ఉపాధ్యాయుడికి ఏఐ ప్రత్యామ్నాయం కాదు! | AI In Education Teachers Not Replaceable Digital Education Sweden Experience | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడికి ఏఐ ప్రత్యామ్నాయం కాదు!

Sep 5 2026 12:56 PM | Updated on Sep 5 2026 1:09 PM

AI In Education Teachers Not Replaceable Digital Education Sweden Experience

నేడు ఉపాధ్యాయ దినోత్సవం

రతరాలుగా గురువును పూజనీయ స్థానంలో ఉంచి... తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుకు ఇచ్చిన సంస్కృతి మనది! అట్టి ఉపాధ్యాయ వృత్తి ప్రమాదంలో పడ్డ నేపథ్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. విద్య అనేది ప్రాథమికంగా ఒక మానవ ప్రయత్నం. అది సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది.

నమ్మకం మీద, అనుబంధం మీద ఆధారపడి ఉంటుంది. అది మనం ఆటోమేట్‌ చేయగల లావాదేవీల వ్యాపారం కాదు. బోధనోపకరణాలు, సమయం, నమ్మకాన్ని సరైన పద్ధతిలో, ప్రయోజనాత్మకంగా, గౌరవప్రదంగా, ఉపాధ్యాయులకు మద్దతు ఇచ్చే సరైన అకడమిక్‌ వాతావరణంలో, వారి అభివృద్ధికి సరైన అవకాశాలతో వినియోగించడంతోనే నాణ్యమైన విద్యకు పునాది ఏర్పడుతుంది.

అభివృద్ధి చెందుతున్న బోధనా వృత్తిపై జరుగుతున్న చర్చలు... విద్య అనేది ఉపాధ్యాయ–విద్యార్థి కీలక సంబంధంలోనే దృఢంగా పాతుకుపోయి ఉందని స్పష్టం చేశాయి. ఉపాధ్యాయుల నియా మకం, వారిని వృత్తి నిబద్ధులుగా రూపుదిద్దడంలో ప్రపంచవ్యాప్త సవాళ్లు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు సరిపోని జీతాలు, అహేతుకమైన అధిక పనిభారం.

ఎడ్‌ టెక్‌ ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక మార్పులు వేగంగా వస్తున్న తరుణంలో బోధనలో కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగం గురించి చర్చ జరుగుతోంది. నాణ్యమైన విద్యకు ఉపాధ్యాయులే కేంద్రబిందువు అని అందరూ అంగీకరిస్తున్నప్పటికీ, తమ తరగతి గదు లలో కృత్రిమ మేధను ఎలా, ఏ మేరకు అనుసంధానించాలనే విష యంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అవకాశాలను అంది పుచ్చుకోవడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తుండగా; ఉపాధ్యాయులు, విద్యావేత్తలు మరింత జాగ్రత్తతో నియంత్రణలు ఉండాలని వాదిస్తున్నారు.

సాంకేతిక మార్పు ఉపాధ్యాయులకు అవకాశాలను కల్పించ గలిగినప్పటికీ, ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న వృత్తిపై ఇది మరింత భారాన్ని పెంచే ప్రమాదం ఉంది. బోధనలో ఏఐ అనుసంధానం జరగడానికి ఉపాధ్యాయుల నుండి అదనపు కృషి, బోధన, అభ్యసన ప్రక్రియలలో నిరంతర సర్దుబాట్లు అవసరం. అందువల్ల, ఈ మార్పులన్నింటి మధ్య, విద్యా నిపుణుల శ్రేయస్సు– పనిభారాన్ని కూడా సరిగ్గా పరిగణనలోకి తీసుకునేలా చూడాల్సిన అవసరం ఉంది. ఒక విషయం మాత్రం పూర్తిగా స్పష్టం: కృత్రిమ మేధ ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కాదు.

పుస్తకాల స్థానంలో కంప్యూటర్లను తీసుకొచ్చి దాదాపు 15 ఏళ్ల పాటు డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించి అమలు చేసిన స్వీడన్‌ దేశం డిజిటల్‌ ఫస్ట్‌ విధానం వల్ల విద్యార్థుల్లో చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలు క్షీణిస్తున్నాయనే విషయాన్ని గుర్తించింది. ఎడ్‌ టెక్‌ అనేది విఫల ప్రయోగం అనీ, అందువల్ల విద్యార్థులకు మరిన్ని భౌతిక పాఠ్యపుస్తకాలు అవసరమనీ చెప్పిన స్వీడన్‌ అనుభవాలు గమనించాలి.

దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఉపాధ్యాయ లోకానికి దక్కిన అతిపెద్ద విజయాల్లో ఉద్యోగ భద్రత మొదటిది. కానీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ప్రవేశపెడుతున్న కొత్త విద్యా విధానాల నేపథ్యంలో కాంట్రాక్టు, పార్ట్‌ టైమ్, ఔట్‌ సోర్సింగ్‌లాంటి పద్ధతుల్లో ఉపాధ్యాయుల నియామకాలు జరిగి ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమైంది. ఇటువంటి అధ్యాపకులకు కనీస టైమ్‌ స్కేల్‌ వర్తింపజేయాలి. శాశ్వత ఉద్యోగభద్రత వలన వృత్తిపట్ల అంకితభావం తగ్గుతుందనే శుష్క వాదనలను చేయడం సముచితం కాదు.
– కె. వేణుగోపాల్‌, విద్యారంగ విశ్లేషకులు

ఇవి కూడా చదవండి: మా పిల్లలనూ కాపాడండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement