మానసానవనీతంగౌడ్, ఉప సర్పంచ్, ఆలూరు
రంగారెడ్డి: పంచాయతీల్లో నిధుల వినియోగానికి సంబంధించి సర్పంచ్, ఉప సర్పంచులకు ఉన్న జాయింట్ చెక్ పవర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు సర్పంచులు స్వాగతిస్తుండగా ఉప సర్పంచులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల్లో నిధుల వినియోగం, వ్యయాలకు సంబంధించిన చెక్కులపై సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్ సంతకం చేయాల్సి రావడంతో కొన్ని పంచాయతీల్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ సమన్వయంతో పనిచేసుకోవడంతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు.
కొత్త మార్గదర్శకాలు
గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, అత్యవసర మరమ్మత్తులు తదితర సేవలకు పంచాయతీ నిధులను వినియోగించే సమయంలో చెక్కులపై సంతకాల విషయంలో జాప్యం కారణంగా అత్యవసర పనులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జాయింట్ చెక్‌పవర్ కారణంగా ఉన్న ఇబ్బందులపై పలువురు సర్పంచులు గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడంతో ఇటీవల పంచాయతీల్లో చెక్కుల జారీ ప్రక్రియ సజావుగా సాగేందుకు పంచాయతీరాజ్‌శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఉప సర్పంచ్ చెక్కులపై సంతకం చేయకుండా ఇబ్బంది కలిగించినట్లు ఫిర్యాదు చేస్తే వారం రోజుల గడువు ఇచ్చి సమస్యను పరిష్కరించుకునే అవకాశం కల్పించింది. గడువు దాటితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే ఆయన విచారణ చేసి.. ఉప సర్పంచ్ ఉద్దేశపూర్వకంగా చెక్కుల జారీకి ఆటంకం కలిగించినట్లు రుజువైతే జాయింట్ చెక్‌పవర్‌ను తొలగించి కార్యదర్శి లేదా ఎంపీడీఓ, ఎంపీఓలకు అప్పగిస్తారు.
సమన్వయంతో సాగేనా..?
జిల్లాలోని 27 మండలాల పరిధిలో 602 పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై పల్లెల్లో పాలన ఎలా సాగుతుందో.. సర్పంచ్, ఉప సర్పంచుల మధ్య సమన్వయం ఎలా ఉంటుందో.. నిధుల పారదర్శకత ఏ మేరకు జరుగుతుందన్నది వేచి చూడాల్సిందే.
పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం
ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. జాయింట్‌చెక్ పవర్ అనేది పంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం కల్పించిన వ్యవస్థ. కొంతమంది సమస్యలు సృష్టిస్తే మొత్తం వ్యవస్థనే బాధ్యులుగా చూడటం సరికాదు.
– మానసానవనీతంగౌడ్, ఉప సర్పంచ్, ఆలూరు


