నీకు నేను రక్షా.. నాకు నువ్వు రక్షా.. అంటూ అక్కాతమ్ముళ్ల అనురాగానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ రక్షాబంధన్. ఈ పండుగనే కాస్త ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు జార్ఖండ్ ప్రజలు. వారు తమకు జీవనాధారాన్నిస్తున్న వృక్షాలనే తోబుట్టువులుగా భావిస్తూ.. వాటికి ప్రేమతో రాఖీలు కడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా వస్తోన్న ఈ సంప్రదాయంలో అక్కడి ప్రజలు వృక్షాలకు రాఖీలు కడుతూ లక్షల వృక్షాలను నరికివేత నుంచి కాపాడుకున్నారంటే .. వారికి ప్రకృతిపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.
వృక్షాలకు రాఖీ కట్టి రక్షించుకునే ఈ గొప్ప కార్యక్రమం నిన్నామొన్నా మొదలైంది కాదు. దీని వెనుక 20 ఏళ్ల చరిత్ర ఉంది. 2004లో ధన్ బాద్ జిల్లాలోని లుకయా అనే చిన్న గ్రామంలో అటవీ అధికారి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలా ఆ ఊరి ప్రజలు చెట్లకు రాఖీలు కడుతూ.. వాటిని సంరక్షిస్తూ నరికివేత నుంచి కాపాడుకుంటున్నారు.
నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో జార్ఖండ్‌లోని 24 జిల్లాలలో విస్తరించి ఉన్న 700కి పైగా గ్రామాల ప్రజలు భాగస్వాములవుతున్నారు. ఈ ఉద్యమం ప్రారంభమైన మొదటి దశలోనే సుమారు ఒక లక్ష చెట్లకు రాఖీలు కట్టి రక్షించుకున్నారు. ఈ నెల రోజుల ప్రచారంలో మొత్తం 3 లక్షల వృక్షాలకు రాఖీ బంధనం వేసి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం వృక్షాల పరిరక్షణ వల్ల రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఏకంగా 1128 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ప్రకృతికి, మనిషికి మధ్య విడదీయరాని బంధానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోన్న ఈ ‘సేవ్ ట్రీ’ ఉద్యమం నేడు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోంది.


