రాయవరం (తూర్పుగోదావరి): వరలక్ష్మీవ్రతం చేసుకునేందుకు భార్య సిద్ధమవుతుండగా.. జ్యూస్ షాప్‌లో భర్త విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన విషాద ఘటన రాయవరంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన జి.వెంకటేశ్వర్లు (42) కొన్నేళ్లుగా రాయవరం బస్టాండ్ సెంటర్‌లో భార్య భవానీతో కలిసి ఫ్రూట్ జ్యూస్‌షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో శుక్రవారం మిక్సర్‌లో జ్యూస్ తయారు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వరలక్ష్మీవ్రతం కోసం సిద్ధమవుతున్న భవానీ ఈ విషయాన్ని గమనించి వెంటనే విద్యుత్ సరఫరా నిలిపేందుకు ప్రయత్నించింది. చీపురుతో వెంకటేశ్వర్లును తప్పించేందుకు ప్రయత్నించినా అప్పటికే పరిస్థితి విషమించి ఘటనా స్థలంలోనే మృతిచెందాడు.
భర్త మృతితో భవానీ బోరున విలపించింది. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ కుటుంబానికి దేవుడు అన్యాయం చేశాడంటూ కన్నీరుమున్నీరైంది. ఇద్దరు చిన్నారులతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న ఆమెకు స్థానికులు అండగా నిలిచారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని కావలికి తరలించేందుకు వ్యాపారులు, ఆటో యూనియన్ నాయకులు, స్థానికులు కలిసి రూ.30 వేలు సేకరించి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. పుట్టెడు దుఃఖంతో భర్త మృతదేహాన్ని తీసుకుని భవానీ కావలికి బయలుదేరింది.


