గ్రామాల్లో ఇంతకుముందు మంచినీటి పథకాలే లేనట్టు వట్టి కోతలు
రెండేళ్లలో ఇంటింటికీ కొత్తగా నీరు ఇస్తామంటూ ప్రగల్భాలు
ప్రొద్దుటూరు సభలో ధారాళంగా అసత్యాలు వల్లెవేసిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు విస్తుపోయిన అధికారులు, ప్రజలు
ఎప్పటి నుంచో దాదాపు అన్ని ఊళ్లలో రక్షిత నీటి పథకాలు, ఓవర్‌హెడ్ ట్యాంకులు
గతంలోనే ప్రతి వ్యక్తికీ రోజుకు 40 లీటర్ల చొప్పున నీళ్లిచ్చేలా పథకాల నిర్మాణం
సాక్షి, అమరావతి: ధారాళంగా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు తనకు తానే సాటి అన్నది జగమెరిగిన సత్యం. తాజాగా జల్‌జీవన్–అమరజీవి జలధార పనుల ప్రారంభం సందర్భంగా సోమవారం ప్రొద్దుటూరులోనూ ఆయన అన్నీ అసత్యాలే వల్లెవేశారు. గత ప్రభుత్వంలో ‘నీళ్లు లేవు.. రోడ్లు లేవు’ అంటూ నిజాలకు పాతరేశారు. వాస్తవానికి రాష్ట్రంలో దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఎప్పటి నుంచో రక్షిత మంచినీటి పథకాలు, ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణాలు ఉన్నాయి. ఏళ్ల తరబడి రక్షిత నీటి సరఫరా జరుగుతోంది. అయినా చంద్రబాబు తాను వచ్చిన తర్వాతే గ్రామాల్లో తాగునీటి పథకాలు నిర్మిస్తున్నట్టు గొప్పలుపోవడంపై అధికారులతోపాటు ప్రజలూ విస్తుపోయారు.
గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 95 లక్షల ఇళ్లు ఉండగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో 39.34 లక్షల ఇళ్లకు కొత్తగా మంచినీటి కుళాయిలు అమర్చింది. అంతకు ముందు 60 ఏళ్ల కాలంలో 30 లక్షల ఇళ్లకు కుళాయిలు అందుబాటులోకి వచ్చాయి. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి 27 లక్షల ఇళ్లకు నీటి కుళాయిలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, గత రెండేళ్ల నాలుగు నెలల కాలంలో కేవలం 2.70 లక్షల ఇళ్లకూ నీటి కుళాయిలను చంద్రబాబు సమకూర్చలేదు. తాజాగా ‘జల్‌జీవన్‌మిషన్–అమరజీవి జలధార’ కార్యకమానికి రాబోయే రెండేళ్లలో రూ.30,156 కోట్లను ఖర్చు పెట్టి ఇంటింటికీ తాగునీరు అందించే బాధ్యత తనదంటూ కోతలు కోసి నవ్వులపాలయ్యారు.
వాస్తవానికి గతంలోనే రాష్ట్రంలోని గ్రామాల్లో ఉండే ప్రతి వ్యక్తికి రోజుకు గరిష్టంగా 40 లీటర్ల చొప్పున నీళ్లు అందించేలా రక్షిత తాగునీటి పథకాల నిర్మాణం జరిగితే, 2019లో కేంద్రం జలజీవన్‌మిషన్ కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల చొప్పున నీరు అందించాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.26,823 కోట్ల పాత పథకాలకు అదనంగా అవసరమైన చోట కొత్త పథకాల నిర్మాణంతోపాటు ఇంటింటికీ కుళాయిల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఆయా పథకాలకు వేసవిలోనూ నీరు పుష్కలంగా సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టింది. అప్పటికి ఉన్న 13 జిల్లాల్లో ఉద్దానం సహా 9 జిల్లాల్లో నదీ రిజర్వాయర్ల నుంచి నేరుగా నీరు సరఫరా అయ్యేలా సమగ్ర రక్షిత మంచినీటి పథకాలకూ రూపకల్పన చేసింది.
అయితే, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం రూ.84 వేల కోట్లతో కొత్త జిల్లాల ప్రాతిపదికన 64 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను చేపడతామంటూ ప్రగల్భాలుపలికింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన పనుల్లో దాదాపు సగానికి పైగా రద్దు చేసింది. ఇప్పుడు రెండేళ్ల తర్వాత రూ.84 వేల కోట్ల ప్రతి పాదనలను పక్కనబెట్టి గతంలో రద్దుచేసిన పథకాల స్థానంలో కొత్తగా మంజూరు చేసినట్టు చూపించి వాటితో కలిపి మొత్తం కేవలం రూ.30,156 కోట్లతో పథకాల నిర్మాణానికి పరిమితమైంది. దీంతో చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు చెప్పిన మరికొన్ని అబద్ధాలు ఇలా..
చంద్రబాబు: కల్తీలేని మద్యం అమ్ముతున్నాం. ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తున్నా. మాములు ఎమ్మార్పీ కన్నా ఒక్క పైసా ఎక్కువ ఇవ్వొద్దు. ఎవరైనా అడిగితే కొరడా తీసుకునే బాధ్యత నాది.
వాస్తవం: ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి తూట్లు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో ఊరూవాడా మద్యాన్ని ఏరులా పారిస్తోంది. మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి, ఎమ్మార్పీ కన్నా అధికంగా అమ్మకాలు సాగిస్తోంది. ఊరూరా ప్రతికాలనీలోనూ బెల్టుషాపుల ద్వారా తీవ్ర దోపిడీకి తెగబడుతోంది. చివరకు సీఎం ప్రొద్దుటూరు సభకు వచ్చే జనాలకూ బస్సులో మద్యం సీసాలు పంచి అభాసుపాలైంది.
చంద్రబాబు: ఎవరైనా ఇసుకలో ఇన్‌వాల్వ్ అయితే, ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టం. ఉచిత ఇసుక మీ హక్కు.. దానికి విఘాతం కల్పిస్తే చర్యలు తీసుకుంటాం.
వాస్తవం: ఉచిత ఇసుక ముసుగులో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రజాప్రతినిధులు, నేతలు నదులను చెరబట్టి అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. చంద్రబాబు నివాసం ఉన్న ఉండవల్లిలోని అక్రమ కట్టడానికి కూత వేటు దూరంలోనే ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తూ ప్రజలను దోచేస్తున్నారు. ఇసుక స్మగ్లర్ల ఆగడాలపై ఎన్జీటీలో రైతులు, ప్రజలు అనేక కేసులు వేయడమే ఇందుకు నిదర్శనం.
చంద్రబాబు: సేవలన్నీ ఫోన్ ద్వారానే అందిస్తున్నాం
వాస్తవం: వాస్తవానికి ఫోన్ ద్వారా సేవలకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బీజం పడింది. పథకాలను ప్రజల గడపవద్దకే వలంటీర్ల ద్వారా చేర్చింది. ఏ సమస్య ఉన్నా.. సత్వర పరిష్కారం చూపింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడింది. పథకాల దరఖాస్తుకు ప్రజలు నానా ఇబ్బందులు పడేలా చేసింది. రెండేళ్ల మూడు నెలల వరకు పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించకుండా అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల ఉసురుపోసుకుంది. ఇటీవలే పింఛన్ల దరఖాస్తుకు అనుమతిచ్చినట్టే ఇచ్చి వెబ్ పోర్టల్‌ను 9 రోజుల్లోనే నిలిపివేసింది. దరఖాస్తు కోసం సచివాలయాల చుట్టూ తిరిగిన అవ్వాతాతలు, ఇతర లబి్ధదారులు గంటల తరబడి క్యూలో నిలబడి అవస్థలు పడ్డారు. చివరకు చాలామంది దరఖాస్తు చేసుకోలేక తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
చంద్రబాబు: రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.24 వేల కోట్లు ఖర్చు చేశాం. గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం చేసి జలహారతి ఇచ్చాం.
వాస్తవం: సాగునీటి ప్రాజెక్టు పనుల్లో అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఈ అవినీతికి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశ కాలువ లైనింగ్, పోలవరం ఎడమ కాలువలో మిగిలిన పనులు, వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులే నిదర్శనం. హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ, కుప్పం బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు రూ.3,850 కోట్లు వ్యయం చేశామని బాబు గొప్పలు చెబుతున్నారు.
కానీ.. లైనింగ్ పనులు అత్యంత నాసిరకంగా చేయడం వల్ల 2025లో లైనింగ్ దెబ్బతిని కొట్టుకుపోయింది. లైనింగ్ పనుల వల్ల లబ్ధి జరిగింది ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘు(ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్), సీఎం రమేష్(రితి్వక్ ప్రాజెక్ట్స్), కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని, సీఎం చంద్రబాబు సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావు, రంగరాజు ఎండీగా ఉన్న ఎన్‌సీసీ మాత్రమే. లైనింగ్ వల్ల భూగర్బజలాలు అడుగంటిపోయి వేలాది బోర్లు ఎండిపోవడంతో రైతులు జీవనాధారం కోల్పోయిన దుస్థితి నెలకొంది.


