ట్రంప్‌కు మరో షాక్‌.. కోర్టు తీర్పుతో కొత్త చిక్కులు! | Trump's $400M White House Ballroom Project Blocked by US Appeals Court | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు మరో షాక్‌.. కోర్టు తీర్పుతో కొత్త చిక్కులు!

Aug 8 2026 8:36 AM | Updated on Aug 8 2026 11:49 AM

Another Blow for Trump: Court Ruling Puts Ballroom Project in Trouble

అమెరికా న్యాయస్థానాలు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు వరుస షాకులు ఇస్తున్నాయి. తాజాగా.. ఆయన ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైట్‌హౌస్‌ బాల్‌రూమ్‌ ప్రాజెక్టుకు న్యాయపరమైన అడ్డంకి ఎదురైంది. కాంగ్రెస్‌ అనుమతి లేకుండా ఈ భారీ నిర్మాణాన్ని కొనసాగించేందుకు అధ్యక్షుడికి ఏకపక్ష అధికారం లేదని అమెరికా ఫెడరల్‌ అప్పీల్‌ కోర్టు స్పష్టం చేసింది. దీంతో 400 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3,400 కోట్లకు పైగా) వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుపై తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.

వైట్‌హౌస్‌ ఈస్ట్‌ వింగ్‌ ఉన్న ప్రాంతంలో సుమారు 90 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ బాల్‌రూమ్‌ను నిర్మించాలని ట్రంప్‌ నిర్ణయించారు. దాదాపు 999 మంది అతిథులు ఒకేసారి పాల్గొనేలా ఈ హాల్‌ను నిర్మించాలన్నది ప్రణాళిక. దీనిని ఆయన తన కలల ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. అయితే చారిత్రక భవన పరిరక్షణ సంస్థలు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించాయి. వైట్‌హౌస్‌ నిర్మాణ రూపకల్పనలో ఇంత పెద్ద మార్పు చేయాలంటే చట్టపరమైన అనుమతులు అవసరమని వాదించాయి.

కాంగ్రెస్‌ అనుమతి కంపల్సరీ!
వాషింగ్టన్‌ డీసీ సర్క్యూట్‌ అప్పీల్‌ కోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం 2-1 మెజారిటీతో ట్రంప్‌ పరిపాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. “భారీ బాల్‌రూమ్‌ నిర్మించాలా వద్దా అన్నది కాంగ్రెస్‌ నిర్ణయించాల్సిన విషయం. కార్యనిర్వాహక అధికారంతో స్వయంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు” అని కోర్టు పేర్కొంది. 

అయితే ఈ తీర్పు బాల్‌రూమ్‌ నిర్మాణం పూర్తిగా నిలిచిపోవాలని చెప్పడం కాదని స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ అనుమతి పొందిన తర్వాత నిర్మాణం కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది.

ట్రంప్‌ ఆగ్రహం..
ఇంతకుముందు నిర్మాణాన్ని నిలిపివేయాలని దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. తనను వ్యతిరేకించే న్యాయమూర్తులు ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వైట్‌హౌస్‌ భద్రత కోసం ఈ ప్రాజెక్టు అవసరమని ట్రంప్‌ ప్రభుత్వం వాదిస్తోంది. డ్రోన్లు, క్షిపణులు, జీవాయుధ ముప్పుల నుంచి అధ్యక్షుడు, ఆయన కుటుంబం, సిబ్బంది రక్షణ కోసం ఆధునిక భద్రతా ఏర్పాట్లు ఇందులో భాగమని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

భద్రత పేరుతో నిర్మాణం కొనసాగించలేరు..
అయితే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న సంస్థలు ఈ వాదనలను తోసిపుచ్చాయి. బాల్‌రూమ్‌ లేకపోవడం జాతీయ భద్రతా అత్యవసర పరిస్థితి కాదని పేర్కొన్నాయి. కోర్టు కూడా భద్రతకు సంబంధించిన భూగర్భ పనులను కొనసాగించేందుకు అనుమతించింది. బంకర్లు, ఇతర భద్రతా సదుపాయాల నిర్మాణానికి మాత్రం ఈ ఆదేశాలు వర్తించవని స్పష్టం చేసింది.

ఇప్పుడేం జరగనుంది?
అప్పీల్‌ కోర్టు తన తీర్పు అమలును రెండు వారాల పాటు నిలిపివేసింది. ఈ సమయంలో ట్రంప్‌ ప్రభుత్వం అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. 70 ఏళ్లకు పైగా వైట్‌హౌస్‌లో అతిపెద్ద నిర్మాణ మార్పుగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు కోర్టు, కాంగ్రెస్‌ నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ట్రంప్‌ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు న్యాయస్థానం బ్రేక్‌ వేయడంతో.. ఇది ఆయన పాలనలో మరో కీలక న్యాయపోరాటంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement