దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో మీనా ముందు వరుసలో ఉంటుంది. సౌత్ స్టార్ హీరోలైనా రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, చిరంజీవి, వెంకటేశ్, మోహన్‌లాల్, మమ్ముట్టిల సరసన సూపర్ హిట్ సినిమాలు చేసింది. తెలుగులో తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్ సొంతం చేసుకుంది.
అయితే కొన్నేళ్ల క్రితం ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె కొంతకాలం పాటు తీవ్రమైన డిప్రెషన్‌లో ఉంది. ప్రస్తుతం సినిమాలేవీ చేయడం లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె.. తన భర్త మరణానికి గల కారణాలను వివరించింది. ఆ ఓక్క కారణం వల్లే విద్యాసాగర్‌ను కాపాడుకోలేకపోయానని తెలిపింది.
మా ఆయనకు ఊపిరితిత్తుల మార్పిడి అవసరమైందని మీనా వెల్లడించింది. ఆ సమయంలో డోనర్ దొరకలేదని తెలిపింది. ఇందులో ఉండే మెడికల్ ప్రాసెస్ చూసి నేనే చాలా ఆశ్చర్యపోయా.. చాలా రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగడంతో మా ఆయన ఆరోగ్యం క్షీణించిందని పేర్కొంది. లంగ్స్ కోసం చాలా ప్రయత్నాలు చేశానని..కానీ దాతలు దొరక్కపోవడంతో అమెరికా వెళ్లేందుకు ట్రై చేశానని తెలిపింది. కానీ ఇలాంటి సమయంలో అమెరికా తరలించడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారని గుర్తు చేసుకుంది. ఆయనను కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా దురదృష్టవశాత్తూ మాకు దూరమయ్యారని వెల్లడించింది. నా భర్త మరణించాక కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నానని.. అయితే నా ఫ్రెండ్స్, సినిమాలతో ఈ విషాదం నుంచి కోలుకుంటున్నట్లు మీనా చెప్పుకొచ్చింది.


