ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసు.. ఎట్టకేలకు సాధిక్‌ అరెస్ట్‌ | Sadhik Khan Arrest In Delhi For AE Nukaraju Family Case | Sakshi
Sakshi News home page

ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసు.. ఎట్టకేలకు సాధిక్‌ అరెస్ట్‌

Aug 22 2026 7:06 AM | Updated on Aug 22 2026 7:12 AM

Sadhik Khan Arrest In Delhi For AE Nukaraju Family Case

సాక్షి, కాకినాడ: రాజమండ్రిలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ ఖాన్‌ను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, సాధిక్ ఖాన్ కోసం గత ఐదు రోజులుగా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మొత్తం ఎనిమిది పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో అతడి కోసం గాలించినట్లు తెలుస్తోంది. చివరకు ఢిల్లీలో సాధిక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

అతడిని రేపు రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు లేదా కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన జరిగిన అనంతరం సాధిక్ కాకినాడ నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన రోజే సాధిక్ ఓ లాయర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సాధిక్ కారణమయ్యాడనే ఆరోపణలపై రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇదిలా ఉండగా నూకరాజు అల్లుడు జగదీశ్వర రెడ్డి మృతికి సాధిక్ కారణమని ఆయన భార్య సౌజన్య లేఖ రాయడం తెలిసిందే. జగదీశ్వర రెడ్డి తండ్రి భాస్కర రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌లో సాధిక్‌పై హత్య కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం సాధిక్ ఖాన్‌కు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నూకరాజు భార్య మీనా మృతదేహం కోసం గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సాధిక్‌ను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: నూకరాజు ఆత్మహత్యలో సౌజన్య లేఖ ఇదే.. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement