ఏఐ ఏం చేస్తోంది?
వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవంగా బతికే అవకాశం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దురదృష్టవశాత్తు ఆ గౌరవాన్ని మంటగలిపేలా ఏఐ మాయాజాలంతో తెరముందు, తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి.తాజాగా... ‘చుట్టమల్లే పాట వీడియోలో కొందరు ఏఐతో అసభ్యకర హావభావాలు, సన్నివేశాలు చేర్చడం ఆందోళన కలిగించింది. ఏఐ విశ్వసనీయత, ప్రతికూలతలపై మరోసారి చర్చను రేకెత్తించింది...
‘దేవర’ సినిమా కోసం అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చిన ‘చుట్టమల్లే’ పాట సూపర్‌హిట్ పాటగా నిలిచింది. అలాంటి పాటపై నయా వంచకుల దృష్టి పడింది. ఏఐతో రూపొందించిన ఈ పాట అసభ్య నకిలీ వీడియో ఈ నెల ప్రారంభంలో సోషల్ మీడియాలోకి వచ్చింది. ఈ వీడియో క్లిప్‌లు వేగంగా ఒకరి నుంచి ఒకరికి షేర్ అయ్యాయని సమాచారం.
మార్ఫింగ్ చేసిన ఈ క్లిప్‌ను తొలగించినప్పటికీ, ఒకసారి సోషల్ మీడియా నెట్‌వర్క్‌లోకి ప్రవేశించిన తరువాత, అనుమతి లేని సింథటిక్ కంటెంట్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందనే దానికి ‘చుట్టమల్లే’ ఫేక్ వీడియోనే నిదర్శనం.
మౌనాన్ని వీడి...
‘అసహ్యకరమైనది, రోత పుట్టించేది, సిగ్గుమాలినది’గా ఈ ఫేక్ వీడియో క్రియేటర్స్ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. దానిని రూపొందించిన వారిపై, వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చె΄్పారు. ఇలాంటి కంటెంట్ చూడవద్దని, డౌన్‌లోడ్ చేయవద్దని, షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఏఐ దుర్వినియోగానికి వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నకిలీ వీడియోపై జాన్వీ కపూర్ తన మౌనాన్ని వీడారు. కల్పిత కంటెంట్‌ను ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘చిత్రపరిశ్రమలోని ప్రతి మహిళకూ ఏదో ఒక రకంగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. ఈ సమస్య కేవలం ఒక వీడియోకు మాత్రమే పరిమితమైనది కాదు’ అన్నారు జాన్వీ.
కోర్టు సహాయంతో...
వ్యక్తిత్వ హక్కులను (పర్సనాలిటీ రైట్స్) కొన్నిసార్లు ప్రచార హక్కులు(పబ్లిసిటీ రైట్స్) అని కూడా పిలుస్తారు. ఇవి ఒక వ్యక్తి గుర్తింపుకు అగౌరవం, నష్టం రాకుండా రక్షణగా నిలుస్తాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తమ వ్యక్తిగత గౌరవాన్ని రక్షించుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు సినీ ప్రముఖులు.
ఏఐ జనరేటెడ్ డీప్‌ఫేక్‌లు, మార్ఫింగ్ చేసిన కంటెంట్‌కు సంబంధించి తన పేరు, ఫొటో, స్వరంతో పాటు గుర్తింపునకు సంబంధించిన ఇతర అంశాలను ఉపయోగించకుండా ఉండేలా సమంత రూత్ ప్రభుకు న్యాయస్థానం అండగా నిలిచింది. ఆర్టికల్ 21ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కాపీరైట్ చట్టంలోని ఆర్టికల్ 19 (1) (ఎ), సెక్షన్ 38 (బి)లను కోర్టు ప్రస్తావించింది.
తమ పేర్లు, ఫొటోలు, వాయిస్... మొదలైన వాటిని ఏ.ఐ ద్వారా దుర్వినియోగం చేయకుండా ఉండే ఉత్తర్వులను కోర్టు ద్వారా పొందారు హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, సునీల్ షెట్టి. ఏఐ జనరేటివ్, ఏఐ మెషిన్ లెర్నింగ్, డీప్‌ఫేక్, ఫేస్‌మార్ఫింగ్‌లాంటి సాంకేతికత ద్వారా అభిషేక్ బచ్చన్ పేరు, ఫొటో, వాయిస్... మొదలైన వాటిని అనధికారికంగా ఉపయోగించడాన్ని దిల్లీ హైకోర్టు నిషేధించింది.
తన అనుమతి లేకుండా తన ఫొటోలను ఏఐతో మెరుగులు దిద్దడం, మార్చడం లాంటివి చేయవద్దని ప్రముఖ నటి యామీ గౌతమ్ మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు.
జాన్వీ కపూర్ డీప్‌ఫేక్ వీడియో విషయానికి వస్తే... డీప్‌ఫేక్ వల్ల కలిగే నష్టం కేవలం వాణిజ్యపరమైన దోపిడీ(కమర్షియల్ ఎక్స్΄్లాయిటేషన్)కి మాత్రమే పరిమితం కాదు. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన గుర్తింపు, గౌరవంపై కూడా ప్రభావం చూపగలదు.
ఔరా... హాలీవుడ్‌లో కూడా!
టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ కూడా డీప్‌ఫేక్, మార్ఫింగ్ బాధితురాలే! స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా... డిజిటల్ రెప్లికా, పెర్‌ఫార్మెన్స్ క్లోనింగ్, ఏఐ–జనరేటెడ్ స్క్రిప్ట్ రైటింగ్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాయి. దీని ద్వారా కొన్ని హక్కులు సాధించుకోగలిగాయి. తాజానిబంధనల ప్రకారం... నటులకు సంబంధించి డిజిటల్ డబుల్, వాయిస్, రెప్లికా... మొదలైన వాటిని ప్రోడక్షన్‌లలో ఉపయోగించినప్పుడు ఆ విషయాన్ని తెలియజేసేలా స్పష్టమైన సమాచారంతో కూడిన అనుమతి అవసరం.
బెవర్లీ హిల్స్ ఏజెన్సీ... విలియం మోరిస్ ఎండీవర్(డబ్ల్యూఎంఇ) చికాగోకు చెందిన ‘వెర్మిలియో’ అనే కంపెనీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ‘కళా కారులకు సంబంధించి సృజనాత్మకతను పరిరక్షిస్తూనే వారికి సాధికారత కల్పించడానికి ఏర్పాటైన మొట్టమొదటి ఏఐ జనరేటివ్ ప్లాట్‌ఫామ్’ అని తనను తాను పరిచయం చేసుకుంది వెర్మిలియో.
‘ట్రేస్ ఐడీ’ అనే సాధనాన్ని ఉపయోగిస్తోంది వెర్మిలియో. ‘ట్రేస్ ఐడీ’ అనేది డిజిటల్ ఫింగర్ ప్రింట్‌లాంటిది. ఒకరి చిత్రాన్ని అనుమతి లేకుండా ఉపయోగించినట్లయితే ‘ట్రేస్ ఐడీ’ ఆటోమేటిక్‌గా దాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. అప్పుడు ఆ ఫొటోను తొలగించమని నోటీస్ జారీ చేయవచ్చు.
సవరణలు
ఎలక్ట్రానిక్స్–ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 సవరణలపై దృష్టి పెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం ఏఐతో సృష్టించిన హానికరమైన కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడం, షేర్ చేయడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. నిబంధనలను ఉల్లంఘించిన వారు భారతీయ న్యాయసంహిత(2023)తో సహా ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం క్రిమినల్ చర్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు.
జవాబుదారీతనం నుండి తప్పించుకోవడానికి, సాంకేతికతను రక్షణ కవచంగా ఉపయోగించకుండా, చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ కంటెంట్ మాదిరిగానే ఏఐ–సృష్టించిన హానికరమైన కంటెంట్‌ను నియంత్రించేలా చూడడమే సవరణల లక్ష్యం అని ప్రభుత్వం తెలియజేసింది. 2026లో చేసిన సవరణలు ప్రధానంగా సింథటికల్లీ జనరేటెడ్ ఇన్‌ఫర్‌మేషన్(ఎస్‌జీఐ)పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ‘ఎస్‌జీఐ’ లో డీప్‌ఫేక్ వీడియోలు, క్రియేట్ చేసిన, మార్చిన ఫొటోలు, క్లోన్ చేసిన లేదా కృత్రిమ వాయిస్ రికార్డింగ్‌లు ఉన్నాయి. – యాకుబ్ పాషా
కొత్త రూల్స్
కొత్త నిబంధనల ప్రకారం... యూజర్‌లు తప్పుదారి పట్టకుండా ఉండేందుకు చట్టబద్ధమైన ఏఐ జనరేటెడ్ కంటెంట్‌పై స్పష్టమైన లేబులింగ్ ఉండాలి. ‘సింథటిక్‌గా రూపొందించబడింది’ అని పేర్కొంటూ కంటెంట్‌లో లేబుల్ ప్రదర్శించాలి. ‘డీప్‌ఫేక్‌లు, అనుమతి లేకుండా తీసిన ఫొటోలతో సహా చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను షేర్ చేయడం వల్ల చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి వస్తుంది’ అని ప్రతి మూడు నెలలకు ఒకసారి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు యూజర్‌లను హెచ్చరించాలి.
సింథటిక్ కంటెంట్‌ను క్రియేట్ చేసే, వాటిని షేర్ చేసే ప్లాట్‌ఫామ్‌లు యూజర్‌లను చేర్చుకునే సమయంలో, ఆ తరువాత ప్రత్యేక హెచ్చరికలు జారీ చేయాలి. కంటెంట్‌ను దుర్వినియోగం చేయకుండా వారిని హెచ్చరిస్తూ, జరిమానాల గురించి వివరించాలి. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించడానికి గడువును గణనీయంగా తగ్గించారు. గతంలో ఆ గడువు 36 గంటలు ఉంటే ఇప్పుడు మాత్రం ప్రభుత్వం నుండి నోటీసు అందిన మూడు గంటల లోపు చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించాలి. లైంగిక కంటెంట్, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, నకిలీ గుర్తింపుకు సంబంధించిన కేసులలో వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.


