యశవంతపుర(కర్ణాటక): చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో మొదటి ముద్దాయిగా పరప్పన జైల్లో ఉన్న నటి పవిత్రగౌడ మాజీ భర్త సంజయ్‌సింగ్ మరణించాడు. అతడు 8 నెలల క్రితం చనిపోగా ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్ల నుంచి సంజయ్‌సింగ్ అనారోగ్యంతో బాధపడుతూ రాజస్థాన్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిసింది. చామరాజపేటెలో పవిత్రగౌడ సాధారణ యువతిగా ఉన్నప్పుడు సంజయ్‌సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతడు స్థానికంగా వ్యాపారం చేసేవాడు. వీరికి ఒక కూతురు ఉంది. తరువాత పవిత్రగౌడ టీవీ సీరియళ్లు, సినిమాల ద్వారా పేరు పొందగానే అతనికి విడాకులు ఇచ్చింది. ఆపై అతడు తాగుడుకు బానిసయ్యాడు. రేణుకాస్వామి హత్య కేసు తరువాత ఆమె గురించి మాట్లాడాడు.


