రోమ్: నాటో చీఫ్ మార్క్ రుట్టే చేసిన వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్రంగా ఖండించారు. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యలో ఇటలీ కూడా భాగస్వామి అయిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని మండిపడ్డారు ఇరాన్‌పై జరిగిన యుద్ధంలో ఇటలీ ప్రత్యక్షంగా పాల్గొనలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితిని తప్పుగా ప్రతిబింబిస్తున్నాయని ఆమె హెచ్చరిస్తూ కౌంటరిచ్చారు.
ఫ్రాన్స్–ఇటలీ ద్వైపాక్షిక సదస్సు అనంతరం మీడియాతో మాట్లాడిన మెలోనీ..‘నాటో ప్రధాన కార్యదర్శ మార్క్ రుట్టే చాలా ఉత్సాహంగా వివరణ ఇచ్చే క్రమంలో వేర్వేరు అంశాలను ఒకటిగా కలిపేశారు. ఇటలీ అనుమతించిన విమానాల స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మేం ఇరాన్‌పై జరిగిన సైనిక దాడుల్లో పాల్గొనలేద’ అని స్పష్టం చేశారు. అయితే, ఈ వివాదానికి కారణమైన వ్యాఖ్యలు ఇటీవల మార్క్ రుట్టే అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వచ్చాయి.
అమెరికా ఇరాన్‌పై చేపట్టిన "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" సందర్భంగా యూరప్‌లోని అమెరికా స్థావరాల నుంచి వేలాది విమానాలు ఎగిరాయని, అందులో ఇటలీలోని అమెరికా సైనిక స్థావరాల నుంచి కూడా వందలాది విమానాలు బయలుదేరాయని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇటలీ ప్రత్యక్షంగా యుద్ధానికి సహకరించిందనే అభిప్రాయం ఏర్పడింది. అయితే ఇటలీ ప్రభుత్వం దీనిని వెంటనే ఖండించింది. తమ భూభాగంలోని అమెరికా సైనిక స్థావరాల నుంచి కేవలం సాంకేతిక, లాజిస్టిక్, నిర్వహణ సంబంధిత విమానాలకే అనుమతి ఇచ్చామని, యుద్ధ కార్యకలాపాలు, దాడులు లేదా ఆయుధ మద్దతుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇటలీ రాజ్యాంగం, అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలో మాత్రమే వ్యవహరించామని తెలిపింది.
మరోవైపు.. ఈ వివాదంపై ఇటలీ విదేశాంగ మంత్రి అంటోనియో తజానీ కూడా స్పందిస్తూ.. రుట్టే వ్యాఖ్యలను అతిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. నాటో చీఫ్ ఉద్దేశం లాజిస్టిక్ సహకారం గురించేనని, ఇటలీ యుద్ధంలో పాల్గొన్నట్లు చెప్పడం సరైంది కాదని పేర్కొన్నారు. ఇక, ఈ వివాదం ఇటలీ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం అసలు నిజాలు చెప్పిందా? లేదా అనే అంశంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, మెలోనీ ప్రభుత్వం మాత్రం ఇరాన్ యుద్ధంలో ఇటలీకి ప్రత్యక్ష పాత్ర లేదనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది.


