శ్రావణ పూర్ణిమకు అంతటి విశిష్టత ఎందుకు? | Raksha Bandhan Festival, Why Shravana Purnima Is Considered Highly Auspicious For Worship And Spiritual Practices | Sakshi
Sakshi News home page

శ్రావణ పూర్ణిమకు అంతటి విశిష్టత ఎందుకు?

Aug 28 2026 7:39 AM | Updated on Aug 28 2026 10:43 AM

Devotional Story On Sravana Purnima Raksha Bandhan Festival

దైవారాధనకు అన్ని రోజులూ అనువైనవే. కానీ కొన్ని రోజులు మరీ అనువైనవని భావించటం ఆస్తికులకు ఒక ముచ్చట. అందుకే ఇన్ని పండగలు! ఆధ్యాత్మిక జ్ఞానం భౌతిక ప్రమాణాలకూ, ఇంద్రియాలకూ అందదు. దాన్ని మనిషి తన మనసు ద్వారా భావించి, చింతన చేసి, గ్రహించ వలసిందే.

ఆ మనసును నియంత్రించే అధిష్ఠాన దేవత చంద్రుడు. అందుకే నిండు పున్నమి దినాలన్నీ మనసును ఉత్తేజితం చేస్తాయి. కాబట్టి, పున్నమి దినాలన్నీ ఆధ్యాత్మిక చింతనకూ, సాధనలకూ, కార్యకలాపాలకూ అనుకూలమైన పర్వదినాలుగా పరిగణిస్తారు. అందునా శ్రావణ, కార్తీక పూర్ణిమలు మరీ విశిష్టాలు. శివారాధనకు శ్రావణ పూర్ణిమ ఎంతో ప్రశస్తం.

శ్రావణ పూర్ణిమ అనగానే మూడు విశేషాలు మనసుకు వస్తాయి. ఇది ‘రాఖీ’ పూర్ణిమ. రక్షాబంధనాల పూర్ణిమ. సోదరులూ, తత్సమానులైన వారి క్షేమాన్నీ, సర్వతోసమృద్ధినీ ఆకాంక్షిస్తూ, సోదరీమణులూ (తత్సమానురాళ్ళూ) అనురాగంతో, ఆత్మీయతతో వారి చేతికి రక్షాబంధనాలు కట్టే వేడుక అనేక శతాబ్దాలుగా వస్తున్నది.

ఈ పూర్ణిమ హయగ్రీవ అవతార తిథి. బ్రహ్మ చేసిన సత్రయాగంలో విష్ణుమూర్తి వేదమయుడైన హయగ్రీవు డిగా అవతరించి, తనఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వేదవాణిని ప్రకటించాడని భాగవతం చెప్తుంది. జ్ఞాన సర్వస్వ మైన వేదాలను వినిపించిన జ్ఞానానందమయుడూ, నిర్మల స్ఫటికాకారుడూ, సకల విద్యలకూ ఆధారమూ అయిన హయగ్రీవుడి అవతార తిథి కాబట్టి శ్రావణ పూర్ణిమ, వేదాధ్యయన ఆరంభానికీ (‘ఉపాకర్మ’), వేద శ్రవణానికీ సముచితమైన ముహూర్తం. అందుకే, వేద విద్యార్థులూ, అధ్యాపకులూ, ఇతరులూ కూడా, శిథిలమై జీర్ణమైన దశలో ఉన్న యజ్ఞోపవీతాలను మార్చుకొనే ‘జంధ్యాల పూర్ణిమ’ కూడా ఇదే. ఇప్పటివరకూ వర్షాల వల్ల కుంటు పడిన ‘వానాకాలపు’ చదువులకు చురుకు పెంచి, ఈ పూర్ణిమ నుండి ఇక చదువులో శ్రద్ధనూ, వేగాన్నీ పెంచుకొంటే, అది వేద విద్యార్థులకూ, లౌకిక విద్యల విద్యార్థులకూ అందరికీ ప్రయోజనకరమే.
– ఎం. మారుతి శాస్త్రి

ఇవి కూడా చదవండి: రక్షాబంధన్‌కి అంత మహత్తు ఉందా? ఆ పండుగ కోసమే ఆ దేవత..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement