మాధవ్ శింగరాజు
వంతెనపై గమ్యాన్ని చేరుకోవాలంటే, వంతెన కంటే ముందు గమ్యాన్ని నిర్మించుకోవాలి. ‘టాటా’ వంతెనపై నాది 40 ఏళ్ల ప్రయాణం. వంతెనే నా కోసం గమ్యాన్ని నిర్మించినట్లుగా సాగిన జీవన యానం! టాటాలో ఇవి నా ఆఖరు నెలలు! 2027 ఫిబ్రవరి 20 నా చివరి రోజు. టాటా మహా సముద్రంలో ఒక అల కూడా ముందస్తు ప్రణాళికతో ఉంటుంది. దేశం 2026లో ఉన్నప్పుడు టాటా 2027లో ఉంటుంది. ‘‘చంద్ర తర్వాత ఎవరు?’’ అని ఏడాది ముందే ఈ ఫిబ్రవరిలో బోర్డు రూమ్‌లోకి ఒక ‘ప్రశ్న’... బంట్రోతులా వచ్చి నిలబడింది. టాటాలో బాస్ అయినా బంట్రోతు అయినా ఒకే వంతెనపై నడుస్తారు. ప్రశ్నలు రేకెత్తిస్తున్నంత కాలమే వారు ఆ వంతెనపై నడిచేందుకు అర్హులై ఉంటారు. సమాధాన పడిపోయే వాళ్లకు టాటాలో సీటు ఉంటే ఉండొచ్చు కానీ చోటు మాత్రం ఉండదు. నువ్వు ప్రశ్నిస్తున్నావంటే పనిలో ఉన్నట్లు! నువ్వు ప్రశ్నించటం మానేశావంటే, కేవలం ఉద్యోగం చేస్తున్నట్లు! ఇదీ టాటా సిద్ధాంతం.
‘‘చంద్ర తర్వాత ఎవరు’’ అన్నప్పుడు సగం మందికి పైగా వాటాదారులు ‘‘మళ్లీ చంద్రే’’ అన్నారు. బోర్డు కూడా ‘‘మళ్లీ చంద్రే’’ అంది. బోర్డు డైరెక్టర్‌లలో ఒక్క నోయెల్ టాటా మాత్రమే మౌనంగా ఉండిపోయారు. ఆర్నెల్లుగా ఇప్పటికీ ఆయన మౌనంగానే ఉన్నారు! మనం పుట్టి పెరిగిన ఇల్లే అయినా, ఇంట్లో మనతో మాట్లాడని మనిషి ఒక్కరున్నా అదిక మన ఇల్లవదు. ఇంటిని ఇంటిలా ఉంచాలంటే మనమే బయటికి వచ్చేయాలి. ఊహు... వచ్చేయటం కాదు, వెళ్లిపోవటం! రతన్‌జీ ఉండి ఉంటే, ‘‘ఎక్కడికి వెళ్తావ్ చంద్రా ఇంత రాత్రప్పుడు?!’’ అని నన్ను ఆపి ఉండేవారా... అది మిట్ట మధాహ్నమే అయినా – నా వెనకే అడుగులు వేసుకుంటూ వచ్చి!
ఎందుకు వెళుతున్నదీ ఆయన అడగరు. ‘‘వెళ్లి ఏమౌతావు?’’ అన్నదే ఎవరి గురించైనా ఎప్పుడూ ఆయన ఆందోళన. ‘‘ఇంటిని గానీ, సంస్థను గానీ, ఆఖరికి మనిషినే గానీ ఎవరైనా వదిలి వెళ్లవలసి వచ్చిందంటే... వెళ్లాక వారెలా ఉండగలుగు తారు అనే ఆలోచన రావలసింది... ఆ ఇంటికి, ఆ సంస్థకు, వదిలి వెళ్లటానికి కారణం అయిన ఆ వ్యక్తికే గానీ, వదిలి వెళ్లిపోవలసి వచ్చినవారికి కాదు’’ అనేవారు రతన్‌జీ! టాటా ప్రధాన కార్యాలయం ఉండే ‘బాంబే హౌస్’ రతన్‌జీకి పవిత్రాలయం. చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు, పునర్జన్మ... అన్నీ ఆయనకు బాంబే హౌసే!
‘‘రతన్‌జీ... 90 ఏళ్లుగా ‘బాంబే హౌస్’ ఇలాగే ఉంది. కొద్దిగా మార్పులు చేస్తే బాగుంటుంది’’ అని, ‘టాటా సన్స్’ చైర్మన్‌గా నేను బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయనతో అన్నప్పుడు– ఆయన నా వైపు సౌమ్యంగా చూశారు. ‘‘మార్పులు అంటే పడగొట్టటం, తిరిగి కట్టటమే కదా చంద్రా! మరి అక్కడ నివాసం ఏర్పరచుకుని ఉన్న కుక్కల్ని, వాటి పిల్లల్ని ఏం చేస్తారు? ఖాళీ చేయించేస్తారు. అంతేకదా! అప్పుడు అవి ఎక్కడికి వెళ్తాయి? ముందు వాటికి భద్రమైన చోటు ఏర్పాటు చేయించి, ఆ తర్వాత మీ ‘పునర్నిర్మాణం’ మొదలుపెట్టండి’’ అన్నారు రతన్ జీ!!
రతన్‌జీతో కలిసి పని చేయటం నాకొక లాంగ్ డిస్టెన్స్ మారథాన్. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన టోక్యో, బోస్టన్, లండన్, బెర్లిన్, చికాగో, న్యూయార్క్ మారథాన్లతో పాటుగా నేను పూర్తి చేసిన ఏడో మారథాన్... ‘రతన్‌జీ టాటా’! క్షణికమైన వేగం కంటే... అనుకున్న మార్గంలో చివరివరకు నిలబడటమే ముఖ్యం అనేవారు రతన్‌జీ. టాటాను వదిలి వెళ్లాలన్న నా నిర్ణయం క్షణికమైన వేగంలో తీసుకున్నది కాదు. బోర్డు తీర్మానం కోసం ఆరు నెలలు ఆగి చూసి, టాటా ప్రతిష్ఠను నిలబెట్టటానికి ఆరు నెలల ముందే, కాబోయే చైర్మన్ కోసం నా అంతట నేను పరిచిన రెడ్ కార్పెట్ అది.


