వైజాగ్‌ క్రైమ్‌ ఫైల్స్‌! | Visakhapatnam Law and Order Under Strain Amid Political Interference, Drug Menace | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ క్రైమ్‌ ఫైల్స్‌!

Aug 22 2026 12:50 PM | Updated on Aug 22 2026 1:43 PM

Visakhapatnam Law and Order Under Strain Amid Political Interference, Drug Menace

సిటీ ఆఫ్‌ డెస్టినీలో రోజురోజుకూ క్షీణిస్తున్న శాంతిభద్రతలు ఫిర్యాదులొస్తున్నా ప్రేక్షకపాత్రలోనే ఖాకీలు పసి మనసుల్లోనూ కక్షలు.. నడిరోడ్డుపై విద్యార్థుల గ్యాంగ్‌వార్‌ పోలీస్‌ విధుల్లో మితిమీరిన ‘రాజకీయ’ జోక్యం కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా గంజాయి, మత్తు పదార్థాల వినియోగం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలో శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఒకవైపు అధికార పార్టీ నేతల మితిమీరిన జోక్యం, మరోవైపు పోలీసుల నిర్లిప్తత విశాఖలో అశాంతికి కారణమవుతున్నాయి. ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందించే పరిస్థితులు నగరంలో కనిపించకపోవడం విస్మయపరుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి, మత్తు పదార్థాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోవడం శాంతిభద్రతల వైఫల్యానికి ప్రధాన కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఖాకీలపై ఖద్దరు పెత్తనం! 
పోలీసులపై అధికార పార్టీ నేతల పెత్తనం శ్రుతిమించుతోంది. శాంతిభద్రతల పరిరక్షణ కంటే నేతల ఆదేశాలు పాటించడానికే ప్రాధాన్యమివ్వాల్సిన దుస్థితి నెలకొంది. నిందితులను అదుపులోకి తీసుకుంటే వెంటనే నేతల నుంచి ఒత్తిళ్లు రావడం, నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులపై బదిలీ వేటు వేస్తామని బెదిరించడం నిత్యకృత్యమైంది. తమకు నచ్చిన సీఐలను వేయలేదని ఏకంగా సిటీ పోలీస్‌ బాస్‌పైనే నేతలు ఫిర్యాదులు చేసే స్థాయికి పరిస్థితులు దిగజారాయి.

బీచ్‌రోడ్డులో మాస్‌్కలతో దౌర్జన్యం! 
విశాఖ బీచ్‌ రోడ్డులో జరిగిన ఘటన నగరంలో రౌడీయిజానికి అద్దం పడుతోంది. నంబర్‌ ప్లేట్లు లేని వాహనాల్లో, ముఖాలకు మాస్క్‌లు ధరించి వచ్చిన కొందరు దుండగులు ఏకంగా ఓ ప్రైవేట్‌ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు. అక్కడున్న షెడ్డును, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ దాడి వెనుక అధికార పారీ్టకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరుల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు ఇప్పటివరకు వారిని పట్టుకోలేకపోయారు.

బాజీ జంక్షన్‌లో విద్యార్థుల వీరంగం 
2024 ఆగస్టు 6వ తేదీన బాజీ జంక్షన్‌ వద్ద ఓ కళాశాల విద్యార్థులు ఏకంగా నడిరోడ్డుపై తీవ్ర ఘర్షణకు దిగారు. వీధి రౌడీల్లా కొట్టుకోవడంతో గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీస పోలీస్‌ పర్యవేక్షణ, చట్టం పట్ల భయం లేకపోవడం వల్లే విద్యార్థులు సైతం ఇలా రోడ్డెక్కి దాడులకు తెగబడుతున్నారు.

రుషికొండ వద్ద అర్ధరాత్రి బీభత్సం 
రామానాయుడు స్టూడియో సమీపంలోని ఓ ప్రైవేట్‌ స్థలంలో సుమారు 20 మంది దుండగులు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. నంబర్‌ ప్లేట్లు కనిపించకుండా తెల్లకాగితాలు అంటించిన వాహనా ల్లో వచ్చి ఈ దమనకాండకు తెగబడ్డారు. భూ ఆక్ర మణే లక్ష్యంగా ముందుగా విద్యుత్‌ వైర్లు కత్తిరించి, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అక్కడున్న వాచ్‌మెన్‌లను కారులో బంధించి తిప్పుతూ, గెస్ట్‌ హౌస్, కాంపౌండ్‌ వాల్‌ను నేలమట్టం చేశారు. రాత్రే ఆ శిథిలాలను లారీల్లో తరలించారు.

శాంతి ఆశ్రమం భూముల్లో రౌడీషీటర్ల హల్‌చల్‌ 
శాంతి ఆశ్రమం భూముల వివాదంపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఆగడాలు ఆగలేదు. ఆ భూములను శాంతి ఆశ్రమానికే అప్పగించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చినప్పటికీ, రౌడీïÙటర్లు పట్టపగలే రంగంలోకి దిగి నానా హంగామా సృష్టించారు. ఈ ఘటనపై కేసులు నమోదైనా ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేయలేదు. చివరికి నిందితులకు బెయిల్‌ రాకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వారిని అదుపులోకి తీసుకున్నారు.

పెందుర్తి భూకబ్జా దాడి ఘటనలోనూ అదే తీరు 
నగరంలో భూకబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. తమ భూములను ఆక్రమిస్తున్నారని బాధితులు, రైతులు స్థానిక పీఎస్‌లలోనూ, పోలీస్‌ కమిషనర్‌కూ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇటీవల పెందుర్తిలో జరిగిన ఎన్నారై స్థలం వివాదంలో జనసేన నేతలు చేసిన దాడి వ్యవహారంలోనూ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు.

మధురవాడలో విద్యార్థుల గ్యాంగ్‌ వార్‌! 
మధురవాడ: నగరంలో శాంతిభద్రతల వైఫల్యం పాఠశాల విద్యార్థులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మారికవలస, వాంబే కాలనీకి చెందిన ఇద్దరు విద్యార్థుల మధ్య 10 రోజుల క్రితం వివాదం మొదలైంది. పాఠశాలలో గొడవపడటంతో ఉపాధ్యాయులు సర్దిచెప్పినప్పటికీ.. వాట్సాప్‌లో పరస్పరం రెచ్చగొట్టే సందేశాలు పంపుకోవడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో 9, 10 తరగతుల విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. గురువారం సాయంత్రం ఇరు వర్గాలు మారికవలస–తిమ్మాపురం రోడ్డుకు చేరుకున్నాయి. వారితో పాటు పూర్వ విద్యార్థులు, స్థానిక యువకులు కూడా చేరి కర్రలు, పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అదే రోజు రాత్రి శివశక్తినగర్‌లోనూ మరోసారి ఘర్షణ జరిగి ఇద్దరు యువకులు గాయపడ్డారు. ఈ ఘటనపై మారికవలసకు చెందిన యర్రా చందు (19), జస్వత్‌ (20), రాంజగన్‌ తేజ (21)లతో పాటు మరో ముగ్గురు మైనర్లపై కేసు నమోదు చేసినట్లు పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement