రాంచీ: జార్ఖండ్‌లో నియామక పరీక్షల్లో అవకతవకలపై నిరసన తెలిపిన వందలాది మంది విద్యార్థులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అధికార విధులకు ఆటంకం కలిగించడం, పోలీసులతో ఘర్షణ పడటం వంటి ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఈ విషయమై 39 మంది పేరు తెలిసిన వ్యక్తులు, మరో 900 మందికి పైగా గుర్తుతెలియని వ్యక్తులపై గిరిధ్, హజారీబాగ్ జిల్లాల్లో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. నియామక పరీక్షల్లో అవకతవకలు జరిపాయని ఆరోపిస్తూ శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు నిరసన చేపట్టారు.
అందులో భాగంగా గాంధీ మైదాన్‌లో విద్యార్థులు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దిష్టి»ొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో పాల్గొన్న 14 మంది పేరు తెలిసిన వ్యక్తులు, మరో 200 మంది గుర్తు తెలియని వ్యక్తులపై రాంచీలోని కోత్వాలీ పోలీస్‌స్టేషన్‌లోనూ ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, వారిని గుర్తించేందుకు సీసీటీవీ, వీడియో ఫుటేజీలను విశ్లేషిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. నిరసనల సందర్భంగా నలుగురు ఎస్‌ఐలు సహా 8 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు.


