విశాఖ, కాకినాడ తీరానికి ఎదురుగా చేపలు లేని ప్రాంతం
మన తీరంలో దేశంలోనే తొలి డెడ్ జోన్
సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: అంతులేని సంపదతో లక్షలాది మత్స్యకార కుటుంబాలకు అన్నం పెట్టే బంగాళాఖాతంలో ఒక నిశ్శబ్ద ప్రమాదం ముంచుకొస్తోంది. సముద్ర గర్భంలో ఆక్సిజన్ వేగంగా తగ్గిపోతోంది. కొన్నిచోట్ల అది జీవులు బతకలేని స్థాయికి పడిపోయింది. శాస్త్రవేత్తలు ఇలాంటి ప్రాంతాలను డెడ్ జోన్‌గా (మృత మండలం) పిలుస్తారు. అలాంటి డెడ్ జోన్ దేశంలోనే తొలిసారి మన రాష్ట్ర తీరంలో బయటపడింది. కేంద్ర భూవిజ్ఞాన శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ (సీఎంఎల్‌ఆర్‌ఈ) శాస్త్రవేత్తలు సాగర్ సంపద పరిశోధన నౌక ద్వారా పశి్చమ బంగాళాఖాతాన్ని కొద్ది నెలల క్రితం సర్వే చేశారు. 17 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద, 300 నుంచి 500 మీటర్ల లోతులో వల వేశారు. అక్కడ ఒక్క చేప కూడా పడలేదు. ఈ ప్రాంతం సరిగ్గా విశాఖపట్నం, కాకినాడ తీరాలకు ఎదురుగా ఉంది. భారత జలాల్లో డెడ్ జోన్ నమోదవడం ఇదే మొదటిసారని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
గోదావరి ముఖద్వారం వద్ద ఊపిరాడని సముద్రం
హైదరాబాద్ విశ్వవిద్యాలయం, విశాఖలోని జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ (ఎన్‌ఐఓ) శాస్త్రవేత్తలు మరో ఆందోళనకర విషయాన్ని కూడా కనుగొన్నారు.
సాధారణంగా బంగాళాఖాతంలో ఆక్సిజన్ కొరత 200 మీటర్ల లోతు దాటిన తర్వాతే ఉంటుంది. కానీ గోదావరి సముద్రంలో కలిసే చోట అక్టోబర్‌లో కేవలం 40 మీటర్ల లోతు నుంచే ఈ పరిస్థితి మొదలవుతోంది. అక్కడ మే నెలలో లీటర్ నీటికి 3 మిల్లీలీటర్లుగా ఉన్న ఆక్సిజన్, అక్టోబర్ నాటికి 0.1 మిల్లీలీటర్లకు పడిపోతోంది. అంటే దాదాపు సున్నా.
డెడ్ జోన్ ఎలా ఏర్పడుతుందంటే..
సముద్ర ఉపరితలానికి గాలి నుంచి ఆక్సిజన్ అందుతుంది. అలలు, గాలుల వల్ల అది లోతుల్లోకి చేరుతుంది. కానీ బంగాళాఖాతంలోకి గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల నుంచి భారీగా మంచినీరు వస్తుంది. ఈ నీరు ఉప్పునీటి కంటే తేలికగా ఉండటంతో పైనే నిలిచిపోతుంది. దీంతో పైనున్న ఆక్సిజన్ కింది పొరల్లోకి చేరడం లేదు. నదులు మోసుకొచ్చే పోషకాలతో సముద్రంపై పాచి (నాచు) విపరీతంగా పెరుగుతుంది. అది చనిపోయి అడుగుకు చేరుతుంది. దాన్ని కుళ్లబెట్టే బ్యాక్టీరియా అక్కడ మిగిలిన కొద్దిపాటి ఆక్సిజన్‌ను కూడా పీల్చేస్తుంది. దీనికి తోడు సముద్రం వేడెక్కుతోంది. వేడి నీటిలో ఆక్సిజన్ తక్కువగా కరుగుతుంది. ఇవన్నీ కలిసి సముద్ర గర్భాన్ని ఊపిరాడని ప్రాంతంగా మారుస్తున్నాయి.
ఎరువులు, ఆక్వా వ్యర్థాలతో ముప్పు రెట్టింపు
గోదావరి, కృష్ణా డెల్టాల్లో లక్షలాది ఎకరాల్లో వరి పొలాలు, ఆక్వా చెరువులు ఉన్నాయి. వాటిలో వాడే రసాయన ఎరువులు, చెరువుల వ్యర్థాలు కాల్వలు, నదుల ద్వారా చివరికి సముద్రంలోకే చేరుతున్నాయి. ఇవన్నీ పాచిని విపరీతంగా పెంచుతాయి. కాకినాడ బే ఇప్పటికే కాలుష్యం, అధిక పోషకాలతో దెబ్బతిన్నట్లు కోరింగ మడ అడవులపై జరిగిన పరిశోధనలు తేల్చాయి. సముద్రంలోకి ఎరువుల ప్రవాహం పెరిగితే అడుగున ఆక్సిజన్ మరింత తగ్గుతుందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు.
ప్రపంచంలో మూడో అతిపెద్దది
బంగాళాఖాతంలో సుమారు 60 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆక్సిజన్ అతి తక్కువగా ఉన్న మండలం ఉందని 2016లో జర్మనీకి చెందిన మ్యాక్స్ ప్లాంక్ సంస్థ, మన ఎన్‌ఐఓ సంయుక్త అధ్యయనం గుర్తించింది. అది 100 నుంచి 400 మీటర్ల లోతులో ఉంది. అక్కడి ఆక్సిజన్ సముద్ర ఉపరితలం కంటే 10 వేల రెట్లు తక్కువ. ఇది ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆక్సిజన్ కొరత మండలం. అయితే ఇంకా కొద్దిగా ఆక్సిజన్ మిగిలి ఉంది. సముద్రంలోని సుడిగుండాలు ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ను నింపుతున్నాయని, అందువల్ల ఇది శాశ్వత మృత మండలంగా మారకపోవచ్చని ఎన్‌ఐఓ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మత్స్యకారులకు దెబ్బ..
ఆక్సిజన్ లేని చోట చేపలు బతకలేవు. అవి ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోతాయి. లేదా ఆక్సిజన్ ఉన్న పై పొరలకే పరిమితమవుతాయి. దీంతో చేపలు బతికే ప్రాంతం కుంచించుకుపోతుంది. సంప్రదాయ వేట ప్రాంతాల్లో చేపలు దొరక్క మత్స్యకారులు మరింత దూరం వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల డీజిల్ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో సముద్ర చేపల దిగుబడి ఏటా పడిపోతోంది. చేపలు దొరకని ప్రాంతాలు పెరుగుతుంటే తీర ప్రాంత ఆరి్థక వ్యవస్థే కుదేలయ్యే ప్రమాదం ఉంది.
వాతావరణానికీ ముప్పే..
ఆక్సిజన్ పూర్తిగా అయిపోయిన సముద్ర మండలాల్లో నైట్రస్ ఆక్సైడ్ విడుదలవుతుంది. ఈ వాయువు కార్బన్ డయాక్సైడ్ కంటే దాదాపు 273 రెట్లు ఎక్కువ వేడిని పట్టి ఉంచుతుంది. అరేబియా సముద్రంలో ఇప్పటికే ఇది జరుగుతోంది. బంగాళాఖాతం ఆ అంచున ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నదుల ప్రక్షాళన, ఆక్వా వ్యర్థాలపై నిఘా, ప్రకృతి వ్యవసాయం, సముద్ర ఆరోగ్య పర్యవేక్షణ, సముద్ర తీరాన్ని పంచుకుంటున్న దేశాలు సమన్వయంతో కదిలితేనే ఈ ముప్పును ఎదుర్కోవడం సాధ్యమవుతుంది.


