యువర్స్
ఫ్రేజర్ లోగాన్
ఎదుటివారికి ఏదైనా సాయం అందించాలంటే అందుకు బోలెడంత డబ్బు ఉండాలని కొందరు. సమయం ఉండాలని మరికొందరు చెబుతుంటారు. కానీ, మనసులో కొంత దయాగుణం, మరికొంత సృజన ఉంటే చాలు అని నిరూపిస్తున్నారు కొందరు వ్యక్తులు. ఇటీవల వీరు చూపుతున్న దయార్ధహృదయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలూ అందుతున్నాయి.
ఇంగ్లండ్ వాసి అయిన ఫ్రేజర్ లోగాన్ ఓ యువ రచయిత. మనసును తడిచేసే కవితలను సృష్టిస్తాడని పేరు. అలాగని ఓ చోట కూర్చొని నీలి ఆకాశంలోకి చూస్తూ కాగితంపైన పదాలను ఒలికించడం లేదు. ఓ టైప్‌మిషన్‌ను మెడలో వేసుకొని, లీమింగ్టన్ స్పా వీధుల్లో తిరుగుతుంటాడు. జెఫ్సన్ పార్క్‌లోని ఒక బెంచీని ఎంచుకొని కూచుంటాడు.
అయితే, ఖాళీగా కాదు. ఎవరైనా అనామకులు బాధపడుతున్నట్టు కనిపిస్తే చాలు. వారి దగ్గరకు వెళ్లి, కాసేపు మాట్లాడి బాధకు కారణం ఏంటో కనుక్కుంటాడు. వారు ఏదైనా ఒక్క భావోద్వేగ పదం చెప్పినా, దానిని పట్టుకొని అందమైన అక్షరాలతో అల్లిక మొదలుపెడతాడు. పేజీ నిండా కవిత్వం రాసి, వారిచేత చదివించి, ఆ సదరు వ్యక్తిలోని బాధను పోగొడతాడు. పనేమీ లేదు కాబోలు అనుకుంటారేమో కానీ, ఫ్రేజర్ పీహెచ్‌డి చేసి, లెక్చరర్‌గా ఉద్యోగమూ సంపాదించాడు. కానీ, ఇప్పుడా ఉద్యోగం నచ్చక వదిలేశానంటాడు. ఫ్రేజర్‌కి వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రతిరోజూ తమ కోసం రాయమని చెప్పేవారు పెరుగుతూనే ఉన్నారు.
కొన్ని క్షణాలు...
పారిశుధ్య కార్మికులు రాత్రంతా వీధి లైట్ల వెలుగుల్లో రోడ్లను శుభ్రం చేయడానికి కష్టపడుతుంటారు. కానీ, మన బిజీలో వారి గురించి ఒక్క క్షణం కూడా పట్టించుకోం. ఇటీవల బెంగళూరు వాసి అయిన ఓ సాఫ్ట్‌వేర్ మహిళ రోడ్డుపై పనిచేసే కార్మికులను చూసి, చలించిపోయింది. వారికి టీ, స్నాక్స్ అందించి, కాసేపు వారితో ముచ్చటించింది.
ఇటీవల అస్సాంలోని శివసాగర్ ప్రాంతంలో భారీ వరదల వల్ల ఒక మహిళ ఇల్లు, సామాన్లు అన్నీ మునిగిపోయాయి. అంతటి కష్టంలోనూ, తమను రక్షించడానికి వచ్చిన విపత్తు సహాయక సిబ్బంది అలసటను గమనించి, ఆమె వారికి జ్యూస్ ఇచ్చి, తన కృతజ్ఞతను చాటుకుంది.
ఒక సాధారణ డెలివరీ రైడర్ ఎండలో కష్టపడి ఆర్డర్ తెచ్చినందుకు గీతిక అనే మహిళ అతనికి 500 నోటును టిప్‌గా ఇచ్చింది. ఆ డెలివరీ బాయ్ తన రోజువారీ సంపాదన కంటే ఆ టిప్ ఎక్కువని సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
కాశ్మీర్‌లోని ఒక వృద్ధురాలు విధి నిర్వహణలో ఉన్న సీఆర్‌పీఎఫ్ జవాన్ వద్దకు వెళ్లి, ప్రేమతో పండ్లు అందించింది. అవి తను పెంచిన పెరటి తోటలో పండాయని వాటిని తెచ్చి, ఆ జవాన్ కు ఎంతో ప్రేమతో తినిపించింది. సరిహద్దుల్లో కాపలా కాసే జవాన్లను తన బిడ్డలా చూసుకున్న ఆమె మాతృత్వపు హృదయానికి అందరూ జేజేలు పలికారు.
ఫలితాలను ఆశించకుండా ఎదుటివారి కష్టాన్ని కొంతైనా తగ్గిద్దామని చేస్తున్న ఇలాంటి సేవామూర్తులు ఎక్కడా ఉన్నా అభినందనలు అందుకుంటూనే ఉంటారు.
– నిర్మలా రెడ్డి
ఇవి కూడా చదవండి: కార్లే లేవు.. నడక, సైక్లింగ్‌తోనే జీవనం! ఈ ప్రాంతం గురించి విన్నారా?


