాయి. అమెరికా పర్యటించాల్సిన ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తన ప్రతిపాదిత అమెరికా పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. మెలోనిని ఉద్దేశించి ట్రంప్ అన్న అనుచిత మాటలు మొత్తం ఇటలీ దేశాన్ని అవమానించడమేనని ఆయన ఎక్స్ (X) లో పేర్కొన్నారు. జూన్ 21, 22 తేదీల్లో ఆయన అమెరికాలో పర్యటించాల్సి ఉంది.
ఇటలీ మంత్రుల ఆగ్రహం
ప్రధానమంత్రి కార్యాలయ అండర్ సెక్రటరీ గియోవన్ బాటిస్టా ఫజ్జోలారి స్పందిస్తూ.. "ట్రంప్ కావాలనే చేస్తున్నారో లేదా చేతగాక చేస్తున్నారో తెలియదు కానీ, అమెరికా-యూరప్ మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాలను నాశనం చేస్తున్నారు. తన అనుచిత వ్యాఖ్యల ద్వారా యూరప్ ఖండంలో అమెరికా ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా, అమెరికాకు కూడా తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు" అని విమర్శించారు.ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో కూడా ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. మెలోని ఎవరినైనా ఫోటో కోసం బతిమిలాడుతుందంటే తాను నమ్మనని, బెదిరించినా ఆమె అలా చేయదు" అని అన్నారు
ద్వైపాక్షిక సంబంధాలపై ఎఫెక్ట్
ట్రంప్ రెండోసారి పదవిలోకి వచ్చినప్పుడు మెలోని అమెరికా-ఇటలీ బంధాన్ని మరింత బలోపేతం చేయాలని భావించినప్పటికీ, ఇటీవల పోప్ లియోపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ ఘర్షణలను ఖండిస్తూ పోప్ లియో చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ మండిపడటాన్ని మెలోని ఈ ఏడాది విమర్శించారు. దానికి బదులుగా అమెరికా అధ్యక్షుడు మెలోనిని ఉద్దేశించి ఆమెకు ధైర్యం లేదు అని ఘాటుగా విమర్శించారు. కాగా ఈ తాజా వివాదం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.


