భారతదేశ సామాజిక, రాజకీయ గమనంలో యువత ఎల్లప్పుడూ అత్యంత ప్రభావవంత మైన శక్తిగా ఉంది. ఇటీ వల ‘జెన్ జీ’ ఆధ్వర్యంలో వెల్లువెత్తిన నిరసనలు, ఉద్యమాలు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక తీవ్రమైన హెచ్చరిక లాంటివి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల నుంచి, ముఖ్యంగా యువ తరం నుంచి వచ్చే అసంతృప్తిని కేవలం తాత్కా లిక భావోద్వేగంగానో లేదా రాజకీయ ప్రత్యర్థుల ప్రేరేపిత చర్యగానో కొట్టిపారేయడం సరైన పని కాదు. అయినప్పటికీ, ఈ పరిణామాలను నిష్పా క్షికంగా విశ్లేషించుకునేందుకు ఎన్డీఏకు ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు.
ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం భారత్. అయితే, యువత తమ భవిష్యత్తుపై ఆశావహ దృక్పథంతో, విశ్వాసంతో ఉన్నప్పుడు మాత్రమే ఈ జనాభా నిజమైన జాతీయ సంపదగా మారుతుంది. చదువు పూర్త యిన తర్వాత ఉద్యోగం దొరక్కపోవడం, కెరీర్ ఎదుగుదలలో స్తబ్ధత, ఆర్థిక అభద్రత వంటి సమస్యలతో యువత తీవ్ర అసంతృప్తిలో ఉంటే, ఆ జనాభా శక్తి నిరాశగా మారి సమాజంలో ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉంది. ‘ఈ నిరస నలను ఎవరు నడిపిస్తున్నారు?’ అని అన్వేషించడం కంటే, ‘యువత ఎందుకు ఇంత తీవ్ర అసంతృప్తితో ఉంది?’ అనే మూలకారణాన్ని వెత కడం అత్యంత ముఖ్యమైన విషయం.
దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఏ ప్రభుత్వానికైనా ఆచరణా త్మకంగా సాధ్యం కాదు. మిగిలిన మెజారిటీ యువత ప్రైవేటు రంగాలు, వ్యవసాయం, సేవా రంగం, వ్యాపారాలు లేదా స్వయం ఉపాధిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాల అసలైన బాధ్యత కేవలం కొన్ని ఉద్యోగ నోటిఫికే షన్లు ఇవ్వడానికే పరిమితం కాకూడదు. యువత తమ స్వశక్తితో ఉపాధిని సృష్టించుకునే ‘జాబ్ క్రియేటర్స్’గా ఎదిగే వ్యవస్థను సిద్ధం చేయాలి.
ఇదీ చదవండి: యూపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా కలకలం
ఆచరణాత్మక చర్యలు
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు మార్కెట్ అవసరాలు, ఆధునిక ఉపాధి రంగా లపై స్పష్టమైన మార్గదర్శకత్వం అందించాలి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆధునిక సాంకేతిక శిక్షణ ఇవ్వాలి. కొత్తగా వ్యాపారాలు, స్టార్టప్‌లు ప్రారంభించే యువతకు ఎలాంటి పూచీకత్తు లేకుండా సులభంగా రుణాలు, సబ్సిడీలు అందేలా చూడాలి. భారత దేశ భవిష్యత్ పురోగతి మన విద్యా వ్యవస్థ నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యా యుల నియామకాలు, నాణ్యమైన శిక్షణ, పరిశో ధనలు, విద్యార్థులలో ఆచరణాత్మక అభ్యసన ఫలితాలు పెంపొందించడంపై పూర్తి దృష్టి పెట్టాలి. కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) మంచి దిశానిర్దేశం చేసింది. చదువు పూర్తయ్యే సమయానికి విద్యార్థి ఉద్యోగా ర్థిగా కాకుండా, సమాజానికి విలువను చేకూర్చే సమర్థుడిగా మారేలా విద్యా వ్యవస్థ ఉండాలి.
ఇదీ చదవండి: Nepal Flash Floods 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు!
నిరసనలు ఎదురైనప్పుడు పాలకులస్పందన సహనంతో, సమతుల్యతతో ఉండాలి. యువత కోపంతో ఉన్నప్పుడు వారి అసంతృప్తికి గల కారణాలను వినడం, ఆ శక్తిని సానుకూల దిశగా మళ్లించడం పరిపక్వ నాయకత్వ లక్షణం. ఏ ప్రజా ఉద్యమంలోనైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. విధ్వంసాలకు పాల్పడేవారిని, చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులను పోలీసులు, దర్యాప్తు సంస్థలు పక్కా ఆధారాలతో గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఆ నెపంతో శాంతియుతంగా తమ ఆందోళ నలను, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెస్తున్న యువతపై విచక్షణారహితంగా చర్యలు తీసు కోవడం ప్రమాదకరం. న్యాయమైన అసమ్మతికి, నేరపూరిత కార్యకలాపాలకు మధ్య ఉన్న సన్నని గీతను పాలకులు, యంత్రాంగం గుర్తించాలి.
2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణ అభి వృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) తీర్చి దిద్దాలనే లక్ష్యానికి నేటి యువతే మూలస్తంభం. యువత విద్యావంతులైనప్పటికీ ఉద్యో గాలు లేక నిరాశతో ఉంటే, నైపుణ్యాలు ఉన్నా అవకాశాలు దక్కకపోతే ఈ మహత్తర లక్ష్యం కలగానే మిగిలి పోతుంది. అదే యువత నైపుణ్యాలు, ఆత్మ విశ్వాసం, పారిశ్రామిక దృక్పథంతో ముందుకు సాగితే దేశం అపూర్వమైన ప్రగతిని సాధిస్తుంది. ప్రభుత్వం యువతతో నిరంతర సంభాషణ ప్రారంభించి, వారి సమస్యలను వింటూ, విద్య, ఉపాధి వ్యవస్థలను సంస్కరించాలి. జెన్ జీ ఉద్య మాన్ని కేవలం రాజకీయ ముప్పుగా కాకుండా, వ్యవస్థను సరిదిద్దుకునే ఒక మేలుకొలుపుగా, సువర్ణావకాశంగా స్వీకరించి నప్పుడే బలమైన, సంపన్నమైన నవభారత నిర్మాణం సాధ్యమవుతుంది.
-పి. వేణుగోపాల్ రెడ్డి
ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్


