ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన
రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు కోసం బదిలీలు, పదోన్నతుల నిలిపివేత
సాక్షి, అమరావతి: రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు పేరుతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఉద్యోగులను త్రిశంకుస్వర్గంలోకి నెట్టింది. ఒకవైపు ఉత్తర్వుల అమలుపై స్పష్టత లేక ఆ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేసిన ప్రభుత్వం బదిలీలు, పదోన్నతులపై నిషేధాన్ని కొనసాగిస్తుండడంపై ఆందోళన నెలకొంది. గత నెల 13వ తేదీ నుంచి ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో జోన్ల విధానం, స్థానిక కేడర్ కేటాయింపు అంశాలు ఖరారయ్యే వరకూ ఇది కొనసాగుతుందని తెలిపింది.
అయితే రకరకాల గందరగోళాలతో రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు ప్రక్రియనే తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ బదిలీలు, పదోన్నతులపై నిషేధాన్ని మాత్రం అలాగే కొనసాగిస్తోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు ప్రక్రియనే నిలిపేసిన ప్రభుత్వం బదిలీలు, పదోన్నతులపై నిషేధం ఎందుకు కొనసాగిస్తోందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాల పునరి్వభజన ప్రకారం ఉద్యోగులను ఏ ప్రాతిపదికన బదిలీ చేస్తారన్న దానిపై స్పష్టత లేకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. సీనియారిటీ ప్రాతిపదికన ఇస్తారా, స్థానికతను చూస్తారా, జనాభా శాతాన్ని బట్టి నిర్ణయిస్తారా.. అన్న దానిపై స్పష్టత లేదు.
ఒక్కో జిల్లా రెండు, మూడు, నాలుగు ముక్కలుగా విడిపోయిన నేపథ్యంలో.. 10–15 కిలోమీటర్ల పరిధిలో కాకుండా 100–150 కిలోమీటర్ల దూరం బదిలీ చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఏడాది మధ్యలో ఉండగా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నాలుగులక్షల మంది ఉద్యోగులకు లోకల్ క్యాడర్ కేటాయింపు అంత సులభంగా అవుతుందా.. అందుకోసం బదిలీలు ఆపడం ఏమిటి.. అనే ప్రశ్నలకు సమాధానాల్లేవు.
ప్యానల్ ఇయర్ మిస్ అయితే... ఇక ఆ ఏడాదికి పదోన్నతి లేనట్లే
ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు నిర్దిష్ట గడువు (ప్యానల్ ఇయర్ – సెపె్టంబర్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు) ఉంటుంది. 2025–26 ప్యానల్ ఇయర్ ఈ నెల 31తో ముగుస్తోంది. ఈలోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిగాకపోతే ఆ అవకాశం ఈ ఏడాదికి లేనట్టే. ఇప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు కోసం పదోన్నతులు నిలిపివేయడంతో ప్యానల్ ఇయర్‌లో పదోన్నతులు పొందాల్సినవారు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. వివిధ శాఖల్లో ఐదువేల మందికి పదోన్నతులు నిలిచిపోయినట్లు ఉద్యోగసంఘాల నేతలు చెబుతున్నారు. అంటే వారి పదోన్నతి ఒక సంవత్సరం ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది.
2025–26 ప్యానల్ ఇయర్‌లో ఖాళీలకు పదోన్నతులు ఇవ్వకుండానే.. సెపె్టంబర్ నుంచి మొదలయ్యే 2026–27 ప్యానల్ ఇయర్‌కు డీపీసీ ప్రక్రియ మొదలుపెట్టాలని జూలై 31న సాధారణ పరిపాలనశాఖ ఆదేశాలిచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు ప్రక్రియను మధ్యలోనే నిలిపేసిన ప్రభుత్వం, పదోన్నతులు, బదిలీలపై నిషేధాన్ని మాత్రం కొనసాగించడం ఎంత వరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గత నెల 13వ తేదీ నుంచి అమల్లో ఉన్న ఈ నిషేధాన్ని తక్షణమే ఎత్తేసి పదోన్నతులు, బదిలీలపై స్పష్టమైన విధానం ప్రకటించాలని ఉద్యోగసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తక్షణమే నిషేధం ఎత్తేయాలి
రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో హడావుడి చేయకుండా ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలి. కేంద్రం ఇచి్చన 27 నెలల గడువును సముచితంగా వినియోగించుకుని చట్టబద్ధంగా, పారదర్శకంగా అమలు చేయాలి. నిషేధం వల్ల చాలా శాఖల్లో పదోన్నతులు నిలిచిపోయాయి. ఇది చాలా బాధాకరం. ఈ ఏడాది ప్యానల్ ఇయర్ ముగింపు రోజైన ఆగస్టు 31 నాటికైనా పదోన్నతులకు అవకాశం కల్పించాలి. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి
ప్రభుత్వానికి స్పష్టత లేదు
రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయడంపై ప్రభుత్వానికే స్పష్టత లేదు. ఏ ప్రాతిపదికన ఉత్తర్వులను అమలు చేస్తారో చెప్పడంలేదు. సీనియారిటీ ప్రాతిపదికన ఇస్తారా, స్థానికతను చూస్తారా? రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు కోసమే పెట్టిన బ్యాన్‌ను.. ఆ అమలు ప్రక్రియనే నిలిపివేసినప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నారు? ప్రభుత్వ వైఖరితో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. – బాజీ పఠాన్, అధ్యక్షుడు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం


