షిల్లాంగ్: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన తమ రాష్ట్ర ప్రజల సహాయార్థం అసోం ప్రభుత్వం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. ప్రయాణికులు, వాహనాలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా మేఘాలయ పోలీసులతో అసోం యంత్రాంగం సంప్రదింపులు జరుపుతోంది. ఆగస్టు 19న ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ (కేఎస్‌యూ) నిర్వహించిన ‘బ్లాక్ ఫ్లాగ్ బైక్ ర్యాలీ’ సందర్భంగా షిల్లాంగ్‌లోని ఖానాపారా ప్రాంతంలో ఉద్రిక్తత చెలరేగింది.
Important Update regarding prevailing situation in Meghalaya. pic.twitter.com/ZVGnlPuSGp
— Assam Police (@assampolice) August 21, 2026
ఆందోళనకారులు అసోం రిజిస్ట్రేషన్‌తో ఉన్న పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు నిరసనగా గురువారం గౌహతిలోని ఖానాపారాలో అసోం వాహన డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. మేఘాలయలో చిక్కుకుపోయిన వ్యక్తులు, వాహనాల వివరాలు తెలిసిన కుటుంబ సభ్యులు లేదా బంధువులు వెంటనే అధికారులను సంప్రదించాలని అసోం పోలీసులు కోరారు. సమాచారం అందిన వెంటనే మేఘాలయ స్థానిక పరిపాలన, పోలీసు విభాగాలతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపడతామని తెలిపారు.
అసోం ప్రభుత్వం జారీ చేసిన హెల్ప్‌లైన్ నంబర్లు
వాట్సాప్ (WhatsApp): 9181014888
ల్యాండ్‌లైన్ (Landline): 03612381511
ఈ ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆందోళన వ్యక్తం చేస్తూ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాతో మాట్లాడారు. శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం సరిహద్దు రక్షణ శాఖ మంత్రి అతుల్ బోరా మేఘాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.
మరోవైపు హింసాత్మక ఘటనలకు సంబంధించి కేఎస్‌యూకి చెందిన ముగ్గురు కీలక నేతలను మేఘాలయ పోలీసులు అరెస్టు చేశారు. ర్యాలీని పక్కదోవ పట్టించేందుకు కొందరు సంఘవిద్రోహ శక్తులు చొరబడ్డారని కేఎస్‌యూ నేతలు పేర్కొన్నారు. మేఘాలయ నివాసితుల భద్రతా చట్టం (ఎంఆర్‌ఎస్‌ఎస్‌ఏ) అమలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్‌లో మార్పులు వంటి ఐదు డిమాండ్లతో విద్యార్థి సంఘం ఈ నిరసన చేపట్టింది.
ఇది కూడా చదవండి: పూణెలో ఉద్రిక్తత: రాహుల్ సభ వేళ విద్యార్థి సంఘాల ఘర్షణ!


