నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపల్ రూపారెడ్డిని సొంత పాఠశాల విద్యార్థులే 27 సార్లు కత్తితో పొడిచి చంపిన దారుణం, అదే జిల్లా దేవరకొండలో ఉపాధ్యాయరాలిపై జరిగిన దాడి కేవలం వివిక్త సంఘటనలు కావు. 2012 ఫిబ్రవరి 9న చెన్నైలోని సెయింట్ మేరీస్ ఆంగ్లో–ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 9వతరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థి క్లాస్ రూమ్‌లోనే సైన్స్ టీచర్ ఉమా మహేశ్వరిని పుస్తకంలో దాచి తెచ్చిన కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపిన ఉదంతం విద్యావ్యవస్థకే మచ్చగా మిగిలింది.
అలాగే 2017 సెప్టెంబర్ 8న గురుగ్రామ్‌లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పరీక్షలు, పేరెంట్–టీచర్ మీటింగ్ వాయిదా పడాలనే వికృత ఉద్దేశంతో 11వ తరగతి విద్యార్థి ఏడేళ్ల 2వ తరగతి బాలుడు ప్రద్యుమన్ ఠాకూర్‌ను వాష్‌రూమ్‌లో గొంతుకోసి హత మార్చడం యావత్ దేశాన్ని స్తంభింపజేసింది. దీనికితోడు కోటా, హైదరాబాద్ వంటి నగరాల్లో మార్కులు తగ్గాయని ఏటా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషాదాలు నేటి విద్యాసంక్షోభ తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.
నేటి విద్యావ్యవస్థ జ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించే కేంద్రంగా కాకుండా, కేవలం ర్యాంకులు, మార్కులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారిపోయింది. కార్పొరేట్ భవనాలు, డిజిటల్ బోర్డులు, కోట్ల రూపాయల వ్యాపార ప్రచారాలకు ఇచ్చే ప్రాధాన్యత విద్యార్థుల మానసిక ఎదుగుదల, భావోద్వేగ స్థిరత్వం, నైతిక విలువలపై ఎవరూ పెట్టడం లేదు.
జపాన్ ఉదాహరణ
జపాన్ వంటి దేశాల్లో ప్రాథమిక పాఠశాలల్లో మొదటి మూడేళ్లు ఎలాంటి మార్కుల పరీక్షలు లేకుండా కేవలం పరిశుభ్రత, సమాజం పట్ల బాధ్యత, పెద్దలను గౌరవించడం వంటి జీవన సూత్రాలను మాత్రమే నేర్పిస్తారు. కానీ మన దగ్గర ఐదేళ్ల ప్రాయం నుంచే ర్యాంకుల పోటీని నూరిపోస్తున్నాం. గెలవడం ఎలాగో నేర్పుతున్న చదువులు... ఓటమిని ఎలా తట్టుకోవాలో, కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలో, తోటి మనుషులను ఎలా ప్రేమించాలో నేర్పడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి.
ఈ విష సంస్కృతి మారాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆలోచనా ధోరణిలో సమూల మార్పు రావాలి. ఉపాధ్యాయులు కేవలం సిలబస్ పూర్తి చేసే ఉద్యోగులుగా కాకుండా విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకునే గురువులుగా నిలవాలి. గతంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పిల్లల నడవడికను తీర్చిదిద్దేవారు. నేడు చిన్న పొర పాట్లకు కూడా పాఠశాలలపై దాడులకు దిగే తల్లిదండ్రుల ధోరణి పిల్లల్లో క్రమశిక్షణా రాహిత్యాన్ని పెంచుతోంది. పిల్లల డిజిటల్ స్క్రీన్ సమయం, సైబర్ స్నేహాలు, అలవాట్లను నిరంతరం గమనించడం ప్రతి తల్లిదండ్రుల ప్రాథమిక కర్తవ్యం.
ప్రతి విద్యాసంస్థలో అర్హత కలిగిన మానసిక నిపుణులు, కౌన్సెలర్లను తప్పనిసరిగా నియమించి విద్యార్థుల్లో ఆకస్మిక ప్రవర్తనా మార్పులు, ఒంటరితనం, వ్యసనాలను ప్రారంభ దశలోనే గుర్తించాలి. వారానికి కనీసం రెండు పీరియడ్లను నైతిక విద్య, ప్రాథమిక జీవన నైపుణ్యాలు, భావో ద్వేగ సమతుల్యత నేర్పేందుకు కేటాయించాలి. వ్యాపార విద్య స్థానంలో విలువలతో కూడిన విద్యావిధానం వచ్చినప్పుడే ఇలాంటి నేర ప్రవృత్తులకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.
– డా. మేడా జగన్మోహనరావు, విద్యారంగ నిపుణులు
ఇవి కూడా చదవండి: ఏఐ యుగంలో గొప్ప ఆయుధం... విచక్షణ


