పుట్టుకతో పౌరసత్వంపై మళ్లీ ట్రంప్‌ కత్తి! | USA President Donald Trump signs new orders to limit birthright citizenship | Sakshi
Sakshi News home page

పుట్టుకతో పౌరసత్వంపై మళ్లీ ట్రంప్‌ కత్తి!

Aug 8 2026 5:16 AM | Updated on Aug 8 2026 5:16 AM

USA President Donald Trump signs new orders to limit birthright citizenship

పిల్లలను కనడం కోసమే వస్తున్నారని వ్యాఖ్య 

విదేశీ ఉద్యోగుల పిల్లలకూ నో! 

పాత ఆదేశాలను కొట్టేసిన కోర్టు 

కొన్ని వారాల్లోనే కొత్త ఆర్డర్లు!

వాషింగ్టన్‌: అమెరికాలో పుడితే చాలు.. ఆ దేశ పౌరసత్వం వచ్చేసినట్టే అన్న భరోసాకు ఇక కాలం చెల్లనుంది. ఎందుకంటే ఈ రకమైన ‘‘బర్త్‌ టూరిజమ్‌’’ను కట్టడి చేసే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ఒక ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ పాస్‌ చేసేశాడు. దీంతోపాటే పుట్టుకతో వచ్చే పౌరసత్వ అర్హతను మరింత కఠినతరం చేస్తూ ఇంకో ఆదేశమూ జారీ అయ్యింది. పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై గతంలో జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసిన కొన్ని వారాలకే ఈ కొత్త ఆర్డర్లు వెలువడటం గమనార్హం.  

పర్యాటకులుగా అమెరికా వచ్చి... ఉద్దేశపూర్వకంగా అక్కడే ప్రసవం జరిగేలా చూసుకుని పౌరసత్వం అర్హత సాధించే వారు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యారని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ట్రంప్‌ జారీ చేసిన తాజా ఉత్తర్వు వీరినే లక్ష్యంగా చేసుకుంటోంది. రెండో ఉత్తర్వు ప్రకారం.. పుట్టుకతో అమెరికా పౌరసత్వానికి అనర్హులుగా పరిగణించే వ్యక్తుల పరిధిని విస్తరించారు. విదేశీ ప్రభుత్వాల తరఫున లాబీయింగ్‌ చేసే విదేశీ పౌరుల పిల్లలతోపాటు మరికొంత మందికి పుట్టుకతో పౌరసత్వం రాదు. ట్రంప్‌ గతంలో కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేయగా... జూన్‌ 30వ తేదీ దేశ అత్యున్నత న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. 

కొన్ని మార్పులు చేస్తున్నాం: ట్రంప్‌ 
ఉత్తర్వులపై సంతకం చేసిన తరువాత ట్రంప్‌ ఓవల్‌ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమని, అందుకే కొన్ని మార్పులు చేస్తున్నామని తెలిపారు. 1868 జూలై 9న ఆమోదించిన అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికాలో జని్మంచిన లేదా సహజీకరణ (నాచురలైజేషన్, దీర్ఘకాలం నివాసం వల్ల వచ్చే పౌరసత్వం) పొందిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వం లభిస్తుంది. 

గతంలో బానిసలుగా ఉన్నవారి పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే ట్రంప్‌ మాత్రం ‘‘బానిసల పిల్లల కోసం అంతర్యుద్ధం తర్వాత ఈ సవరణ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడేం జరుగుతోంది? ఇప్పుడు కొందరు దీని సాయంతో వ్యాపారం చేస్తున్నారు’’అని అంటున్నారు. ఈ సందర్భంలోనే వైట్‌హౌస్‌ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ స్టీఫెన్‌ మిల్లర్‌ మాట్లాడుతూ...పుట్టుకతో పౌరసత్వం విషయంలో ప్రస్తుత విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, కొందరు ఇక్కడకు పర్యాటకులుగా వచ్చి బిడ్డను కనడం ద్వారా పౌరసత్వం పొందాలని చూస్తున్నారని 
ఆరోపించారు. 

ఇకపై వారిపైనా అనర్హత... 
ట్రంప్‌ జారీ చేసిన తాజా ఉత్తర్వుల్లో రెండోది అమెరికా పౌరసత్వ పత్రాలు జారీ చేయకూడని వ్యక్తుల పలు వర్గాలకు సంబంధించినది. తల్లి అమెరికాలో ప్రసవించేందుకు వీలుగా వాణిజ్య లావాదేవీ చేసిన వ్యక్తుల పిల్లలకు పౌరసత్వ పత్రాలు జారీ చేయరు. అలాగే ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న తల్లిదండ్రుల పిల్లలకు, విదేశీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, ఫెడరల్‌ చట్టం ప్రకారం పౌరసత్వం లభించని అమెరికా భూభాగాల్లో జని్మంచిన పిల్లలకు ఇకపై పుట్టుకతో పౌరసత్వం దొరకదు. 

అయితే ఈ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని వలస వ్యవహారాల నిపుణులు విమర్శిస్తున్నారు.  అమెరికాలో బర్త్‌ టూరిజం ద్వారా పుట్టే పిల్లల సంఖ్య ఏటా 22,000 నుంచి 26,000 వరకూ ఉన్నట్లు మైగ్రేషన్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ అంచనా వేస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2024లో విదేశీ చిరునామా కలిగిన తల్లులు 9,600 మంది పిల్లలకు అమెరికాలో జన్మనిచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement