టాలీవుడ్ స్టార్స్ @ భక్తి.. ఎవరికెవరు ఏ దేవుడంటే ఇష్టం? | From Stardom to Devotion: The Favourite Gods of Tollywood Celebrities | Sakshi
Sakshi News home page

తెరపై స్టార్‌డమ్‌.. తెరవెనుక దైవభక్తి.. టాలీవుడ్‌ తారల ఇష్టదైవాలు వీరే

Aug 20 2026 12:40 PM | Updated on Aug 20 2026 1:41 PM

From Stardom to Devotion: The Favourite Gods of Tollywood Celebrities

సినిమా తారలు అంటే అభిమానులకు తెరపై కనిపించే గ్లామర్‌, స్టైల్‌, యాక్షన్‌ మాత్రమే గుర్తొస్తాయి. కానీ తెర వెనుక చాలామంది హీరోహీరోయిన్లు ఆధ్యాత్మికతకు, దైవభక్తికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు. షూటింగ్‌ ప్రారంభించే ముందు దేవుడిని ప్రార్థించడం దగ్గరి నుంచి.. ప్రత్యేక సందర్భాల్లో ఆలయాలను సందర్శించడం వరకు తమ నమ్మకాన్ని చాటుకుంటుంటారు. కొందరికి శివుడు ఇష్టదైవం అయితే.. మరికొందరు వెంకటేశ్వరస్వామి, గణేశుడు, హనుమంతుడిని ఆరాధిస్తుంటారు. మరి టాలీవుడ్‌లో ప్రముఖ తారలు ఎవరెవరు ఏ దేవుడిని ఎక్కువగా కొలుస్తారో ఓసారి చూద్దాం.

చిరంజీవి – ఆంజనేయస్వామి
మెగాస్టార్‌ చిరంజీవికి ఆధ్యాత్మికతపై నమ్మకం ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంజనేయస్వామిని ఆయన ఎంతో భక్తితో కొలుస్తారని పలుమార్లు వెల్లడైంది. తనకు ఇష్టమైన దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటుంటారు. ఆంజనేయస్వామి భక్తుడిగా చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

రామ్‌ చరణ్‌- అయ్యప్పమాల
ఇండస్ట్రీలో దేవుడు మాల అనగానే చాలామందికి మెగాహీరో రామ్ చరణ్ గుర్తొస్తాడు. ఎందుకంటే కార్తీకమాసంలో అయ్యప్ప మాలలో కనిపిస్తుంటాడు. అందరూ స్వాములు చేసినట్లే చెప్పులు వేసుకోకుండా నిత్య పూజలు చేస్తూ కఠినమైన దీక్షని పాటిస్తాడు. ఓ తెలుగు హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ మనసులోని భక్తి మాత్రం మారలేదు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ – దైవభక్తితో ప్రత్యేక అనుబంధం
ఎన్టీఆర్ కుటుంబం కూడా తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తులే. రెండేళ్ల క్రితం కర్ణాటకలోని మూకాంబిక, ఉడుపి శ్రీకృష్ణ, కేశవనాథేశ్వర ఆలయాల్ని తల్లితో కలిసి తారక్ దర్శించుకున్నాడు. ఇంటిలోనూ నిష్టగా పూజలు చేస్తుంటాడు.

మహేశ్‌బాబు – తిరుమల వెంకన్నపై నమ్మకం
సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జీవితంలో ముఖ్యమైన సందర్భాల్లో దేవుడి ఆశీస్సులు తీసుకోవడం ఆయన కుటుంబానికి ఆనవాయితీగా ఉంది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే మహేశ్‌కు శ్రీరాముడు అంటే కూడా చాలా ఇష్టం.

బన్నీకీ దైవ భక్తి ఎక్కువే..
స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా దైవభక్తిని పాటిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలను సందర్శించడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం వంటి సందర్భాల్లో ఆయన కనిపించారు. తన జీవితంలో కుటుంబం, సంప్రదాయాలకు ప్రత్యేక స్థానం ఉందని ఆయన పలు సందర్భాల్లో చాటుకున్నారు.

ప్రభాస్‌ – శివుడిపై ప్రత్యేక అభిమానం
ప్రభాస్ పెద్దగా గుళ్లుగోపురాలు తిరిగినట్లు కనిపించాడు గానీ శివుడు-శ్రీరాముడికి భక్తుడు. తన సినిమాల్లో (బాహుబలి, ఆదిపురుష్ వంటివి) పౌరాణిక, ఆధ్యాత్మిక పాత్రలు చేసేటప్పుడు ప్రత్యేక ఉపవాసాలు, నియమాలు పాటిస్తూ ఉంటాడు. గతంలో 'ఆదిపురుష్'లో తనకెంతో ఇష్టమైన రాముడి పాత్ర కూడా చేశాడు.

నయనతార – తిరుమల వెంకన్న
దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార..    వెంకటేశ్వర స్వామి & రాజరాజేశ్వరి దేవి ఆలయాలని దర్శించుకుంటూ ఉంటుంది. అర్ధరాత్రి వేళల్లో ఎలాంటి వీఐపీ హడావుడి లేకుండా తిరుమల శ్రీవారిని గతంలో దర్శించుకుంది. అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు, యాగాలు కూడా గతంలో చేసినట్లు గుర్తు. భర్త విఘ్నేష్‌ శివన్‌తో కలిసి పలు ప్రముఖ దేవాలయాలను దర్శించిన సందర్భాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సమంత – ఆధ్యాత్మికత, యోగా
స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా ఆధ్యాత్మికత, యోగా, ధ్యానానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ప్రకృతితో మమేకం కావడం, ధ్యానం చేయడం వంటి విషయాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆమెకు ఆధ్యాత్మిక జీవనశైలి కూడా ఎంతో ముఖ్యమైనదిగా కనిపిస్తుంది.

అనుష్క శెట్టి- శివుడు
ప్రస్తుతం యాక్టింగ్ దాదాపుగా తగ్గించేసిన అనుష్క శెట్టి.. శివుడు-అమ్మవారికి పరమ భక్తురాలు. సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలను రహస్యంగా దర్శించుకుంటూ, ఆధ్యాత్మిక ఆశ్రమాలలో గడుపుతూ ఉంటుందని సమాచారం.

జాన్వీ..తిరుపతి
హీరోయిన్ జాన్వీ కపూర్ అయితే తిరుమల శ్రీవారిని ఎప్పటికప్పుడు దర్శించుకున్నట్లే కనిపిస్తూ ఉంటుంది. తన ప్రతి మూవీ విడుదలకు ముందు మెట్ల మార్గంలో కొండపైకి వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటుంది. పైన చెప్పిన వాళ్లే కాదు హీరోయిన్ మీనాక్షి చౌదరితో పాటు పలువురు చిన్న సెలబ్రిటీలు కూడా తిరుమల, కామాఖ్య, జ్యోతిర్లింగాల దర్శనాలు చేసుకుంటూ తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు.

సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా ఎప్పటికప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకుని, నియమ నిష్టలతో శబరిమల యాత్రకు వెళ్తుంటారు. అయ్యప్ప స్వామిపై తనకున్న అపార భక్తిని చాటుకుంటూ ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement