గత సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'తో ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ అందుకున్న స్టార్ హీరో వెంకటేశ్, ఎన్నో అద్బుతమైన మూవీస్ తీసిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలిసి పనిచేస్తున్నారని గతంలో అప్‌డేట్ రాగానే మూవీ లవర్స్ తెగ సంబరపడిపోయారు. 'మళ్లీశ్వరి', 'నువ్వు నాకు నచ్చావ్' స్టైల్ ఆఫ్ కామెడీ మూవీ చేస్తారని అనుకున్నారు. అందుకు తగ్గట్లే 'ఆదర్శ కుటుంబం' అని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీశారు. కాకపోతే విడుదలకు మరో ఐదారు రోజులే ఉన్నా బజ్ లేకపోవడం చిత్రంగా ఉంది.
(ఇదీ చదవండి: కొత్త తెలుగు సినిమాలు ఎలా ఉన్నాయి? కలెక్షన్స్ ఎంత?)
చాలా ఏళ్ల క్రితం త్రివిక్రమ్ రచయితగా ఉన్నప్పుడు వెంకీ సినిమాలకు పనిచేశారు. డైరెక్టర్ అయిన తర్వాత మాత్రం కాంబో సెట్ కాలేదు. అలా ఎట్టకేలకు వెంకీ-త్రివిక్రమ్ కాంబో కుదిరింది. అదే 'ఆదర్శ కుటుంబం'. లెక్క ప్రకారం గత వీకెండే థియేటర్లలో మూవీ రిలీజ్ కావాలి. కానీ ఓ వారం లేటుగా అంటే ఈ శుక్రవారం(అక్టోబర్ 09) రిలీజ్ చేస్తున్నారు. మూవీ టీమ్ నుంచి ఒకటి రెండు ఇంటర్వ్యూలు వచ్చాయి గానీ వీటిలో సినిమా గురించి వైరల్ అయ్యే కంటెంట్ ఏం కనిపించలేదు. ఇదో మూవీ వస్తోందని రెగ్యులర్ ఆడియెన్స్‌కే చాలామందికి ఇంకా తెలియదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. స్టార్ హీరో, దర్శకుడే పనిచేసినప్పటికీ ఎందుకిలా జరుగుతోందోనని సందేహాలు కలుగుతున్నాయి.

ఈ సినిమాని నిర్మించిన సంస్థలో నాగవంశీ భాగమే. సాధారణంగా తన నిర్మాణ సంస్థ నుంచి మూవీ రిలీజ్ ఉందంటే ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లతో 15 రోజుల ముందు నుంచే కాస్త హడావుడి చేస్తుంటారు. అలాంటి ఈయన కూడా 'ఆదర్శ కుటుంబం' గురించి పెద్దగా మాట్లాడినట్లు కనిపించలేదు. మరోవైపు 'ఆదర్శ కుటుంబం' గురించి గతంలో కొన్ని రూమర్స్ వినిపించాయి. కొన్ని నెలల క్రితం వచ్చిన తమిళ హిట్ సినిమా 'బ్లాస్ట్'కి దీనికి దగ్గర పోలికలు ఉన్నాయని అన్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఈసారి గురూజీ-వెంకీ ఏం చేస్తారో?
(ఇదీ చదవండి: సుకుమార్ ఇంటిచుట్టూ మూడేళ్లు తిరిగితే చివరకు: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల)


