మన దేహం విలువ కోట్లకంటే ఎక్కువ.. ఈ కథతో అర్థమవుతుంది! | Human Body Life Value Spiritual Wisdom | Sakshi
Sakshi News home page

మన దేహం విలువ కోట్లకంటే ఎక్కువ.. ఈ కథతో అర్థమవుతుంది!

Sep 5 2026 7:45 AM | Updated on Sep 5 2026 7:45 AM

Human Body Life Value Spiritual Wisdom

న శరీరంలోని కాలేయం, గుండె, ఊపిరి తిత్తులు, కళ్ళు, పళ్ళు వంటివేవైనా... కొంత చెడి పోయినా బాగు చేయించుకోవటానికి లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అన్నీ బాగుండి, ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నవారు శరీర విలువను గ్రహించక, జీవిత విలువను తెలుసుకోలేక, ఎలా జీవించాలో అలా జీవించక వెళ్ళిపోతున్నారు. మహారాజ్‌ జగత్‌ సింగ్‌జీ ఒక కథ చెబుతారు:

ఒక వృద్ధుడు అడవిలో కట్టెలను కొట్టి, ఆ కట్టెలను కాల్చి, వచ్చిన బొగ్గును అమ్మి జీవించేవాడు. ఒకసారి అడవిలో దారితప్పిన రాజును రక్షించి, రాజనగరుకు క్షేమంగా చేర్చాడు. ఆ రాజు సంతోషించి అతనికి చందన వృక్షాలు గల అందమైన తోటను కానుకగా ఇచ్చాడు. ఆ వృక్షాల ప్రత్యేక విలువ ఆ వృద్ధునికి తెలీదు. ఆ చెట్లను కొట్టాడు, కట్టెలను కాల్చాడు, వచ్చిన బొగ్గులను అమ్మాడు, వచ్చిన కొంత డబ్బుతో ఏ పూటకు ఆ పూట గడిపాడు, దరిద్రునిగనే నిలచిపోయాడు.

కొద్ది రోజుల తర్వాత రాజు వచ్చి, అతని దారిద్య్రాన్ని చూసి, విషయాన్నంతా అడిగి తెలుసుకున్నాడు. ఒక చిన్న కట్టె ఏమైనా మిగిలి ఉందా? అని ప్రశ్నించాడు. ఏదో ఒక మూలన పడివున్న బారెడు కట్టెను తెచ్చాడు వృద్ధుడు. సరే, దీన్ని ఇలాగే బజారుకు తీసుకెళ్ళి, అమ్మి పైకాన్ని తీసుకురా అన్నాడు రాజు. అది మామూలు కట్టె కాదని, చందన వృక్షపు ముక్క అని తెలిసిన వ్యక్తి వందల రూపాయలను ఇచ్చి దాన్ని కొన్నాడు.

ఆ వృద్ధుడు ఆశ్చర్యంతో రాజుగారికి ఆ డబ్బును చూపించాడు. ‘ఇప్పుడు నీకు తెలిసిందా, నేను నీకు కానుకగా ఇచ్చిన తోట ఎన్ని కోట్ల విలువైనదో? నీవు అజ్ఞానంతో అమూల్యమైన సంపదను కోల్పోయావు’ అన్నాడు రాజు. (పుట 58,  ఆత్మజ్ఞానము– సర్దార్‌ బహదుర్‌ జగత్‌ సింగ్‌జీ; రాధాస్వామి సత్సంగ్‌ బియాస్‌).

భగవంతుడు లేక ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ మానవ దేహం రాజు గారు ఇచ్చిన చందన వృక్ష తోటకంటె ఎన్నో వందల రెట్లు విలువైనదే. ‘శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం’ అని శాస్త్రాలు ఘోషిస్తాయి. ఈ శరీర మూలంగానే జ్ఞానాన్ని ఆర్జించాలి. ఆ తర్వాత ‘పరోపకారార్థ మిదం శరీరం’ అని గుర్తెరిగి జీవించాలి.
– రాచమడుగు శ్రీనివాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement