యువర్స్
ఇంట్లో ఈజీ చైర్‌లో కూర్చున్న వ్యక్తి ఓ పుస్తకాన్ని చదువుతున్నాడు. అతనికి కాఫీ ఇచ్చారు. అతను కాఫీ తాగుతూ, కళ్ల జోడు సరి చేసుకుంటూ, పేజీలు తిరగేస్తూ పుస్తకాన్ని చదువుతున్నాడు. ఇది ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణంగా జరిగేదే కదా అని మీరంటే ఒక్క నిమిషం ఆగండి..ఇదే పనిని ఓ రోబో చేయాలంటే? ఈజీ చైర్‌లో కూర్చున్నప్పుడు అది ఒక వుడెన్ చైర్ అని రోబో గుర్తించాలి.
కూర్చున్న తర్వాత కుర్చీ ఊగుతుండగా తనని తాను బ్యాలెన్స్ చేసుకోవాలి. పుస్తకాన్ని పట్టుకునేటప్పుడు చేతిని సరైన కోణంలో ఉంచాలి. పేజీలు తిరగేసేటప్పుడు వేళ్లతో సున్నితంగా ముట్టుకోవాలి. కాఫీ ఇస్తే ఊగుతున్న కుర్చీని బ్యాలెన్స్ చేస్తూ మరో చేతితో కప్పుని తీసుకోవాలి. మరీ ముఖ్యంగా అందులోని కాఫీ ఒలికిపోకుండా.. వీటన్నింటికీ ప్రత్యేకమైన కమాండ్స్ ఇచ్చి ఓ రోబో చేత చేయించాలంటే ఎంత సాంకేతికతతో కూడిన డేటా అవసరమో ఒక్కసారి ఆలోచించండి..ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది హ్యుమన్ ఆర్కైవ్... మనుషుల ప్రపంచాన్ని డేటాగా మార్చి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న స్టార్టప్ కంపెనీయే ఈ హ్యుమన్ ఆర్కైవ్.
భారతీయ మూలాలు ఉన్న ఓ నలుగురు స్నేహితులు కలిసి ఓ స్టార్టప్‌ను మొదలుపెట్టారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ మధ్యే ప్రారంభమైన ఈ స్టార్టప్ కంపెనీ అనతి కాలంలోనే బాగా విస్తరించింది. ముఖ్యంగా ఈ కంపెనీ కార్యకలా΄ాలు భారత్‌లోనే ఎక్కువ కొనసాగుతున్నాయి. రాజ్ పటేల్, రుషీ అగర్వాల్, సమయ్ మైనీ, షోక్లా పటేల్ దీని వ్యవస్థాపకులు.æరుషీ అగర్వాల్ రెండేళ్ల కిందటే జైపూర్ నుంచి యూఎస్‌కి వెళ్లాడు. ఈ నలుగురు అమెరికాలో కంపెనీ స్థాపించినప్పటికీ డేటా కలెక్షన్‌కి భారత్‌నే ఎంచుకున్నారు.
లక్ష్యం
మనుషులు చేసే పనులను రోబోలతో చేయించాలంటే మనుషుల శారీరక కదలికలు, పని చేస్తున్నప్పుడు చూపే ఏకాగ్రత,, పని చేసే విధానం, హఠాత్ పరిణామాలకు స్పందించే తీరు, ఏయే పనిని ఎంత వేగంతో చేయాలి వంటి అనేకమైన భౌతిక విషయాలను వడపోసి ఆ తీరు తెన్నులను రోబోలకు అలవాటు చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. అంటే మన రియల్ వరల్డ్‌లో మనం చేసే పనులను వర్చువల్ వరల్డ్ లో రోబోలతో చేయించడమే ఈ కంపెనీ లక్ష్యం.
ఎంత డేటా?
మే 2026 నాటికి వెయ్యికి పైగా హెడ్‌క్యాప్‌లను ఉపయోగించి డేటాను సేకరించడం జరిగింది. రోజుకు ఎనిమిది గంటలు అంటే మొత్తం ఎనిమిది వేలగంటల డేటాను తీసుకున్నారు. అంటే వెయ్యి మంది వివిధ రంగాలలో పని చేసే ఉద్యోగుల పనిని రికార్డ్ చేశారన్నమాట. ఇది మాత్రమే కాదు వెయ్యిమంది నుంచి యాభై వేలమందికి హెడ్ క్యాప్‌ల అమర్చి డేటా సేకరణ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఫండింగ్
హ్యుమన్ ఆర్కైవ్ కంపెనీలో వివిధ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. వింగ్ వెంచర్ క్యాపిటల్, ఎన్‌వీపీ క్యాపిటల్, వై కాంబినేటర్ వంటి కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. దాదాపు ఇప్పటివరకు హ్యుమన్ ఆర్కైవ్ స్టార్టప్‌కి 8.2 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
నిజానికి ఇది ఒకసారి పూర్తయ్యే ప్రాజెక్ట్ కాదు. ఎప్పటికప్పుడు డేటా సేకరించి రోబోటిక్ మోడల్స్‌ను ట్రైన్ చేయాల్సి ఉంటుంది. అమెరికా, చైనా, ఆసియాలో కొన్ని దేశాలలో డేటా సేకరణ జరుగుతోంది. స్కేల్ ఏఐ, షిప్ట్, ఎక్స్‌డాఫ్, ఫిగర్ ఏఐ, యాప్‌ట్రానిక్స్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ తరహా ప్రాజెక్టులపై దృష్టి పెట్టాయి. ఒక షిఫ్ట్ కంపెనీ మాత్రమే దాదాపు 15 దేశాల నుంచి డేటాను సేకరిస్తోంది. ఈ కంపెనీలు వీడియో డేటా మీద దృష్టి పెడితే హ్యుమన్ ఆర్కైవ్ మాత్రం ఆర్‌జీబీ, డెప్త్, బాడీ మోషన్ తదితర విషయాలపై డేటాను సేకరిస్తోంది. అన్ని పరిశోధనలు పూర్తయిన తర్వాత డేటాను కోడింగ్ రూపంలో రోబోలకు ట్రైనింగ్ ఇచ్చి పరీక్ష చేస్తారు. నేటిబాలలే రేపటి పౌరులు అన్నచందగా నేటి ట్రైనింగ్ రోబోలే రేపటి వెయిటర్లు, కుక్‌లు, కాంపౌండర్లు, సర్వెంట్లుగా మారనున్నాయి. .
ఎలా పని చేస్తుంది?
ప్రతి పనినీ దగ్గరగా పరిశీలించి రోబోలకు డేటా రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం హోటళ్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలలో పని చేసే ఉద్యోగులకు ప్రత్యేకమైన హెడ్ క్యాప్ ఇస్తారు. వీటిని ఈగో సెంట్రిక్ కెమెరా రిగ్స్ అని అంటారు. ఈ హెడ్ క్యాప్‌లో అమర్చిన ప్రత్యేకమైన కెమెరాలు ఉద్యోగి చేసే పనులు, కదలికలను రికార్డ్ చేస్తాయి. ఇలా ఫస్ట్ పర్సన్ వీడియో డేటాను సేకరిస్తారు.
ఉదాహరణకు ఇంట్లో ఒక వ్యక్తి ఫ్లోర్ మాప్ చేస్తున్నాడనుకోండి. అతను నేలపై ఉన్న వస్తువును చూసి పక్కకు జరుపుతాడు. మాప్‌ను ఒక ప్రత్యేక కోణంలో తిప్పుతాడు. ఏదైనా అడ్డు తగిలితే తన కదలికను మార్చుకుంటాడు. మనకేమో ఇదంతా మామూలే కదా అనిపిస్తుంది, క్షణాల్లో జరిగిపోతుంది. కాని రోబోకు అదంతా పెద్ద టాస్క్. అందుకే వాటిని ట్రైన్ చేయడం కోసమే ఈ సమాచార సేకరణ.
– శ్రావణ్ జయ
ఇవి కూడా చదవండి: స్మార్ట్‌వాచ్‌కు మించిన ట్రాకర్.. ‘టెంపుల్’లో ఏముంది?


