ఎక్కడైనా సరే సక్సెస్ వస్తే అన్ని బాగానే ఉంటాయి. లేదంటేనే లెక్కలు మారిపోతాయి. ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ విషయంలో ఇదే జరిగినట్లు కనిపిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగి 'ఆదర్శ కుటుంబం' హిట్ అయ్యంటే ఈ పాటికే 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్‌తో గురూజీ బిజీ అయిపోయేవాడు. కానీ అది ఉందని చెబుతున్నప్పటికీ కొత్త రూమర్స్ కూడా బయటకు వస్తున్నాయి.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీకి వచ్చిన కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
లెక్క ప్రకారం త్రివిక్రమ్.. 'ఆదర్శ కుటుంబం' తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయాలి. అయితే ఇది ఆగిపోయిందని రూమర్స్ రాగానే టీమ్ క్లారిటీ ఇచ్చింది. అలాంటిదేం లేదని ఒక్క ఫొటో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చేసింది. మరోవైపు ఎన్టీఆర్.. అనిల్ రావిపూడితో సినిమా ప్రకటించడంతో.. త్రివిక్రమ్‌తో చేయాల్సిన చిత్రం ఎప్పుడు మొదలవుతుందా అని సందేహాలు రేకెత్తుతున్నాయి. తారక్ చేస్తున్న 'డ్రాగన్' షూటింగ్ వచ్చే ఏడాది వేసవి టైంకి పూర్తవ్వొచ్చు. దీని తర్వాత రావిపూడితో ప్రాజెక్ట్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది.
మరి అనిల్ రావిపూడి, త్రివిక్రమ్‌తో చేయాల్సిన సినిమాలు రెండింటిని ఒకేసారి మేనేజ్ చేస్తాడా? అంటే లేదు లేదు.. గురూజీ- ఎన్టీఆర్ మూవీ ఇంకా ఆలస్యమయ్యే అవకాశముందని, అంతలో చిరుతో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తారని టాక్ వినబడుతోంది. గతంలో రామ్ చరణ్ కోసం అనుకున్న కథనే కాస్త మార్చి ఇప్పుడు చిరుతో తీయబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి కూడా బాబీతో మూవీ చేస్తున్నారు. దీని తర్వాత ఇంకా ఏ దర్శకుడికి కమిట్‌మెంట్ ఇవ్వలేదు. కొన్నిరోజుల క్రితమే త్రివిక్రమ్, చిరుకి కథ కూడా చెప్పారని టాక్ నడుస్తోంది. చూస్తుంటే చిరు-త్రివిక్రమ్ కాంబో సెట్ అయ్యేలానే ఉంది.
ఒకవేళ చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా చేస్తే గనుక దీనితో కచ్చితంగా హిట్ కొట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని ఫలితం బట్టి 'గాడ్ ఆఫ్ వార్'పై హైప్ పెరగడం తగ్గడమనేది ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?
(ఇదీ చదవండి: తెలుగు హీరోకి రూ.3.5 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన బాలీవుడ్ నిర్మాత)


