హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా మాజీ ప్రియుడితో ఉన్న బంధంలో తాను ఎదుర్కొన్న మానసిక వేదన గురించి ఆమె చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. రెండేళ్ల పాటు ఆ బంధంలో నరకం చూశానంటూ అనుపమ చేసిన వ్యాఖ్యలపై అభిమానులు స్పందిస్తూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ఈ అంశంపై నటి అదితి శంకర్ స్పందించారు. అనుపమ తన అనుభవాన్ని ధైర్యంగా, నిజాయతీగా పంచుకున్నారని ప్రశంసించారు.
‘వన్స్‌మోర్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనుపమ వ్యాఖ్యల గురించి ఆమెను ప్రశ్నించగా.. ‘అనుపమ ఇంటర్వ్యూ చూశాను. ఆమె కామెంట్స్‌పై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు. కానీ, తాను ఎదుర్కొన్న ఇబ్బందిని అంత ధైర్యంగా పంచుకున్నందుకు ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆమె మాటల్లో నిజాయతీ కనిపించింది’ అని అదితి అన్నారు.
అనుపమ ఎవరినీ నిందించడానికి లేదా కించపరచడానికి ఈ విషయాలను బయటపెట్టలేదని అదితి అభిప్రాయపడ్డారు. ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని మాత్రమే పంచుకున్నారని, అది చాలామందికి అవగాహన కలిగించే విషయమని పేర్కొన్నారు.
‘చాలామంది పురుషులు, మహిళలు తీవ్రమైన మానసిక ఘర్షణలతో కూడిన బంధాల్లో ఉంటున్నారు. తాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా కొన్నిసార్లు వారికి అర్థం కాదు. ఇలాంటి విషయాల గురించి అనుపమలా ఓపెన్‌గా మాట్లాడటం వల్ల.. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి తమ బంధం గురించి ఆలోచించే అవకాశం, కొంత స్పష్టత లభిస్తుంది’అని అదితి తెలిపారు.
అనుపమ ఏం చెప్పారు?
మాజీ బాయ్‌ఫ్రెండ్ పేరును ప్రస్తావించకుండా ఇటీవల అనుపమ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గతంలో ఓ బంధం తనపై తీవ్ర ప్రభావం చూపిందని ఆమె పేర్కొన్నారు. ఆ వ్యక్తి ప్రవర్తన కారణంగా ఒక నటిగా, మహిళగా తనను తాను నిందించుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండేళ్ల పాటు ఆ బంధంలో తాను నరకం అనుభవించినట్లు చెప్పుకొచ్చారు.
అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేసుకుంటూ ధైర్యంగా ఉండాలని, తన అనుభవాన్ని పంచుకున్నందుకు అభినందిస్తూ పలువురు పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అదితి శంకర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్‌గా మారాయి. అనుపమకు మద్దతుగా ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.


