కొత్త కమిషనరేట్లకు కష్టాలెన్నో..! | Staff shortage for new commissionerates: andhra pradesh | Sakshi
Sakshi News home page

కొత్త కమిషనరేట్లకు కష్టాలెన్నో..!

Oct 6 2026 6:06 AM | Updated on Oct 6 2026 6:06 AM

Staff shortage for new commissionerates: andhra pradesh

అదనపు నియామకాలు లేకుండా సిబ్బంది పునర్వీభజనతో ఇబ్బందులు 

దీంతో సాధారణ పోలీసింగ్‌ దెబ్బతినే అవకాశం

సైబర్‌ నేరాల దర్యాప్తుకు సాంకేతిక నిపుణుల కొరత 

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లకు మౌలిక సదుపాయాల లేమి 

విస్తృతమైన భౌగోళిక పరిధిలో అత్యవసర సేవల సమన్వయంలో లోపాలు  

అదనపు బడ్జెట్‌ కేటాయించకపోవడంతో కమిషనరేట్‌ ఆధునికీకరణకు అవరోధాలు 

ప్రభుత్వ తాజా నిర్ణయంతో పోలీసు విధులు కత్తిమీద సామేనన్న అభిప్రాయం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ వాటి ఏర్పాటు, నిర్వహణలో సవాళ్లు తప్పవని పోలీస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆ వర్గాల అభిప్రాయం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న  గుంటూరు, తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరంలో కొత్త కమిషనరేట్లకు ప్రధానంగా సిబ్బంది కొరత, నిధుల సమస్య అవరోధంగా మారనుంది. 

ఈ కమిషనరేట్లకు సంబంధించి ఐజీ, డీఐజీ స్థాయి అధికారులకు పోలీస్‌ కమిషనర్లుగా బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌) సెక్షన్‌ 14 (6) ప్రకారం పోలీస్‌ కమిషనర్‌లకు ఎగ్జిక్యూటివ్‌ మేజిస్టీరియల్‌ అధికారాలు కల్పించాలని నిర్ణయించింది. వాటి పరిధిలో ప్రస్తుతం ఉన్న సిబ్బందినే పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయం తీసుకోవడంతోపాటు మౌలిక వసతులు, నిర్వహణకు నిధులు కేటాయింపు అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఖాకీలకు విధులు కత్తిమీద సాముగా మారే ప్రమాదం ఉందని 
పలువురు భావిస్తున్నారు.   

సిబ్బందిపై తీవ్ర పని ఒత్తిడి 
కొత్త కమిషనరేట్లలో ప్రత్యేక నేర పరిశోధన విభాగాలు, ట్రాఫిక్‌ విభాగాలు, మహిళా పోలీస్‌ స్టేషన్లు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు, ఐటీ విభాగాలు, క్లూస్‌ టీమ్‌లు, వేలిముద్రల విభాగాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే వీటికి అవసరమైన అదనపు పోస్టుల మంజూరు ప్రతిపాదన లేదు.  ప్రస్తుతం ఉన్న పోలీసు సిబ్బందిని కొత్త విభాగాలకు కేటాయించి సర్ధుబాటు చేయాలని ప్రతిపాదించారు. అలాంటప్పుడు పోలీస్‌ స్టేషన్లలో రోజువారీ విధులు, పెట్రోలింగ్, నేరాల దర్యాప్తు, కోర్టు విధులు, బందోబస్తు వంటి బాధ్యతలను నిర్వర్తించేందుకు తగినంత మంది అందుబాటులో లేక... ప్రస్తుత సిబ్బంది తీవ్ర ఒత్తిడితో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రత్యేక విభాగాలకు సిబ్బందిని కేటాయించడంతోపాటు సాధారణ పోలీసింగ్‌ సామర్థ్యం తగ్గకుండా చూడటం కొత్త కమిషనరేట్ల ముందున్న ప్రధాన సవాలు. 

అదనపు నిధులు లేకుండా ఆధునికీకరణ ఎలా? 
కొత్త కమిషనరేట్ల ఏర్పాటుకు అదనపు ఆర్థిక భారం ఉండదని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బడ్జెట్‌ కేటాయింపులతోనే పరిపాలనా మార్పులు చేపట్టాలని సూచించారు. అదనపు నిధులు లేకుండా కమిషనరేట్ల ఆధునికీకరణ ఎలా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు, ఐటీ విభాగాలు, నేర పరిశోధనకు అవసరమైన సాంకేతిక సదుపాయాలను ఏ విధంగా సమకూరుస్తారనే వివరాలు ప్రతిపాదనల్లో స్పష్టంగా లేకపోవడం శోచనీయం. ఇప్పటికే అందుబాటులో ఉన్న సదుపాయాలను వినియోగించడం ద్వారా ఎంతవరకు అవసరాలను తీర్చవచ్చు? కొత్తగా అవసరమయ్యే పరికరాలు, శిక్షణ, నిర్వహణ వ్యయాలకు ఏ బడ్జెట్‌ నుంచి నిధులు కేటాయిస్తారు? వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 

కర్నూలులో సైబర్‌ నేరాల ఉధృతి కట్టడి ఎలా? 
కొత్త కమిషనరేట్ల ఏర్పాటుకు సమర్పించిన నివేదికలో కర్నూలు సైబర్‌ నేరాల గణాంకాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. 2022లో 118 సైబర్‌ కేసులు మాత్రమే నమోదుకాగా, 2025 నాటికి ఈ సంఖ్య  ఏకంగా 2,729కు చేరింది.  ఇంత భారీ స్థాయిలో  సైబర్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు విభాగాలు, సాంకేతిక నిపుణులు, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ సదుపాయాల ప్రస్తావన లేకుండానే కర్నూలు కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 38 పోలీస్‌ స్టేషన్లు ఉండేలా ప్రతిపాదనలు ఖరారు చేయడం గమనార్హం. 

తిరుమల నుంచి శ్రీసిటీ వరకు విభిన్న సవాళ్లు 
తిరుపతి కమిషనరేట్‌ పరిధిలో నాలుగు జోన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపాదన ప్రకారం మొత్తం 49 పోలీస్‌ స్టేషన్లు ఉంటాయి. తిరుమల భక్తుల భద్రత, తిరుపతి నగర ట్రాఫిక్, రేణిగుంట విమానాశ్రయం, శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతం వంటి విభిన్న అవసరాలను ఒకే కమిషనరేట్‌ పరిధిలో సమన్వయం చేయడం అత్యంత క్లిష్టంగా మారనుంది. 2025లో ఈ ప్రాంతంలో 10,094 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మహిళలపై నేరాలు 725 కేసులు, రోడ్డు ప్రమాదాలు 1,196 కేసులు నమోదైనట్లు పోలీస్‌ నివేదికలో వెల్లడించడం గమనార్హం.

రాజధాని ప్రత్యేక జోన్‌గా భద్రతా బలగాలేవి? 
గుంటూరు కమిషనరేట్‌లో అమరావతి రాజధాని ప్రాంతానికి ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు నగరం, గ్రామీణ ప్రాంతం, అమరావతి, తెనాలి కేంద్రాలుగా నాలుగు జోన్లు ఉంటాయి. గుంటూరు ప్రతిపాదిత కమిషనరేట్‌ పరిధిలో 2025లో 11,214 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. హత్య కేసులు 2022లో 37 ఉండగా 2025లో 55కు పెరిగాయి. ఆర్థిక నేరాలు 2024లో 49 ఉండగా 2025లో 207కు పెరిగాయి.ఈ నేపథ్యంలో భద్రతా బలగాల కొరతపై 
చర్చ సాగుతోంది.  

రాజమహేంద్రవరం పరిధిలో రోడ్డు ప్రమాదాలపై దృష్టి ఏది? 
రాజమహేంద్రవరం కమిషనరేట్‌ పరిధిలో మూడు జోన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపాదనల్లో మొత్తం 30 పోలీసు స్టేషన్లను చేర్చారు. కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, మండపేట తదితర ప్రాంతాలు ఈ వ్యవస్థ పరిధిలో ఉంటాయి. 2025లో ఈ ప్రాంతంలో 7,685 ఎఫ్‌ఐఆర్‌లు, 802 మహిళలపై నేరాల కేసులు, 914 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం పరిధిలో ఎక్కువగా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలనే అంశాన్ని విస్మరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement