మాధవ్ శింగరాజు
యుద్ధం మన జీవిత భాగస్వామి అయినప్పుడు ప్రతి ఉదయం ఒకే మంచం మీద బతుకు తెల్లారుతూ ఉంటుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో అధ్యక్ష కార్యాలయం నుంచి కాక, భూగర్భ బంకర్ల నుంచి నేను నా దేశాన్ని నాలుగున్నర ఏళ్లుగా ఏ రాత్రికి ఆ రాత్రి, ఏ పగలుకు ఆ పగలు కాపు కాసుకుంటూ వస్తున్నాను. ఇక ఇప్పుడైతే ఏ నిమిషానికి ఆ నిమిషం! ఒకప్పటి తమ అభిమాన హాస్య నటుడు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా నేటి నిజ జీవిత విషాద సన్నివేశాలకు ఎందుకు ఇంతగా కొనసాగింపును ఇవ్వవలసి వస్తున్నదో అర్థం చేసుకోగలిగినవారు అయినందువల్లనే ఉక్రెయిన్ ప్రజలు ఈ యుద్ధకాలంలో నాకు గొప్ప బలగంగా ఉన్నారు.
రాత్రి 2:14 అయింది. టీవీ కాంతిలో మెరుస్తున్న ఈ చీకటి గదిలో కొన్నిసార్లు ఒలెనా, అలెక్సాండ్రా, కిరిలో... కళ్లలో మెదులుతుంటారు. నేను వారి జీవితంలో ఒక నిశ్శబ్ద ఛాయలా మాత్రమే మిగిలిపోతున్నానా... వారి నవ్వులు వినక, వారిని హృదయానికి హత్తుకోక!! యుద్ధం మొదలయ్యే సమయానికి నా కూతురు అలెక్సాండ్రా టీనేజ్‌లో ఉంది. తను ఇప్పుడు ఉన్నత చదువులకు వచ్చింది. కిరిలో అప్పుడు 9 ఏళ్లవాడు. ఆ వయసుకే వాడొక ఉక్రెయిన్ సైనికుడిలా కనిపించేవాడు నాకు!
ఒలెనా... నా సహచరి. నేను బంకర్‌ల నుంచి శత్రువుతో పోరాడుతుంటే, తను బయటి నుంచి ఉక్రెయిన్ ప్రజల కోసం ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతోంది. ఉక్రెయిన్ మహిళలు, చిన్నారుల కోసం ‘‘హౌ ఆర్ యు?’’ అనే ప్రాజెక్టు నడుపుతోంది. అదే మాటను కాస్త తగ్గించిన స్వరంతో, ప్రేమగా ఎప్పుడైనా నన్ను అడుగుతుంది: ‘‘యాక్ స్ప్రావి వోలోద్యా?’’ అని. కొన్నిసార్లయితే ‘‘యాక్ స్ప్రావి మిస్టర్ ప్రెసిడెంట్?’’ అంటుంది నవ్వుతూ.
ఆమె గొంతు విని, డీజిల్ వాసన కొట్టే బంకర్ ఒక్కసారిగా గుబాళిస్తుంది. ఒలెనా, నేను ఒకే స్కూల్లో, ఒకే కాలేజ్‌లో చదువుకున్నాం. క్రివీ రిహ్ నేషనల్ యూనివర్సిటీ ప్రాంగణంలోని చెర్రీ బ్లోసమ్, మాగ్నోలియా పూల చెట్ల కింద మా చేతులు కలిసి నడిచాయి. రాత్రి 2.43కి బంకర్‌లోకి కాల్! ‘‘మన సైన్యం శత్రువును గట్టిగా తిప్పి కొట్టింది మిస్టర్ ప్రెసిడెంట్. మన భూభాగాన్ని తిరిగి సాధించాం...’’ అని గర్వంగా చెబుతున్నారు కమాండర్లు. తిరిగి స్వాధీనం చేసుకునే ప్రతి చదరపు కిలోమీటరు వెనుక సైనికుల ప్రాణత్యాగం ఉంటుంది. సైరన్లు ఆగిన ప్రతిసారీ ఆ కాసేపటి శూన్యంలో, అమరవీరుల జ్ఞాపకాలతో నా గుండె బరువెక్కుతుంది.
ఉక్రేనియన్లు, రష్యన్లు ఒకరే అంటాడు పుతిన్ . నవ్వొస్తుంది నాకు. ఆ వెంటనే రష్యన్ రొమాంటిక్ కామెడీ ‘8 ఫస్ట్ డేట్స్’ గుర్తొస్తుంది. అందులో హీరోగా నటించింది నేనే. అకిన్షినా అనే అమ్మాయి హీరోయిన్ . సినిమాలో ఆమె పేరు వీరా. నా పేరు నికిత. వీరాకు, నికితకు వేరే వేరే వాళ్లతో పెళ్లయి ఉంటుంది. కానీ ఉదయాన్నే లేచి చూస్తే ఇద్దరూ ఒకే మంచం మీద ఉంటుంటారు! అలా ప్రతిరోజూ ఒకే మంచంపై మెలకువ రావడం అనేది యాదృచ్ఛికం కాదనీ, తమ ఇద్దరినీ కలపటానికి ఏదో అదృశ్య శక్తి ప్రయత్నిస్తోందనీ అనుకుంటారు. పైకి పర్ఫెక్ట్‌గా కనిపించే దంపతుల కంటే– మనో భావాలను, లోపాలను అర్థం చేసుకునేవారే నిజమైన జీవిత భాగస్వాములు అని తీర్మానించుకుంటారు. పాత పెళ్లిళ్లు రద్దు చేసుకొని ఇద్దరూ ఒకటవుతారు!
బహుశా పుతిన్ కూడా రోజూ ఉదయం నిద్రలేవగానే తన మంచం మీద ఉక్రెయిన్ ఉండాలని కోరుకుంటూ ఉండి ఉండొచ్చు. కానీ అది ఎప్పటికీ జరగదు. ‘8 ఫస్ట్ డేట్స్’లో ప్రేక్షకులకు నచ్చేలా స్క్రిప్ట్‌ను దిద్దిన నేను... రష్యా ఇప్పుడు రాస్తున్న బాధ్యతారహితమైన స్క్రిప్టుకు, ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటున్న ముగింపును ఇవ్వలేనా?!


