breaking news
Chuttamalle Song
-
చుట్టమల్లే... ఆగలేదా? జూ.ఎన్టీఆర్ పై మళ్లీ...
-
పీకల్లోతు ‘ఫేక్!’
ఏఐ ఏం చేస్తోంది?వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవంగా బతికే అవకాశం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దురదృష్టవశాత్తు ఆ గౌరవాన్ని మంటగలిపేలా ఏఐ మాయాజాలంతో తెరముందు, తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి.తాజాగా... ‘చుట్టమల్లే పాట వీడియోలో కొందరు ఏఐతో అసభ్యకర హావభావాలు, సన్నివేశాలు చేర్చడం ఆందోళన కలిగించింది. ఏఐ విశ్వసనీయత, ప్రతికూలతలపై మరోసారి చర్చను రేకెత్తించింది...‘దేవర’ సినిమా కోసం అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చిన ‘చుట్టమల్లే’ పాట సూపర్‌హిట్ పాటగా నిలిచింది. అలాంటి పాటపై నయా వంచకుల దృష్టి పడింది. ఏఐతో రూపొందించిన ఈ పాట అసభ్య నకిలీ వీడియో ఈ నెల ప్రారంభంలో సోషల్ మీడియాలోకి వచ్చింది. ఈ వీడియో క్లిప్‌లు వేగంగా ఒకరి నుంచి ఒకరికి షేర్ అయ్యాయని సమాచారం.మార్ఫింగ్ చేసిన ఈ క్లిప్‌ను తొలగించినప్పటికీ, ఒకసారి సోషల్ మీడియా నెట్‌వర్క్‌లోకి ప్రవేశించిన తరువాత, అనుమతి లేని సింథటిక్ కంటెంట్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందనే దానికి ‘చుట్టమల్లే’ ఫేక్ వీడియోనే నిదర్శనం.మౌనాన్ని వీడి...‘అసహ్యకరమైనది, రోత పుట్టించేది, సిగ్గుమాలినది’గా ఈ ఫేక్ వీడియో క్రియేటర్స్ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. దానిని రూపొందించిన వారిపై, వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చె΄్పారు. ఇలాంటి కంటెంట్ చూడవద్దని, డౌన్లోడ్ చేయవద్దని, షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఏఐ దుర్వినియోగానికి వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నకిలీ వీడియోపై జాన్వీ కపూర్ తన మౌనాన్ని వీడారు. కల్పిత కంటెంట్‌ను ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘చిత్రపరిశ్రమలోని ప్రతి మహిళకూ ఏదో ఒక రకంగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. ఈ సమస్య కేవలం ఒక వీడియోకు మాత్రమే పరిమితమైనది కాదు’ అన్నారు జాన్వీ.కోర్టు సహాయంతో...వ్యక్తిత్వ హక్కులను (పర్సనాలిటీ రైట్స్) కొన్నిసార్లు ప్రచార హక్కులు(పబ్లిసిటీ రైట్స్) అని కూడా పిలుస్తారు. ఇవి ఒక వ్యక్తి గుర్తింపుకు అగౌరవం, నష్టం రాకుండా రక్షణగా నిలుస్తాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తమ వ్యక్తిగత గౌరవాన్ని రక్షించుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు సినీ ప్రముఖులు.ఏఐ జనరేటెడ్ డీప్‌ఫేక్‌లు, మార్ఫింగ్ చేసిన కంటెంట్‌కు సంబంధించి తన పేరు, ఫొటో, స్వరంతో పాటు గుర్తింపునకు సంబంధించిన ఇతర అంశాలను ఉపయోగించకుండా ఉండేలా సమంత రూత్ ప్రభుకు న్యాయస్థానం అండగా నిలిచింది. ఆర్టికల్ 21ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కాపీరైట్ చట్టంలోని ఆర్టికల్ 19 (1) (ఎ), సెక్షన్ 38 (బి)లను కోర్టు ప్రస్తావించింది.తమ పేర్లు, ఫొటోలు, వాయిస్... మొదలైన వాటిని ఏ.ఐ ద్వారా దుర్వినియోగం చేయకుండా ఉండే ఉత్తర్వులను కోర్టు ద్వారా పొందారు హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, సునీల్ షెట్టి. ఏఐ జనరేటివ్, ఏఐ మెషిన్ లెర్నింగ్, డీప్‌ఫేక్, ఫేస్మార్ఫింగ్లాంటి సాంకేతికత ద్వారా అభిషేక్ బచ్చన్ పేరు, ఫొటో, వాయిస్... మొదలైన వాటిని అనధికారికంగా ఉపయోగించడాన్ని దిల్లీ హైకోర్టు నిషేధించింది.తన అనుమతి లేకుండా తన ఫొటోలను ఏఐతో మెరుగులు దిద్దడం, మార్చడం లాంటివి చేయవద్దని ప్రముఖ నటి యామీ గౌతమ్ మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు.జాన్వీ కపూర్ డీప్‌ఫేక్ వీడియో విషయానికి వస్తే... డీప్‌ఫేక్ వల్ల కలిగే నష్టం కేవలం వాణిజ్యపరమైన దోపిడీ(కమర్షియల్ ఎక్స్΄్లాయిటేషన్)కి మాత్రమే పరిమితం కాదు. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన గుర్తింపు, గౌరవంపై కూడా ప్రభావం చూపగలదు.ఔరా... హాలీవుడ్లో కూడా!టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ కూడా డీప్‌ఫేక్, మార్ఫింగ్ బాధితురాలే! స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా... డిజిటల్ రెప్లికా, పెర్ఫార్మెన్స్ క్లోనింగ్, ఏఐ–జనరేటెడ్ స్క్రిప్ట్ రైటింగ్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాయి. దీని ద్వారా కొన్ని హక్కులు సాధించుకోగలిగాయి. తాజానిబంధనల ప్రకారం... నటులకు సంబంధించి డిజిటల్ డబుల్, వాయిస్, రెప్లికా... మొదలైన వాటిని ప్రోడక్షన్లలో ఉపయోగించినప్పుడు ఆ విషయాన్ని తెలియజేసేలా స్పష్టమైన సమాచారంతో కూడిన అనుమతి అవసరం.బెవర్లీ హిల్స్ ఏజెన్సీ... విలియం మోరిస్ ఎండీవర్(డబ్ల్యూఎంఇ) చికాగోకు చెందిన ‘వెర్మిలియో’ అనే కంపెనీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ‘కళా కారులకు సంబంధించి సృజనాత్మకతను పరిరక్షిస్తూనే వారికి సాధికారత కల్పించడానికి ఏర్పాటైన మొట్టమొదటి ఏఐ జనరేటివ్ ప్లాట్‌ఫామ్’ అని తనను తాను పరిచయం చేసుకుంది వెర్మిలియో.‘ట్రేస్ ఐడీ’ అనే సాధనాన్ని ఉపయోగిస్తోంది వెర్మిలియో. ‘ట్రేస్ ఐడీ’ అనేది డిజిటల్ ఫింగర్ ప్రింట్లాంటిది. ఒకరి చిత్రాన్ని అనుమతి లేకుండా ఉపయోగించినట్లయితే ‘ట్రేస్ ఐడీ’ ఆటోమేటిక్‌గా దాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. అప్పుడు ఆ ఫొటోను తొలగించమని నోటీస్ జారీ చేయవచ్చు.సవరణలుఎలక్ట్రానిక్స్–ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 సవరణలపై దృష్టి పెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం ఏఐతో సృష్టించిన హానికరమైన కంటెంట్‌ను అప్లోడ్ చేయడం, షేర్ చేయడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. నిబంధనలను ఉల్లంఘించిన వారు భారతీయ న్యాయసంహిత(2023)తో సహా ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం క్రిమినల్ చర్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. జవాబుదారీతనం నుండి తప్పించుకోవడానికి, సాంకేతికతను రక్షణ కవచంగా ఉపయోగించకుండా, చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ మాదిరిగానే ఏఐ–సృష్టించిన హానికరమైన కంటెంట్‌ను నియంత్రించేలా చూడడమే సవరణల లక్ష్యం అని ప్రభుత్వం తెలియజేసింది. 2026లో చేసిన సవరణలు ప్రధానంగా సింథటికల్లీ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్(ఎస్జీఐ)పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ‘ఎస్జీఐ’ లో డీప్‌ఫేక్ వీడియోలు, క్రియేట్ చేసిన, మార్చిన ఫొటోలు, క్లోన్ చేసిన లేదా కృత్రిమ వాయిస్ రికార్డింగ్‌లు ఉన్నాయి. – యాకుబ్ పాషా కొత్త రూల్స్కొత్త నిబంధనల ప్రకారం... యూజర్లు తప్పుదారి పట్టకుండా ఉండేందుకు చట్టబద్ధమైన ఏఐ జనరేటెడ్ కంటెంట్‌పై స్పష్టమైన లేబులింగ్ ఉండాలి. ‘సింథటిక్‌గా రూపొందించబడింది’ అని పేర్కొంటూ కంటెంట్‌లో లేబుల్ ప్రదర్శించాలి. ‘డీప్‌ఫేక్‌లు, అనుమతి లేకుండా తీసిన ఫొటోలతో సహా చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను షేర్ చేయడం వల్ల చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి వస్తుంది’ అని ప్రతి మూడు నెలలకు ఒకసారి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు యూజర్లను హెచ్చరించాలి.సింథటిక్ కంటెంట్‌ను క్రియేట్ చేసే, వాటిని షేర్ చేసే ప్లాట్‌ఫామ్‌లు యూజర్లను చేర్చుకునే సమయంలో, ఆ తరువాత ప్రత్యేక హెచ్చరికలు జారీ చేయాలి. కంటెంట్‌ను దుర్వినియోగం చేయకుండా వారిని హెచ్చరిస్తూ, జరిమానాల గురించి వివరించాలి. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించడానికి గడువును గణనీయంగా తగ్గించారు. గతంలో ఆ గడువు 36 గంటలు ఉంటే ఇప్పుడు మాత్రం ప్రభుత్వం నుండి నోటీసు అందిన మూడు గంటల లోపు చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించాలి. లైంగిక కంటెంట్, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, నకిలీ గుర్తింపుకు సంబంధించిన కేసులలో వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. -
ఛీ ఇంత నీచమా? జాన్వీ ఎమోషనల్
-
తాట తీస్తాం చుట్టమల్లే డీప్ ఫేక్ పై నాగవంశీ వార్నింగ్
-
చుట్టమల్లే వివాదం.. ఇదేం తొలిసారి కాదు!
ఓ సినిమా పాట.. ఓ హీరోయిన్.. ఓ వైరల్ వీడియో. చూస్తే ‘వార్నీ.. ఇంత ఘోరమా!’ అనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే.. సినిమాలో లేని సన్నివేశం అది. జరగని ఘటన. నిజమైన వ్యక్తి చేయని పని. ఏఐతో తయారు చేసిన ఫేక్ కంటెంట్. అది నీచాతి నీచంగా!. అంతకు ముందు కూడా అంతే.. ఓ నటిని లిఫ్ట్‌లో డీప్‌ఫేక్ అనే సాంకేతికతతో అసభ్యకరంగా చూపించి వైరల్ చేశారు.‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటను ఆధారంగా చేసుకుని జాన్వీ కపూర్‌ను అశ్లీంగా చూపించేలా రూపొందించిన ఓ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించారు. నీచుల్ని వదలబోనని అన్నారు. వీడియోను రూపొందించిన వారిపైనే కాకుండా.. దాన్ని ప్రచారం చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.తాజాగా జాన్వీ కపూర్ కూడా స్పందించారు. తన అనుమతి లేకుండా ఇలాంటి కంటెంట్ రూపొందించి ప్రచారం చేయడం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. ఇది కేవలం ఓ మార్ఫింగ్ వీడియో కాదని.. తన గౌరవం, వ్యక్తిగత హద్దులను ఉల్లంఘించే చర్య అని పేర్కొన్నారు. చిరంజీవి, రామ్ పోతినేని, ఆర్జీవీ తదితరులు కూడా దీనిపై స్పందించారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. చుట్టమల్లే వీడియో ఒక్కటేనా?.కాదు. సోషల్ మీడియాలోకి వెళ్తే.. ఇది చాలా పెద్ద సమస్యలోని ఓ ఉదాహరణ మాత్రమేనని అర్థమవుతుంది. హీరోహీరోయిన్ల ఫొటోలు, సినిమా సన్నివేశాలు, ఇంటర్వ్యూలు, రీల్స్.. ఏదైనా సరే. వాటిని తీసుకుని మరో రూపంలోకి మార్చడం ఇప్పుడు చాలా సులభమైంది. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీల విషయంలో ఈ దుర్వినియోగం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ముఖాన్ని మరో వ్యక్తి శరీరానికి జోడించడం.. అసలు లేని సన్నివేశాన్ని ఉన్నట్టుగా చూపించడం.. నిజమైన వీడియోలో ముఖాన్ని మార్చడం.. అశ్లీలంగా ఎడిట్ చేయడం.. ఇలా డీప్‌ఫేక్‌ల రూపాలు మారుతున్నాయి.హీరోలకు ఒకలా.. వాళ్లకు మరోలా!చుట్టమల్లే సాంగ్ ఘటనపై దుమారం రేగుతుండగానే.. మరో హీరోయిన్‌కు సంబంధించిన ఫేక్ కంటెంట్ బయటకు రావడం కూడా కనిపిస్తోంది. ఒకసారి వైరల్ అయిన ఫార్మాట్‌ను అనుకరిస్తూ కొత్త వీడియోలు తయారవుతున్నాయి. వాటి కోసం ప్రత్యేకంగా వెతికేవారు, మళ్లీ షేర్ చేసేవారు కూడా ఉంటున్నారు. ఇక్కడే మరో తేడా కనిపిస్తోంది.హీరోలను టార్గెట్ చేస్తే సాధారణంగా ట్రోలింగ్, మీమ్స్, డైలాగ్ ఎడిట్లు కనిపిస్తాయి. కానీ మహిళా సెలబ్రిటీల విషయంలో అదే ట్రోలింగ్ చాలాసార్లు అశ్లీల మార్ఫింగ్, డీప్‌ఫేక్‌ల దిశగా వెళ్తోంది. అంటే సమస్య కేవలం ఫేక్ కంటెంట్ తయారు చేయడంలోనే లేదు. దాన్ని ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? ఎవరు షేర్ చేస్తున్నారు? అన్నదీ ఇప్పుడు కీలకంగా మారింది.‘ఫేక్’ అని తెలిసినా కూడా..డీప్‌ఫేక్‌లలో అత్యంత ప్రమాదకరమైన అంశం ఇదే. అది ఫేక్ వీడియో అని తెలిసినప్పటికీ.. “చూడండి ఎంత దారుణంగా ఉంది” అంటూ కొందరు దాన్ని మళ్లీ పోస్టు చేస్తారు. దీంతో అసలు వీడియోకు మరింత రీచ్ వస్తుంది. ఒక్కసారి సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించిన తర్వాత దాని కాపీలను పూర్తిగా తొలగించడం కూడా చాలా కష్టమవుతుంది. చుట్టమల్లే ఘటనలో ఎన్టీఆర్ “చూడొద్దు.. షేర్ చేయొద్దు.. ఎంగేజ్ కావొద్దు” అని చెప్పడానికి కారణం కూడా ఇదే. విమర్శించాలన్న ఉద్దేశంతోనైనా ఆ కంటెంట్‌ను మళ్లీ ప్రచారం చేస్తే.. తెలియకుండానే దాని వ్యాప్తికి సహకరించినట్టవుతుంది.ఒక అకౌంట్ పోతే.. మరో అకౌంట్!మరి సోషల్ మీడియా సంస్థలు ఎందుకు పూర్తిగా అడ్డుకోలేకపోతున్నాయి?. నిబంధనలు ఉన్నా.. ప్రతి పోస్టును వెంటనే గుర్తించడం అంత సులభం కాదు. ఒక అకౌంట్‌ను తొలగిస్తే మరో అకౌంట్ నుంచి అదే కంటెంట్ రావచ్చు. ఒక వీడియోను తీసేసేలోపే దాని కాపీలు ఇతర అకౌంట్లకు చేరిపోయే అవకాశం ఉంది.ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఏఐతో రూపొందించిన లేదంటే మార్చిన సెలబ్రిటీ కంటెంట్ విస్తృతంగా చక్కర్లు కొట్టినట్టు పలు పరిశోధనలు గుర్తించాయి. కొన్ని సందర్భాల్లో అది ఏఐతో రూపొందించిందన్న విషయం కూడా స్పష్టంగా తెలియకుండా పోస్టు అవుతోంది. సోషల్ మీడియాలో మొదలైన కంటెంట్ అక్కడితో ఆగిపోవడం లేదు. ఇతర ప్లాట్‌ఫామ్‌లు, ప్రైవేట్ గ్రూపులు, మెసేజింగ్ చానెల్స్ ద్వారా కూడా మళ్లీ షేర్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఒక చోట తొలగించినా.. మరో చోట ప్రత్యక్షమవుతోంది. అందుకే ‘పోస్ట్ తొలగించాం’ అనడం వేరు.. ‘కంటెంట్ పూర్తిగా ఆగిపోయింది’ అనడం వేరు.93 శాతం మహిళలే టార్గెట్!ఇది కేవలం సెలబ్రిటీలకే పరిమితమైన సమస్య కాదు. 2026లో వచ్చిన ఓ నివేదిక ప్రకారం.. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న స్పష్టమైన లైంగిక డీప్‌ఫేక్ కంటెంట్‌లో దాదాపు 93 శాతం మహిళలను లక్ష్యంగా చేసుకున్నదే. అంతేకాదు.. ఇటువంటి కంటెంట్ పరిమాణం గత కొన్నేళ్లలో దాదాపు 900 శాతం పెరిగినట్టు నివేదిక పేర్కొంది. ఏఐ వచ్చాక మరింత ఈజీగతంలో ఇలాంటి ఫేక్ వీడియో తయారు చేయాలంటే ఎడిటింగ్ నైపుణ్యం, సమయం, ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరమయ్యేది. ఇప్పుడు జనరేటివ్ ఏఐ సాధనాలతో ఫొటోలు, వీడియోల్లో మార్పులు చేయడం చాలా సులభమైంది. దీంతో అసలు లేని దృశ్యాన్ని ఉన్నట్టుగా చూపించడం.. ఒక వ్యక్తిని మరో సన్నివేశంలోకి తీసుకురావడం.. ముఖాన్ని మార్చడం వంటి పనులు గతంతో పోలిస్తే చాలా తక్కువ శ్రమతోనే సాధ్యమవుతున్నాయి.అదే సమయంలో డీప్‌ఫేక్‌లు, సింథటిక్ మీడియా, అశ్లీల లేదా లైంగికంగా స్పష్టమైన ఫేక్ కంటెంట్‌పై ప్లాట్‌ఫామ్‌ల బాధ్యతలను పెంచే చర్యలపై ప్రభుత్వం కూడా దృష్టి పెడుతోంది. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించడం, ఫిర్యాదులపై వేగంగా స్పందించడం వంటి అంశాలు ఇందులో కీలకం.ఈరోజు జాన్వీ.. రేపు ఎవరు?అందుకే ‘చుట్టమల్లే’ వివాదాన్ని కేవలం జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఓ ఫేక్ వీడియోగా చూస్తే అసలు సమస్య కనిపించదు. ఇది సెలబ్రిటీ ఫొటోల దుర్వినియోగం.. ఏఐ మార్ఫింగ్.. డీప్‌ఫేక్‌లు.. అశ్లీల కంటెంట్.. సోషల్ మీడియా ట్రోలింగ్.. వైరల్ కల్చర్ అన్నీ కలిసిన పెద్ద సమస్యకు మరో ఉదాహరణ. ఒక వీడియోను ఎవరు తయారు చేశారు? అన్నదే కాదు.. దాన్ని ఎవరు వైరల్ చేస్తున్నారు? ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు? తొలగించిన తర్వాత మళ్లీ ఎలా ప్రత్యక్షమవుతోంది? అన్నదీ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ‘చుట్టమల్లే’.. రేపు మరో హీరోయిన్ కావచ్చు. మరో సెలబ్రిటీ కావచ్చు. చివరికి సాధారణ వ్యక్తి కూడా బాధితుడిగా మారొచ్చు. టెక్నాలజీ వేగంగా మారుతున్నప్పుడు.. దాని దుర్వినియోగాన్ని అడ్డుకునే వ్యవస్థ కూడా అంతే వేగంగా మారాల్సిన అవసరాన్ని ఈ వివాదం మరోసారి గుర్తుచేస్తోంది.ఇదీ చదవండి: AIని ఇక కంట్రోల్ చేయలేమా?


