శ్రీకాకుళం: పెద్దమురహరిపురం గ్రామానికి చెందిన వివాహిత గొరకల చామంతి(35) విద్యుత్ షాక్‌కు గురై గురువారం మృతి చెందింది. చామంతి ఉదయం 11 గంటల సమయంలో వాషింగ్ మిషన్‌లో దుస్తులు ఉతకడం పూర్తయ్యాక ప్లగ్ తీసేందుకు వెళ్లింది. చేతులు తడిగా ఉండటంతో విద్యుత్ షాక్‌కు గురైంది.
ఆ సమయంలో పక్కనే ఉన్న కిటికీ ఐరన్ గ్రిల్స్‌ను పట్టుకోవడంతో కుడిచెయ్యి కాలిపోయి అక్కడికక్కడే మృత్యువాతపడింది. చామంతి ఎప్పటికీ బయట కనిపించకపోవడంతో ఎదురింట్లో ఉంటున్న గొరకల హైమావతి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించింది. వెంటనే చామంతి భర్త కృష్ణారావు, ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చింది. బంధువుల సహకారంతో చామంతిని పూండిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
చామంతికి గొరకల కృష్ణారావుతో 16 ఏళ్లు కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. గీతిక ఇంటర్ చదువుతుండగా, ఢిల్లేశ్వరి తొమ్మిదో తరగతి చదువుతోంది. వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే జాగ్రత్త అని చెప్పి భర్త కృష్ణారావు సొంత పనులపై బయటకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. కృష్ణారావు ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ బి.నిహార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


