నేడు ఉపాధ్యాయ దినోత్సవం
‘మీరు బడి కోసం వెదుక్కుంటూ రావడం కాదు. బడే మిమ్మల్ని వెదుక్కుంటూ వచ్చింది’ అంటూ మారుమూల కొండ ప్రాంతంలోని పేద పిల్లల కోసం బడి గంట మోగించారు శ్రేయ్, జ్యోతి దంపతులు. ‘పిల్లలే కాదు బామ్మలు కూడా చదువుకోవాలి’ అని ఎంతోమంది నిరక్షరాస్యులైన బామ్మల కోసం ‘బేబే బాపు స్కూల్’ ప్రారంభించారు రాజ్వీందర్. ఆటిజమ్ ఉన్న పిల్లలకు తమ ఇంట్లో ఒంటరితనంగా అనిపించవచ్చు. కాని ‘కలర్స్ సెంటర్ ఫర్ లెర్నింగ్’లోకి అడుగు పెట్టిన తరువాత టీచర్‌ల రూపంలో వారికి బోలెడు మంది ఫ్రెండ్స్ ఉంటారు. వారితో ఆడుతూ పాడుతూనే చదువుతో పాటు కమ్యూనికేషన్స్ స్కిల్స్ నేర్చుకుంటారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంతో మంది ఉపాధ్యాయులు వివిధ రూపాల్లో విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపుతున్నారు...
కొండల నడుమ ఒక బడి!
ఈ స్కూల్ పేరు... ఉల్టా పల్టా (తలకిందుల) స్కూల్! పర్వతాలే తరగతి గోడలు, ఆకాశమే పై కప్పు. ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతంలోని కటాపత్థర్ గ్రామంలో శ్రేయ్, జ్యోతి రావత్ దంపతులు ‘సురా’ పేరుతో ప్రత్యామ్నాయ విద్యాకేంద్రాన్ని ప్రారంభించారు. బట్టీ పట్టడం ద్వారా కాకుండా తర్కించడం ద్వారా ఈ స్కూలులో విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటారు. పిల్లలు చేసే తప్పులను కూడా వేడుకగా జరుపుకుంటారు! ‘ఆరోజుల్లో మేము బడికి వెళ్లాలంటే ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసా!’ అంటూ నాయనమ్మ అనారిదేవి కథలు కథలుగా చెప్పే విషయాలను వినేవారు శ్రేయ్. అయితే ఇప్పటికీ అలాంటి పరిస్థితే ఉండడం శ్రేయ్‌ని కదలించింది.
‘వంద సంవత్సరాలు గడిచినా పర్వత ప్రాంతాల సామాజిక–ఆర్థిక పరిస్థితులు మెరుగుపడలేదనే వాస్తవం బాధగా అనిపించింది’ అంటున్న శ్రేయ్, చదువుకోవడానికి పిల్లలు ఎలాంటి ఇబ్బంది పడకుండా జ్యోతి రావత్‌తో కలిసి స్కూల్ ప్రారంభించారు. ప్రకృతి ఆధారిత బోధన పద్ధతులు ఈ బడి ప్రత్యే‘కథ’. ‘చదువంటే భయం కాదు. ఆట ఆడేటప్పుడు ఉండేంత ఉత్సాహం ఉండేలా పాఠాలను రూపొందించాం’ అంటారు జ్యోతి. శ్రేయ్, జ్యోతి దంపతులను చూస్తే... పిల్లలకు చెప్పలేనంత సంతోషం. వారికి ఆ దంపతులు గురువులు మాత్రమే కాదు... తల్లిదండ్రులు, ఆత్మీయ నేస్తాలు!
రంగుల కళలు
ప్రతి ఉదయం ‘కలర్స్ సెంటర్ ఫర్ లెర్నింగ్’ తలుపులు గంట మోతతో కాకుండా ఆప్యాయ చిరునవ్వులతో నిండిన ‘హ్యాపీ మార్నింగ్’లతో తెరుచుకుంటాయి. తన కొడుకు మాదిరిగా ఆటిజమ్‌తో ఇబ్బంది పడుతున్న పిల్లలకు అండగా నిలవడానికి బెంగళూరుకు చెందిన బేలా జోషి ‘కలర్స్ సెంటర్ ఫర్ లెర్నింగ్’ ప్రారంభించారు. విద్యార్థులు క్లాస్‌రూమ్‌లోకి అడుగుపెట్టిన తరువాత.... టీచర్‌తో కలిసి పెయింటింగ్ వేస్తారు. ఉపాధ్యాయుల నోటి నుంచి పాటలు వింటారు.
ఆ తరువాత ఆటలకు సిద్ధమవుతారు. నీళ్ల బాటిల్ పట్టుకోవడం నుంచి ఆటలో తమ వంతు కోసం ఎదురుచూడడం వరకు రోజువారీ పనుల ద్వారా ఆటిజమ్ ఉన్న పిల్లలకు ఈ స్కూల్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తారు. ‘క్యాలెండర్ ప్రకారం మేము ఒక పాఠం నుంచి మరో పాఠానికి వెళ్లం. స్టూడెంట్‌కు పాఠం బాగా అర్థమైన తరువాత మాత్రమే వెళతాం. ఇది కాలపరిమితితో కూడిన బోధన కాదు. నైపుణ్య ఆధారిత బోధన’ అంటున్నారు బేలా జోషి.
రైలుబడి!
స్కూలుకు పిల్లలు ఏడుస్తూ రావద్దు. ఉత్సాహంతో రావాలి. అలా రావాలంటే స్కూలు వారికి ఎప్పుడూ కొత్తగా కనిపించాలి’ అనుకున్నారు తమిళనాడు కోయంబత్తూరులోని పెతనాయకనూర్ ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్ బాలమురుగన్. అనుకున్నదే తడవుగా స్కూలును కొత్తగా ముస్తాబు చేశారు. ప్రతి క్లాస్‌రూమ్ రైలు బోగిలా కనిపించేలా రంగులు వేశారు. తరగతి గదులను ఎప్పటికప్పుడూ కొత్తగా ముస్తాబు చేయడమే కాదు మొక్కలను నాటడం నుండి శ్రమదానం వరకు ఎన్నో మంచి కార్యక్రమాల్లో పిల్లలను భాగస్వామ్యం చేస్తున్నారు ఈ పాఠశాల ఉపాధ్యాయులు.
బామ్మల బడి!
పంజాబ్‌లోని బల్లో అనే గ్రామం... ‘బామ్మా... చదువు నేర్చుకుంటావా!’ అని అడిగారు రాజ్వీందర్. ‘నాకెందుకమ్మా! ఉద్యోగాలు చేయాలా ఊళ్లేలాలా!’ అని బోసినవ్వులు నవ్వింది అజుని అనే బామ్మ. ‘రోజంతా ఖాళీగా కూర్చునే బదులు సరదాగా నేర్చుకోవచ్చుగా’ అని ఆ బామ్మను ఒప్పించారు రాజ్వీందర్. ఇప్పుడు అజుని బామ్మ రోజూ దినపత్రిక చదువుతుంది! ‘ఈ నెల నేను చదవాల్సిన పుస్తకాలు’ అంటూ పుస్తకాలను కొని తెచ్చుకుంటుంది.
ఆహా... ఎంతమార్పు! ‘టీచర్‌గారు మీ వల్ల చదువు నేర్చుకున్నాను. కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను’ అన్నారు అజుని బామ్మ రాజ్వీందర్‌తో. ఆ ఉత్సాహంలో అజునిలాంటి బామ్మలకు చదువు నేర్పించడానికి ‘బేబే బాపు స్కూల్’ ప్రారంభించారు రాజ్వీందర్. ఎంతో మంది బామ్మలు చదువు ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
తొలి ఉపాధ్యాయిని
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే. 19వ శతాబ్దంలో మహిళలకు చదువు దూరంగా ఉన్న రోజుల్లో, భర్త జ్యోతిరావు ఫూలే ్ర΄ోత్సాహంతో చదువుకుని దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యారు. 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. బడికి వెళ్లేటప్పుడు కొందరు ఆమెపై బురద, పేడ చల్లినా వెనకడుగు వేయలేదు.
ఇంటింటికీ వెళ్లి....
తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్. సావిత్రీబాయికి తోడుగా నిలిచి బాలికల విద్య కోసం ΄ోరాడిన మరో విద్యావేత్త. సావిత్రీబాయి దంపతులను సమాజం బహిష్కరించినప్పుడు, ఫాతిమా షేక్ తన ఇంట్లోనే పాఠశాల నిర్వహణకు
స్థలమిచ్చారు. ఇంటింటికీ వెళ్లి బాలికలను ్ర΄ోత్సహించి బడికి రప్పించడంలో ఆమె కీలక పాత్ర ΄ోషించారు.
జ్ఞానం, సృజనాత్మక వ్యక్తీకరణకు సంబంధించి పిల్లల్లో ఉత్సాహాన్ని కలిగించడం అనేది... ఉపాధ్యాయునిలోని అత్యున్నత, అద్భుత కళ.
– ఆల్బర్ట్ ఐన్‌స్టీన్


