సినిమా ఇండస్ట్రీ అంటే పైకి కనిపించేంత అందంగా ఉండదు. ఎవరికైనా సరే దిగితే గానీ లోతు అర్థం కాదు. ఇప్పుడు దర్శకులుగా గుర్తింపు తెచ్చుకున్న చాలామంది చిన్నదో పెద్దదో కష్టాలుపడి పైకి వచ్చినవాళ్లే. అలాంటి వాళ్లలో దసరా, ప్యారడైజ్ సినిమాలు తీసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఒకడు. స్టార్ దర్శకుడు సుకుమార్ దగ్గరే పనిచేయాలని పట్టుబట్టి ఏమేం చేశాడో తాజాగా రిలీజైన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఏకంగా మూడేళ్ల పాటు ఆయన ఇంటి చుట్టూ తిరిగిన విషయాన్ని పంచుకున్నాడు.
(ఇదీ చదవండి: కొత్త తెలుగు సినిమాలు ఎలా ఉన్నాయి? కలెక్షన్స్ ఎంత?)
'నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు శేషు అని ఓ సర్ ఉండేవారు. ఆయనకు సుకుమార్‌తో పరిచయం. అలా సుక్కు సర్ అవకాశం దొరుకుతుందేమోనని ప్రయత్నించాను గానీ కుదరలేదు. 'ఆర్య 2' తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో ఓసారి సుక్కు సర్‌ని కలిశాను. ఆయన దగ్గరే పనిచేయాలని ఏకంగా మూడేళ్ల పాటు సుకుమార్ ఇంటి చుట్టూ తిరిగాను. ఉదయం 5 గంటలకల్లా అపార్ట్‌మెంట్ దగ్గరకు వెళ్లిపోయేవాడిని. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ సరిగ్గా మూడేళ్లపాటు చెప్పాను. ఆ తర్వాత ఓసారి ఎవడ్రా నువ్వు? ఏం కావాలి నీకు? అని సుకుమార్ అడిగితే.. ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను చెప్పాను. అయితే ఓ షార్ట్ ఫిలిం తీసిరా చూద్దామని అన్నారు'
'షార్ట్ ఫిలిం తీసి వెళ్తే రకరకాల గొడవలు జరిగి ఎలాగోలా సుక్కు సర్ దగ్గర 'నాన్నకు ప్రేమతో' సినిమాకు పనిచేశాను. తర్వాత 'రంగస్థలం' కోసం షూటింగ్ మొదలైన రోజు నుంచి రిలీజైనంత వరకు పనిచేశాను. కేవలం రెండు మూవీస్ కోసం మాత్రమే పనిచేస్తానని సుక్కు సర్‌కి ముందే చెప్పేశాను. అయితే సుకుమార్ దగ్గర చేరడానికి ముందు దేశంలో నం.1 దర్శకుడి దగ్గర నాకు అవకాశమొచ్చింది. అప్పట్లోనే నెలకు రూ.50 వేల జీతం అన్నారు. కానీ నేను చేస్తే సుకుమార్ దగ్గరే పనిచేస్తానని ఆ ఛాన్స్ వదిలేసుకున్నాను' అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?)


